ఇంజనీరింగ్ సీట్ల మిగులులో ఐదో స్థానంలో తెలంగాణ
నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్
సాక్షి, హైదరాబాద్: నాణ్యతా ప్రమాణాల్లేని కాలేజీలు.. ఉపాధి అవకాశాలను అందించని చదువులు.. వెరసి ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు పెద్ద సంఖ్యలో మిగిలిపోతున్నాయి! కాలేజీల్లో ఏటా సీట్ల సంఖ్య పెరుగుతున్నా.. వాటిలో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇదే ధోరణి కనిపిస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్ కాలేజీల్లోని సీట్ల భర్తీ క్రమంగా తగ్గిపోయింది. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. ఇంజనీరింగ్ సీట్ల మిగులులో తెలంగాణ ఐదో స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఆ రాష్ట్రంలోని కాలేజీల్లో ఏకంగా 80 శాతం సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. మిగులు సీట్ల విషయంలో యూపీ మొదటి స్థానంలో ఉండడం గమనార్హం.
ఇక ఇంజనీరింగ్‌లో నాణ్యతకు పెద్దపీట వేస్తూ, ఉపాధి అవకాశాలకు అవసరమైన చర్యలు చేపడుతున్న కర్ణాటక.. సీట్ల భర్తీలో మొదటి స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో మిగిలిపోయిన సీట్లు కేవలం 15 శాతమే. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఆ రాష్ట్రంలో 20 శాతం సీట్లు మాత్రమే మిగులుతున్నాయి. ఈ నేపథ్యంలో నాణ్యమైన విద్య అందిస్తూ, ఉపాధి అవకాశాలకు చర్యలు తీసుకుంటేనే ఇంజనీరింగ్ చదువులకు మనుగడ ఉంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ దిశగా కసరత్తు ప్రారంభించినా.. పక్కా ప్రణాళికలతో ముందుకు సాగితేనే మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడుతున్నారు.
ఉపాధి కల్పన ఎక్కడ..?
ఐటీలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉద్యోగ అవకాశాల కల్పనలో మాత్రం వెనుకంజలో ఉన్నాయి. ఒకప్పుడు అగ్రశ్రేణి దేశాల సరసన నిలిచిన మన విద్యార్థులు ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్, సబ్జెక్టు సామర్థ్యాల విషయంలో చతికిలపడుతున్నారు. కాలేజీల మధ్య అనారోగ్యకర పోటీ, సీట్లు నింపుకునే తాపత్రయం, నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది.
నాణ్యతకు తెగులు.. సీట్లు మిగులు!
Published Sun, Dec 21 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM
Advertisement
Advertisement