భారత్–ఇజ్రాయెల్ సంబంధాలు
భారతదేశం 1950, సెప్టెంబర్ 17న ఇజ్రాయెల్‌ను అధికారికంగా గుర్తించింది. ముంబైలో ఇజ్రాయెల్ కాన్సులేట్ ఏర్పాటుకు 1953లో అనుమతిచ్చింది. అయితే పాలస్తీనాకు మద్దతు పలికిన నెహ్రూ ప్రభుత్వం ఇజ్రాయెల్‌తో దౌత్య సంబం«ధాలను మెరుగుపరచుకోలేదు. 1990వ దశకం ప్రారంభం నుంచి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మెరుగైంది. కాగా నరేంద్రమోదీ ప్రధాని పదవిని చేపట్టిన అనంతరం రెండు దేశాల మధ్య స్నేహ బంధాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.
2006లో కేంద్ర మంత్రులుగా ఉన్న శరద్ పవార్, కపిల్ సిబాల్, కమల్‌నాథ్ ఇజ్రాయెల్‌ను సందర్శించారు. 2006, అక్టోబర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ సైతం ఇజ్రాయెల్‌లో పర్యటించారు. 2012లో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.ఎం.కృష్ణ ఇజ్రాయెల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను పెంపొందించాలని అభిలషించారు. భారత్, ఇజ్రాయెల్ మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమైన తర్వాత రెండు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం పెరిగింది.
ఇది ప్రారంభంలో డైమండ్స్‌కు మాత్రమే పరిమితం కాగా, ప్రస్తుతం ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, ఐటీ రంగాలకు విస్తరించింది. 2017, జూలైలో భారత ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా అంతరిక్షం, వ్యవసాయం, నీటి సంరక్షణ వంటి కీలక రంగాల్లో సహకారానికి రెండు దేశాలు మధ్య ఏడు ఒప్పందాలు కుదిరాయి. ఈ పరిణామాల దృష్ట్యా భవిష్యత్తులో ఇజ్రాయెల్ భారత ఆర్థిక ఆధునికీకరణలో కీలక భాగస్వామిగా నిలిచే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
వాణిజ్యం
ఇజ్రాయెల్ మిలటరీ పరికరాలకు భారత్ అతిపెద్ద కొనుగోలుదారు కాగా, భారతదేశానికి రష్యా తర్వాత రెండో అతిపెద్ద రక్షణ పరికరాల సరఫరాదారుగా ఇజ్రాయెల్ నిలిచింది. 1999 – 2009 మధ్యకాలంలో భారత్, ఇజ్రాయెల్ మధ్య 9 బిలియన్ డాలర్ల విలువైన ‘మిలటరీ’ వాణిజ్యం జరిగింది. రెండు దేశాల మధ్య మిలటరీ, వ్యూహాత్మక సంబంధాల అభివృద్ధి.. తీవ్రవాద గ్రూపులకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, సంయుక్త మిలటరీ శిక్షణకు బాటలు వేసింది.
2014లో ఇజ్రాయెల్‌కు సంబంధించి భారతదేశం పదో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. భారత్, ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 1992లో 200 మిలియన్ డాలర్లు కాగా, 2014 నాటికి 4.52బిలియన్ డాలర్లకు పెరిగింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు ప్రారంభించాలని 2007లో ఇజ్రాయెల్ ప్రతిపాదించగా.. 2010లో అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ అంగీకరించారు.
ఇందులో భాగంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, నీటిæయాజమాన్యం, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం వంటి అంశాల్లో వాణిజ్య ఒప్పంద చర్చలు విజయవంతమైతే రెండు దేశాల మధ్య వాణిజ్యం 5 బిలియన్ డాలర్ల నుంచి 10 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేశారు. 2015లో వస్తువులకు సంబంధించి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతోపాటు పెట్టుబడి, సేవల వాణిజ్యానికి సంబంధించిన ప్రత్యేక ఒప్పందాల కోసం ఇరు దేశాలు చర్చించాయి.
భారత్ నుంచి ఇజ్రాయెల్‌కు జెమ్స్, విలువైన మెటల్స్, నాణేలు, ఆర్గానిక్ రసాయనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, మెడికల్, సాంకేతిక పరికరాలు, ప్లాస్టిక్ వాహనాలు, యంత్రాలు, టెక్స్‌టైల్స్ ఎగుమతి అవుతున్నాయి. ఇజ్రాయెల్ నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇనుము/ఉక్కు ఉత్పత్తులు, ఎరువులు, యంత్రాలు, ఆర్గానిక్ రసాయనాలు, ఇనార్గానిక్ కెమికల్స్, ప్లాస్టిక్‌ను భారత్ దిగుమతి చేసుకుంటుంది. 2016–17లో భారతదేశానికి ఇజ్రాయెల్ 38వ పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది 2016–17లో ఈ రెండు దేశాల మధ్య జరిగిన వాణిజ్య విలువ 5.02 బిలియన్ డాలర్లు. 2012–13తో పోల్చితే వాణిజ్య విలువలో పెరుగుదల 18 శాతంగా నమోదైంది.
2016–17లో భారత్‌కు ఇజ్రాయెల్‌తో జరిగిన వాణిజ్యానికి సంబంధించి వాణిజ్య శేషంలో మిగులు 1.10 బిలియన్ డాలరు. 2016–17లో భారత్ నుంచి ఇజ్రాయెల్‌కు ప్రధానంగా ఖనిజ ఇంధనాలు, చమురు ఎగుమతి అయ్యాయి. మొత్తం భారత ఎగుమతుల విలువలో ఖనిజ ఇంధనాలు, చమురు విలువ 2016–17లో 1.01 బిలియన్ డాలర్లుగా ఉంది.
2016–17లో ఇజ్రాయెల్ నుంచి భారత్ దిగుమతుల్లో నేచురల్/కల్చర్డ్ పెరల్స్, విలువైన రాళ్లు ప్రధానంగా నిలిచాయి. ద్వైపాక్షిక వాణిజ్యంలో డైమండ్స్ వాణిజ్యం 54 శాతంగా నమోదైంది. భారత్ నుంచి 40 మంది డైమండ్ డీలర్లు ఖ్చఝ్చ్ట ఎ్చnలోని ఇజ్రాయెల్ డైమండ్ ఎక్సే్ఛంజ్‌లో కార్యాలయాలను ప్రారంభించారు. వీరిలో కొంతమంది గత 30–40 ఏళ్లుగా ఇజ్రాయెల్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
పెట్టుబడులు
ప్రత్యక్ష పెట్టుబడులతోపాటు ఇజ్రాయెల్‌కు చెందిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అమెరికా, యూరప్, సింగపూర్ నుంచి భారత్‌లోకి ప్రవేశించాయి. భారత్‌లోని శక్తి, పునరుత్పాదక శక్తి, టెలికం, రియల్ ఎస్టేట్, వాటర్ టెక్నాలజీ రంగాల్లో ఇజ్రాయెల్ కంపెనీల పెట్టుబడులు పెరిగాయి. ఆయా కంపెనీలు భారత్‌లో ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటుచేయడంతోపాటు పరిశోధన –అభివృద్ధి(ఆర్ అండ్ డీ) కేంద్రాలను సైతం ఏర్పాటు చేశాయి. 2016–17 నాటికి భారత్‌లోని ఇజ్రాయెల్ కంపెనీల సంఖ్య 300కు పెరిగింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్‌లోనూ భారత్ పెట్టుబడులు పెరిగాయి.
జైన్ ఇరిగేషన్ ఇజ్రాయెల్ డ్రిప్ ఇరిగేషన్‌ను కొనుగోలు చేసింది. సన్‌ఫార్మా, త్రివేణి ఇంజనీరింగ్‌లు తారా ఫార్మాస్యూటికల్స్‌లో వాటాలు దక్కించుకున్నాయి. 2005లో టీసీఎస్ ఇజ్రాయెల్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. 2007లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టెల్ అవివ్‌లో తన శాఖను ప్రారంభించింది. గత రెండేళ్లుగా ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా వంటి భారత ఐటీ కంపెనీలు ఇజ్రాయెల్‌లో పెట్టుబడులు పెట్టాయి.
రక్షణ రంగం
పలు కీలక కారణాల వల్ల భారత్, ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలుగా అవతరించాయి. ఆసియాలో తమ స్వశక్తిపై నిలబడగలిగే దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇజ్రాయెల్ మొగ్గుచూపింది. భారత్ తన సాయుధ బలగాలను ఆధునికీరించడం ద్వారా తనకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించే ప్రయత్నాలను ప్రారంభించింది. ఫలితంగా భారత్–ఇజ్రాయెల్ మధ్య రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడింది.
మిలటరీ టెక్నాలజీ బదిలీ, జిహాద్ పేరుతో జరిగే తీవ్రవాదానికి వ్యతిరేకంగా సమాచార మార్పిడి వంటి అంశాల్లో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం భారత్‌కు అవసరం. 2000 దశకంలో ఇజ్రాయెల్ నుంచి రక్షణ పరికరాల కొనుగోలుపై భారత్ 10 బిలియన్ డాలర్లకు పైగా వ్యయం చేసింది. గత 25 ఏళ్ల కాలంలో జెరుసలేం, న్యూఢిల్లీల మధ్య దౌత్య సంబంధాలు మెరుగవడంతో ఇజ్రాయెల్ మిలటరీ హార్డ్‌వేర్‌కు సంబంధించి భారత్ అతిపెద్ద కొనుగోలుదారుగా అవతరించింది.
స్పేస్ ఆపరేషన్‌కు సంబంధించి 2002 నవంబర్‌లో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. తీవ్రవాదంపై పోరుకు అవసరమైన శిక్షణలో భాగంగా ఇజ్రాయెల్.. భారత మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్‌కు రాడార్, సర్వైలెన్స్ సిస్టమ్‌తో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలను విక్రయించింది. 2011 నవంబర్‌లో భారత కోబ్రా కమాండో యూనిట్ ఇజ్రాయెల్ నుంచి 1000 యూనిట్ల గీ95 అసాల్ట్ రైఫిల్స్‌ను కొనుగోలు చేసింది. అదే సంవత్సరంలో భారత్ నాలుగు అడ్వాన్స్‌డ్ ఇజ్రాయెలీ ఫాల్కన్ ్చజీటbౌటn్ఛ ్ఛ్చట y ఠ్చీటnజీnజ ్చnఛీ ఛిౌn్టటౌ∙(అఠ్చీఛి) సిస్టమ్స్ కొనుగోలుకు ఆర్డరిచ్చింది. ఇండియా, ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఇండియన్–ఇజ్రాయెలీ బరాక్ ఎయిర్ అండ్ నేవల్ డిఫెన్స్‌ను 2014, నవంబర్ 10 ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ విజయవంతంగా పరీక్షించింది.
భారత ప్రభుత్వం 2015లో 321 లాంచర్లు; 8,356 మిస్సైల్స్‌ను ఇజ్రాయెల్ మిలటరీ నుంచి కొనుగోలు చేసింది. మన దేశానికి చెందిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సహకారంతో అభివృద్ధి చేసిన బరాక్–8ను భారత్ 2016, జూన్ 30న విజయవంతంగా పరీక్షించింది. బరాక్–8ను నౌకాదళంతోపాటు భూభాగం నుంచి ప్రయోగించేలా రూపొందించారు. ఒడిశా లోని చాందీపూర్‌లోని ప్రయోగ పరీక్ష వేదిక నుంచి 2016, సెప్టెంబర్ 20న రెండోసారి బరాక్– 8 మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించారు.
2016, మార్చి 30న భారత్‌కు చెందిన రిలయన్స్ డిఫెన్స్, ఇజ్రాయెలీ సంస్థ రాఫెల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ మధ్య 10 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రెండు సంస్థలు భారత మిలటరీకి అవసరమైన ఎయిర్– టు–ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థలను సంయుక్తంగా ఉత్పత్తి చేయనున్నాయి. దీంతో మధ్యప్రదేశ్‌లోని 3000 మంది భారతీయులకు ఉపాధి లభిస్తుందని అంచనా. 2017 ఫిబ్రవరిలో ఇండియన్ నేవీ.. ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన ఇంటిగ్రేటెడ్ అండర్ వాటర్ హార్బర్ డిఫెన్స్ అండ్ సర్వైలెన్స్ సిస్టమ్‌ను ప్రారంభించింది.
ద్వారా ముంబై నేవల్ హార్బర్‌లో నీటిపైన, నీటి కింద ఉండే ఇండియన్ నేవీ వాహనాల నిర్వహణ, భద్రత మెరుగుపడు తుంది. 2017, మే 11న ఇజ్రాయెల్ రూపొందించిన సర్ఫేస్–టు–ఎయిర్.. పైథాన్, డెర్బీ మిసైల్ సిస్టమ్‌ను ఇండియన్ మిలటరీ విజయవంతంగా పరీక్షించింది.
భారత్–ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఒప్పందాలు
ఇజ్రాయెల్ అధ్యక్షుడు రూవెన్ రివ్లిన్, భారత ప్రధాని నరేంద్రమోదీలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలను పెంపొందించేందుకు గల అవకాశాలపై ఇటీవల చర్చించారు. భారత ప్రధాని.. ఇజ్రాయెల్ పర్యటనలో రెండు దేశాల మధ్య ఏడు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇందులో అంతరిక్షం, వ్యవసాయం, శాస్త్ర పరిశోధన రంగాలకు సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయి. అవి..
1.ఇండియా–ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, డెవలప్‌మెంట్, టెక్నికల్ ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటుకు సంబంధించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఇండియా), నేషనల్ టెక్నికల్ ఇన్నోవేషన్ అథారిటీ (ఇజ్రాయెల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ నిధికి వెచ్చించే రూ.260 కోట్లను రెండు దేశాలు సమానంగా భరిస్తాయి.
2.జల సంరక్షణ ఒప్పందంలో భాగంగా అతి తక్కువ నీటి వినియోగంతో మంచి ఫలితాలు సాధిస్తున్న ఇజ్రాయెల్.. జల సంరక్షణకు సంబంధించి భారత్‌కు సహకారం అందిస్తుంది.
3.యూపీ జల్ నిగమ్ (ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం), ఇజ్రాయెల్‌లోని నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎనర్జీ, నీటి వనరుల మంత్రిత్వ శాఖ భారత్‌లో నీటి ప్రయోజన సంస్కరణలకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.
4.వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచేందుకు 2018 నుంచి 2020 వరకు ఇజ్రాయెల్ భారతదేశానికి సహకారం అందిస్తుంది.
5.అటామిక్ క్లాక్స్ రూపకల్పనలో పరస్పర సహకారానికి ఒక ఒప్పందం కుదిరింది.
6.జీఈవో–ఎల్‌ఈవో ఆప్టికల్ లింకు విషయంలో సహకరించుకునేందుకు ఇస్రో– ఇజ్రాయెల్ స్పేస్ ఏజెన్సీ మధ్య ఒప్పందం కుదిరింది.
7.సూక్ష్మ ఉపగ్రహాలకు ఉపయోగపడే ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ అభివృద్ధిలో సహకరించు కునే విషయంలో ఇస్రో–ఇజ్రాయెల్ స్పేస్ ఏజెన్సీ మధ్య ఒప్పందం కుదిరింది.
ఇజ్రాయెల్ మొత్తం జనాభా 2017లో 87,20,040 కాగా ప్రపంచంలో జనాభా ప రంగా 98వ స్థానాన్ని, విస్తీర్ణం పరంగా 149వ స్థానాన్ని పొందింది. స్థూల దేశీయో త్పత్తి (కొనుగోలు శక్తి సామ్యం)లో ప్రపంచం లో 54వ స్థానాన్ని తలసరి ఆదాయం (కొనుగోలు శక్తి సామ్యం)లో 34వ స్థానాన్ని పొందింది. 2015లో రుణ–జీడీపీ నిష్పత్తి 64.08 శాతం కాగా తలసరి రుణం 22,905 డాలర్లుగా నమోదైంది.