జీ-20 బ్రిస్బేన్ సదస్సు- సింహావలోకనం | G -20 Brisbane Summit in the international financial consequences | Sakshi
Sakshi News home page

జీ-20 బ్రిస్బేన్ సదస్సు- సింహావలోకనం

Published Thu, Dec 4 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM

G -20 Brisbane Summit in the international financial consequences

అంతర్జాతీయ ఆర్థిక పరిణామాల పరిశీలన... అగ్ర రాజ్యాల మధ్య పరస్పర సహకారమే ధ్యేయంగా... ప్రపంచ పురోగతికి కృషి చేస్తున్న జీ-20 తొమ్మిదో శిఖరాగ్ర సదస్సుకు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ ఆతిథ్యమిచ్చింది. రెండు రోజులు జరిగిన సమావేశంలో  సభ్య దేశాలు తమ జాతీయ స్థూల ఉత్పత్తిని 2 శాతానికి పెంచాలని, పెట్టుబడులు,  వాణిజ్యం, ఉద్యోగావకాశాలను విస్తృతం చేయాలంటూ కార్యాచరణ ప్రణాళికను  ప్రకటించాయి. అయితే నిర్దేశించిన లక్ష్యాలు ఘనంగానే ఉన్నా... వీటిని అధిగమించడం  కత్తిమీద సామే. ఈ నేపథ్యంలో 2015 టర్కీలో జరగబోయే పదో శిఖరాగ్ర సదస్సు నాటికి  ఎలాంటి ఫలితాలతో కూటమి దేశాలు కలుసుకుంటాయో వేచిచూడాలి!
- డా॥బి.జె.బి. కృపాదానం
 సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ
 ఆర్.సి. రెడ్డి స్టడీ సర్కిల్

 
 నవంబరు 15-16 తేదీల్లో బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా)లో జరిగిన జీ-20 తొమ్మిదో శిఖరాగ్ర సదస్సు ఆశాజనక తీర్మానాలతో ముగిసింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచి మెల్లగా బయటపడుతున్న తరుణంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న అగ్ర రాజ్యాధినేతల సమావేశం ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసి భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.
 
 భారత్ పాత్ర:
 వర్ధమాన దేశాలలో ప్రముఖ దేశమైన భారత్.. ప్రారంభం నుంచి జీ-20 కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటోంది. ఇప్పటివరకు జరిగిన శిఖరాగ్ర సమావేశాలకు భారత ప్రధానులు,ఆర్థిక మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరవుతూ... ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాల భాగస్వామ్యాన్ని పెంచడానికి కృషి చేశారు. అభివృద్ధి చెందిన దేశాల నుంచి వర్ధమాన దేశాలకు మరింతగా ఆర్థిక వనరులను బదిలీ చేయడం ద్వారానే బడుగు దేశాల ప్రగతి సాధ్యమవుతుందని భారతదేశం పదేపదే చెబుతోంది.
 
 జీ-20 ఆవిర్భావం వెనుక:
బ్రిస్బేన్ కార్యాచరణ ప్రణాళికను విశ్లేషించే ముందు, జీ-20 పుట్టుపూర్వోత్తరాలను, దాని పరిణామాన్ని, ఇప్పటి వరకు జరిగిన శిఖరాగ్ర సమావేశాల్లో చర్చకు వచ్చిన ముఖ్య ప్రతిపాదనలను ఒకసారి పరికిస్తే... అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలను విశ్లేషిస్తూ, అగ్రరాజ్యాల మధ్య సహకారాన్ని పెంపొందించి ప్రపంచ పురోగతికి కృషి చేస్తున్న 20 దేశాల కలయికే ఈ జీ-20. ఇది 1990 దశకంలో ప్రారంభమైంది. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 20 దేశాల సమష్టి వేదికగా ఆవిర్భవించిన గ్రూప్ ఆఫ్ 20 (జీ-20) 1999లో కేవలం ఆర్థిక మంత్రుల, బ్యాంకర్ల వేదికగానే ఏర్పడింది. 2008లో మాంద్యం భూతం ప్రపంచాన్ని భయపెట్టిన తర్వాత అవసరాలు మారాయి. ఈ నేపథ్యంలో ఇది దేశాధినేతల వేదికగా రూపాంతరం చెందింది. దీనిలో 19 దేశాలు, వాటికి తోడుగా ఐరోపా దేశాలన్నింటి సమూహంగా యూరోపియన్ యూనియన్ ఒకే బృందంగా పాల్గొంటోంది. 90 శాతం ప్రపంచ స్థూల ఉత్పత్తి, 80 శాతం ప్రపంచ వాణిజ్యం, మూడింట రెండొంతుల ప్రపంచ జనాభాకు ఈ కూటమి ప్రాతినిధ్యం వహిస్తోంది.
 
 జీ-20 ముఖ్య లక్ష్యాలు:
 1.    {పపంచ వ్యాప్తంగా ఆర్థిక సుస్థిరత, పెరుగుదల సాధించడానికి ఈ దేశాల మధ్య విధాన పరమైన సమన్వయాన్ని సాధించడం
 2.    భవిష్యత్‌లో ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా ఆర్థిక నిబంధనలను ప్రోత్సహించడం
 3.    నూతన అంతర్జాతీయ విత్తశిల్పాన్ని రూపొందించడం.
 
 1990లో వర్ధమాన దేశాలలో సంభవించిన ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం ప్రపంచ ఆర్థిక పాలనలో ఆయా దేశాలు సరైన భాగస్వామ్యాన్ని కలిగి ఉండక పోవడమే. 1999 డిసెంబరులో అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంక్‌ల గవర్నర్లు బెర్లిన్ (జర్మనీ)లో సమావేశమయ్యారు. ఇందులో ప్రపంచ ఆర్థిక సుస్థిరతకు సంబంధించిన ముఖ్యాంశాలపై చర్చించారు. అప్పటినుంచి ఏటా ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంక్‌ల గవర్నర్లు సమావేశమవుతున్నారు. 2002లో భారతదేశం జీ-20 ఆర్థిక మంత్రుల సమావేశానికి ఆతిథ్యమిచ్చింది.
 
 లక్ష్యం ఘనం.. కానీ ఆచరణ?
 బ్రిస్బేన్ సదస్సు లక్ష్యాలు ఆదర్శవంతంగా ఉన్నాయి. కానీ అవి ఎంతవరకు ఆచరణాత్మకమనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అదనంగా రెండు ట్రిలియన్ డాలర్ల సేకరణ, మిలియన్ల కొద్దీ ఉద్యోగాలు సృష్టించడం సాధ్యమవుతుందా? కార్మిక మార్కెట్ సరళీకృతం నెపంతో సగటు కార్మికుణ్ని నిరంకుశంగా ఉద్యోగం నుంచి తొలగించడం సబబేనా? విత్తపరమైన పొదుపు కార్యక్రమాల పేరుతో ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం, తద్వారా పేద ప్రజల కోసం ప్రారంభించిన ఉద్దీపన కార్యక్రమాలను రద్దు చే స్తే వారి పరిస్థితి ఏంటి? చైనా ప్రతిపాదించిన ‘ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు’ విషయంలో నిర్లిప్తత చూపడం అగ్ర రాజ్యాల చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోంది. ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన ‘హరిత పర్యావరణ నిధి’ (ఎట్ఛ్ఛ ఛిజీఝ్చ్టజీఛి జఠఛీ) ఏర్పాటును ఆతిథ్య దేశమైన ఆస్ట్రేలియా వ్యతిరేకించింది. వర్ధమాన దేశాలు, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు ఎప్పటినుంచో ఓటింగ్‌లో తమకు తగిన ప్రాధాన్యత కల్పించాలన్న ప్రతిపాదనను అమెరికాతో సహా మిగిలిన సంపన్న దేశాలు వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో జీ-20 కూటమి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఏమేర కృతకృత్యమవుతుందన్నది సందేహమే.
 
 గత సదస్సులు-సమీక్షలు
 తొలి సదస్సు: 2008లో అప్పటి ఆర్థిక సంక్షోభంపై చర్చించడానికి తొలిసారిగా మొదటి శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి అమెరికా రాజధాని వాషింగ్టన్ నగరం వేదికయింది. నవంబరు 2008లో జరిగిన ఈ సమావేశంలో ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి దారితీసిన పరిస్థితులపై చర్చించారు. దీన్నుంచి బయటపడటానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.
 
 ఈ ప్రణాళిక లక్ష్యాల్లో..
 ఎ) ప్రపంచ ప్రగతి పునఃస్థాపన బి) అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం సి) ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సంస్కరించడం ప్రధానమైనవి.
 
 రెండో సదస్సు:
 ఈ సదస్సు లండన్‌లో ఏప్రిల్ 2009లో జరిగింది. 1.1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లతో ఉద్దీపన కార్యక్రమం (Stimulas package) అమలు చేయడం ద్వారా వివిధ దేశాలకు బదిలీ సదుపాయం కల్పించడం, పటిష్ట నిబంధనావళి రూపకల్పన- అమలు, ఆర్థిక సుస్థిరత మండలి (ఊజ్చీఛిజ్చీ ట్టట్చ్ట్ఛజడ) ఏర్పాటు, బ్యాంకుల పర్యవేక్షణకు బేసల్ కమిటీ నెలకొల్పటం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల సంస్కరణ, రక్షక, వాణిజ్య పెట్టుబడి విధానాలను ప్రతిఘటించడం మొదలైన ప్రతిపాదనలపై చర్చ జరిగింది.
 
 మూడో సదస్సు:
 సెప్టెంబరు 2009లో జరిగిన మూడో సదస్సుకు పిట్స్‌బర్గ్ (అమెరికా) వేదికయింది. జీ-20 కూటమిని అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి ప్రధాన సాధనంగా సదస్సులో గుర్తించారు. సరైన స్థూల ఆర్థిక విధానాల ద్వారా శక్తిమంతమైన సమతుల్య పెరుగుదలను సాధించాలని నిర్ణయించారు. తరచూ ఆర్థిక రంగంలో సంభవిస్తున్న ఆటుపోట్లను నివారించడానికి పరస్పర మదింపు ప్రవృత్తి (Mutual assessment process) విధానం అమలుకు నిర్ణయించారు. భారత్ సహా అధ్యక్ష హోదాలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల ను సంస్కరించడానికి చొరవ తీసుకున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధిలో వర్ధమాన దేశాల కోటాను ఎక్కువ చేయాలని, ప్రపంచ బ్యాంకులో పేద దేశాల ఓటింగ్ శక్తి కనీసం 3 శాతానికి పెంచాలని సిఫారసు చేశాయి.
 
 నాలుగో సదస్సు:
 
 జూన్ 2010న టొరంటో(కెనడా)లో జరిగిన నాలుగో సదస్సులో.. పునఃస్థాపన, నూతన ప్రారంభం (Recovery and new begininng) అనే అంశానికి ప్రాధాన్యమిచ్చారు. అభివృద్ధి చెందిన దేశాలు తమ విత్తలోటు (Fiscal deficit)ను సగానికి తగ్గించడానికి అంగీకరించాయి. 2016 నాటికి రుణ స్థిరీకరణకు పారిశ్రామిక దేశాలు సుముఖత వ్యక్తం చేశాయి. మొదటిసారిగా జీ-20 అజెండాలో అభివృద్ధి అంశాన్ని చేర్చారు.
 
 ఐదో సదస్సు:
 2010 నవంబరులో సియోల్(దక్షిణ కొరియా రాజధాని) లో ఐదో శిఖరాగ్ర సమావేశం జరిగింది. అభివృద్ధి అజెండాలో భాగంగా బహువార్షిక ప్రణాళిక రూపొందించి, మౌలిక సదుపాయాలు, మానవ వనరుల అభివృద్ధి, వాణిజ్యం, ప్రభుత్వేతర పెట్టుబడి, ఉద్యోగ కల్పన, ఆహార భద్రత పెరుగుదల, దేశీయ వనరుల సమీకరణ, విజ్ఞానాన్ని పంచుకోవడం ఆర్థిక స్వావలంబన అనే అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించారు.
 
 ఆరో సదస్సు:
 ఆరో శిఖరాగ్ర సమావేశం నవంబరు 2011న కేన్స్ (ఫ్రాన్స్)లో జరిగింది. యూరోజోన్ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక పరిస్థితిని సమీక్షించారు. మార్కెట్ క్రమబద్ధీకరణ, ఇంధన మార్కెట్‌లో పారదర్శకత మొదలైన అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఉమ్మడి భవిష్యత్ నిర్మాణం, అందరికీ ప్రయోజనం కలిగించే సమష్టి కార్యాచరణ అనే సంయుక్త ప్రకటన వెలువడింది.
 
 ఏడో సదస్సు:
 ఏడో శిఖరాగ్ర సదస్సు లాస్‌కాబోస్ (మెక్సికో)లో జూన్ 2012లో జరిగింది. ఇందులో.. ఆర్థిక సుస్థిరత, నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా పెరుగుదల, ఉద్యోగావకాశాలకు పునాది, ఆర్థిక వ్యవస్థ పటిష్టత, అంతర్జాతీయ ఆర్థిక శిల్పకతను మెరుగుపరచడం, ఆహార భద్రతను పెంపొందించడం, పర్యావరణ మార్పు నిరోధానికి చర్యలు చేపట్టడంపై చర్చించారు.
 
 ఎనిమిదో సదస్సు:
 ఎనిమిదో సదస్సు సెప్టెంబరు 5-6, 2013న సెయింట్ పీటర్స్‌బర్గ్ (రష్యా)లో జరిగింది. ప్రపంచంలో సమతుల్య అభివృద్ధి, ఉద్యోగావకాశాల పెంపు, స్వావలంబన, విశ్వసనీయత, పారదర్శకత, ప్రభావవంతమైన క్రమబద్ధీకరణ మొదలైన అంశాలపై చర్చించారు.
 
 తొమ్మిదో శిఖరాగ్ర సదస్సు:
 బ్రిస్బేన్‌లో జరిగిన తొమ్మిదో శిఖరాగ్ర సమావేశంలో దేశాధిపతుల సంయుక్త ప్రకటన అంశాలు.
 1.    అభివృద్ధి పెంపు, ఉద్యోగాల సృష్టికి సమష్టిగా పనిచేయడం
 2.    శక్తిమంతమైన విశ్వ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం
 3.    అంతర్జాతీయ వ్యవస్థలను బలోపేతం చేయడం అనే అంశాలను ప్రస్తావించారు.
     ఈ మూడు లక్ష్యాలను సాధించడానికి కార్యాచరణ ప్రణాళికను విడుదల చేశారు. దీని ప్రకారం...
 ఎ.    జీ-20 దేశాలు జాతీయ స్థూల ఉత్పత్తిని 2 శాతం కంటే ఎక్కువ సాధించాలి
 బి.    పెట్టుబడులు, వాణిజ్యం, పోటీ, ఉద్యోగావకాశాలు పెంపొందించడానికి సమష్టిగా కృషి చేయాలి.
 సి.    విధానపరమైన సహకారాన్ని పటిష్టపరచాలి.
 
 జీ-20 సభ్యదేశాలు
 అర్జెంటైనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్,జర్మనీ, భారత్, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, యునెటైడ్ కింగ్‌డమ్, యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement