డాక్టర్ కావాలనేది.. చిన్ననాటి కోరిక! | i want to become a doctor, my childwood dream | Sakshi
Sakshi News home page

డాక్టర్ కావాలనేది.. చిన్ననాటి కోరిక!

Published Thu, Dec 4 2014 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM

డాక్టర్ కావాలనేది.. చిన్ననాటి కోరిక!

డాక్టర్ కావాలనేది.. చిన్ననాటి కోరిక!

సక్సెస్ స్పీక్స్:  దేశంలోని వైద్య విద్య, పరిశోధనలో ప్రఖ్యాత విద్యా సంస్థ జిప్‌మర్ (జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్). ఇది ఆఫర్ చేసే మూడేళ్ల ఎండీ/ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే జాతీయ స్థాయిలో తీవ్ర పోటీని ఎదుర్కొని, జిప్‌మర్ పీజీ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించాల్సిందే. ఇలాంటి పరీక్షలో ఖమ్మం జిల్లాకు చెందిన సూరంపల్లి విజయ్ మూడో ర్యాంకును సొంతం చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే తన విజయానికి కారణమంటున్న విజయ్ తన అనుభవాలను సాక్షి ‘భవిత’తో పంచుకున్నారు. ఆ వివరాలు..
 
 ఈ ఏడాది మార్చిలో ఎంబీబీఎస్ ‘హౌజ్ సర్జన్’ పూర్తి చేశాను. అత్యుత్తమ కళాశాలలో జనరల్ మెడిసిన్‌లో పీజీ చేయాలనే సంకల్పంతో ముందడుగు వేశాను. దేశంలోని ప్రతిష్టాత్మక మెడికల్ విద్యాసంస్థల ప్రవేశ పరీక్షలపై దృష్టి సారించాను. వాటిలో జనరల్ మెడిసిన్ సీటు సాధించాలంటే టాప్‌టెన్ ర్యాంకు తప్పనిసరి. అందుకనుగుణంగానే ప్రణాళిక సిద్ధం చేసుకుని, పట్టుదలతో చదివాను. జిప్‌మర్ పీజీ ప్రవేశ పరీక్షకు హాజరయ్యాను. ఇందులో మూడో ర్యాంకు రావడం ఆనందం కలిగిస్తోంది.
 
 నాన్న ప్రోత్సాహం:
 ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రం నా స్వస్థలం. అమ్మ శిరోమణి, నాన్న నరసింహరావు. మాది వ్యవసాయ కుటుంబం. నాన్న ఏడో తరగతి వరకే చదువుకున్నారు. అందుకే నన్ను ఉన్నత చదువులు చదివించాలని కోరుకునేవారు. నాన్న దృష్టిలో పెద్ద చదువంటే డాక్టర్ చదువే. చిన్నతనంలో నాకు జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడే.. డాక్టర్ కావాలనే ఆశయాన్ని ఏర్పరచుకున్నాను. పదోతరగతిలో స్నేహితులతో కలిసి చిన్న నాటకం ప్రదర్శించే సందర్భంలో నేను కోరికోరి డాక్టర్ పాత్రను ఎంచుకున్నా.
 
 పాఠశాల విద్య:
 పాఠశాల స్థాయిలో తరగతిలో టాపర్ కానప్పటికీ మంచి మార్కులే సాధించేవాడిని. అప్పటివరకు చదివే పాఠశాలలో బోధన సంతృప్తికరంగా లేకపోవ డంతో తొమ్మిదో తరగతిలో ఊరికి దూరంగా ఉన్న పాఠశాలలో చేరాను. అమ్మానాన్నలతోపాటు అక్క, బావల ప్రోత్సాహంతో చదువులో మంచి ప్రతిభ చూపగలిగాను. పదోతరగతిలో 554 మార్కులు, ఇంటర్మీడియెట్‌లో 95.1 శాతం మార్కులు సాధించా. ఎంసెట్‌లో తొలిసారి 2000 ర్యాంకు లభించింది. దాంతో ఏడాది దీర్ఘకాల శిక్షణ తీసుకున్నాను. 620 ర్యాంకు సాధించి ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలలో సీటు లభించింది. ఎంబీబీఎస్‌లో 73.3 శాతం మార్కులు వచ్చాయి.
 
 మెడిసిన్ చదువు:
 కలలు కన్న డాక్టర్ వృత్తి కళ్లముందు కనిపిస్తుంటే... కొత్త కళాశాల, కొత్త పరిచయాలు.. ఇవేవీ నన్ను ఆందోళనకు గురిచేయలేదు. ఎంబీబీఎస్ ఆహ్లాదంగా గడిచిపోయింది. మంచి స్నేహితులు పరిచయమయ్యారు. క్లాస్ రూం బోధన, ప్రాక్టికల్స్, స్నేహితులతో స్టడీస్, సబ్జెక్ట్ డిస్కషన్, చిట్‌చాట్ ఇదే రోజువారీ దినచర్యగా మారిపోయింది. నా స్నేహితుడు నాగేశ్వరరావు సబ్జెక్టులో సందేహాలతోపాటు వ్యక్తిగతంగానూ నాకు ఎంతో సహకారాన్ని అందించాడు. స్వామి వివేకానంద పుస్తకాలు చదివేలా నన్ను ప్రోత్సహించి, స్ఫూర్తిని నింపాడు. పూర్తి ఆసక్తితో చదివి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో అనాటమీలో గోల్డ్‌మెడల్ కూడా సాధించాను.
 
 జిప్‌మర్ ప్రిపరేషన్:
 ఎంబీబీఎస్ పూర్తయ్యాక పీజీ ప్రవేశ పరీక్షలపై దృష్టి సారించాను. అందుకోసం హైదరాబాద్‌కు వచ్చి ప్రిపరేషన్ కొనసాగించాను. ఓ ప్రైవేటు శిక్షణ సంస్థలో ఆర్నెల్ల పాటు కోచింగ్ తీసుకున్నాను. వారానికి రెండు రోజులు మాత్రమే తరగతులు ఉండేవి. మిగిలిన రోజుల్లో రివిజన్ చేసుకుంటూ సొంతంగా ప్రిపేరయ్యాను. మొదట ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్) రాత పరీక్షకు హాజరై 66వ ర్యాంకు సాధించాను. చంఢీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్(పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) ప్రవేశ పరీక్షలోనూ 60వ ర్యాంకు సాధించాను. జనరల్ మెడిసిన్ సీటు లభించే అవకాశం లేనందున ప్రిపరేషన్‌కు మరింత పదును పెట్టాను. జిప్‌మర్ పీజీ ప్రవేశ పరీక్ష రాసి మూడో ర్యాంకు సాధించాను. ఈ ఏడాది వివిధ విభాగాల్లో అందుబాటులో ఉన్న 108  సీట్ల కోసం సుమారు 16,000 మంది పరీక్షకు హాజరయ్యారు.
 
 సలహా:
 జిప్‌మర్ తదితర ప్రతిష్టాత్మక మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించాలంటే ఎంబీబీఎస్ నుంచే కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా చదవాలి. అకడమిక్ పరీక్షలతో పాటు పోటీ ప్రవేశ పరీక్షలను దృష్టిలో ఉంచుకోవాలి. ప్రవేశ పరీక్షల్లో ప్రశ్నలు కేవలం జ్ఞాపకశక్తిని పరీక్షించే కోణంలో కాకుండా... విశ్లేషణాత్మక శక్తిని జోడించి సాధించేలా అడుగుతారు. జిప్‌మర్‌లో మొత్తం 250 ప్రశ్నలకు మూడు గంటల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. కాబట్టి వేగంగా సమాధానాలు గుర్తించడం కూడా ప్రధానం. చదివిన అంశాలను ఎక్కువసార్లు రివిజన్ చేయడం తప్పనిసరి. చదువు పూర్తయ్యాక వైద్య రంగంలో నాకంటూ మంచి గుర్తింపు సాధించేందుకు కృషి చేస్తాను.
 
 ఎంబీఏ కోర్సును అందిస్తున్న ఐఐటీలు..
 ఎంబీఏ కోర్సును అందిస్తున్న ఐఐటీలేవి?
 -ఆదిత్య, వరంగల్.
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు ఇంజనీరింగ్ కోర్సులతోపాటు మేనేజ్‌మెంట్ విభాగంలో కూడా పలు కోర్సులను అందిస్తున్నాయి. వాటి వివరాలు..
     ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-ఖరగ్‌పూర్, వినోద్‌గుప్తా స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఎంబీఏ కోర్సును అందిస్తోంది. అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో ఇంజనీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ. కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. సంబంధిత రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రవేశాల సమయంలో ప్రాధాన్యతనిస్తారు.
     వివరాలకు: www.som.iit-kgp.ernet.in
 
     ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-ఢిల్లీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ఎంబీఏ కోర్సును పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ రెండు విధాలుగా అందిస్తోంది. అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/ఫార్మసీ) లేదా బీఎస్సీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదా ఏదైనా మాస్టర్స్ డిగ్రీ లేదా సీఏ/ఐసీడబ్ల్యూఏ. కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా పార్ట్ టైమ్ ఎంబీఏ కోర్సులో అడ్మిషన్ ఇస్తారు.
     వివరాలకు: http://dms.iitd.ac.in
 
     ఐఐటీ-మద్రాస్ (వివరాలకు: www.doms.iitm. ac.in/domsnew), ఐఐటీ-బాంబే (వివరాలకు: www.som.iitb.ac.in), ఐఐటీ-రూర్కీ (వివరాలకు: www.iitr.ac.in), ఐఐటీ-కాన్పూర్ (వివరాలకు: www.iitk.ac.in) కూడా ఎంబీఏ కోర్సును అందిస్తున్నాయి.
 
 ఎకనోమెట్రిక్స్ కోర్సును అందిస్తున్న యూనివర్సిటీలేవి?    
 - శ్వేత, నిర్మల్.
 ఆర్థిక రంగానికి సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించడానికి ఎకనోమెట్రిక్స్ తోడ్పడుతుంది. ఆర్థిక, గణాంక శాస్త్రాలకు చెందిన ఇంటర్‌డిసిప్లినరీ కోర్సు ఎకనోమెట్రిక్స్. దీన్ని పీజీ స్థాయిలో ఎకనామిక్స్ కోర్సులో భాగంగా బోధిస్తారు. కొన్ని యూనివర్సిటీలు మాత్రం ఎకనోమెట్రిక్స్ స్పెషలైజేషన్‌గా పీజీ కోర్సులను అందిస్తున్నాయి. అవి..
 
 శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
 కోర్సు: ఎంఏ (ఎకనోమెట్రిక్స్)
 వివరాలకు: www.svuniversity.ac.in
 ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ-తమిళనాడు
కోర్సు: ఎంఎస్సీ (ఎకనోమెట్రిక్స్)
 వివరాలకు: www.srmuniv.ac.in
 భారతీయార్ యూనివర్సిటీ-తమిళనాడు
 కోర్సు: ఎంఎస్సీ (ఎకనోమెట్రిక్స్)
 వివరాలకు: www.bu.ac.in
 
 ఇంటర్మీడియెట్ చదువుతున్నాను. బీడీఎస్ చేయాలని ఉంది. వివరాలు తెలపగలరు?
 -ప్రవీణ్, సూల్తానాబాద్.
 బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్)..
 ఎంబీబీఎస్‌కు ప్రత్యామ్నాయంగా అత్యధిక మంది విద్యార్థులు ఎంపిక చేసుకునే కోర్సు. బీడీఎస్ కోర్సు చేసిన వారు దంత సంబంధిత వ్యాధులకు చికిత్సలను అందిస్తారు. వీరిని డెంటిస్ట్‌లుగా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 23 కాలేజీల్లో మొత్తం 2,140 బీడీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. అర్హత: ఓపెన్ కేటగిరీ 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (బైపీసీ) ఉత్తీర్ణత (బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులు 40 శాతం; ఓసీ వికలాంగ విద్యార్థులు 45 శాతం మార్కులు సాధించాలి). ఎంసెట్‌లో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం (80 మార్కులు); బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 40 శాతం (64మార్కులు); ఓసీ పీహెచ్ అభ్యర్థులు 45 శాతం (72 మార్కులు) పొంది ఉండాలి. వ యసు: ప్రవేశ ప్రక్రియ చేపట్టే సంవత్సరం డిసెంబర్ 31 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. బీడీఎస్ తర్వాత పీజీ చేయొచ్చు. ఈ కోర్సును ఎండీఎస్(మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ)గా వ్యవహరిస్తారు. ఇందులో కూడా పలు స్పెషలైజేషన్స్ ఉంటాయి.  
 
 బయోటెక్నాలజీకి సంబంధించి అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్స్ ఏవి?
 -నితిన్, కొత్తగూడెం.
 బయోటెక్నాలజీకి సంబంధించి పలు రకాల స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉన్నాయి. అవి..
     ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ: దీన్ని పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. పెయింట్లు, కెమికల్, డిటర్జెంట్‌లు, టెక్స్‌టైల్స్ వంటి ఉత్పత్తుల్లో ఇది తోడ్పడుతుంది.
     మెడికల్ బయోటెక్నాలజీ: ఫార్మాస్యూటికల్, డయోగ్నోసిస్ ప్రొడక్ట్‌ల తయారీకి సంబంధించిన పరిశోధనల్లో మెడికల్ బయోటెక్నాలజీని ఉపయోగిస్తారు.
     ఫుడ్ బయోటెక్నాలజీ: ఆహార ఉత్పత్తుల పెంపు, నాణ్యతను మెరుగుపరిచే సాంకేతికతలో
 ఫుడ్ బయోటెక్నాలజీ తోడ్పడుతుంది.
     బయోఇన్ఫర్మాటిక్స్: వివిధ పరిశోధనల ద్వారా లభించిన సమాచారాన్ని కంప్యూటర్ ద్వారా నిక్షిప్తం చేయడానికి బయోఇన్ఫర్మాటిక్స్ ఉపయోగపడుతుంది.
     ఎంబీఏ (బయోటెక్నాలజీ): బయోటెక్ పరిశ్రమల వ్యాపార కార్యకలాపాలను పర్యవేక్షించడానికి రూపొందించిన స్పెషలైజేషన్ ఎంబీఏ (బయోటెక్నాలజీ).
 
 ఆయా స్పెలైజేషన్స్‌ను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
 ఐఐఐటీ-హైదరాబాద్ (వెబ్‌సైట్: http://biotech. iith. ac.in), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ-ముంబై (వెబ్‌సైట్: www.ictmumbai.edu.in), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (వెబ్‌సైట్: www.uohyd.ernet. in), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్-హైదరాబాద్ (వెబ్‌సైట్: www. ipeindia.org)
- టి. మురళీధరన్
 టి.ఎం.ఐ. నెట్‌వర్క్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement