
ముంబై దాడిలో తల్లిదండ్రులను కోల్పోయిన మోషెను ముద్దాడుతున్న నెతన్యాహు
ముంబై: భారత–ఇజ్రాయెల్ బంధం స్వర్గంలోనే నిశ్చయమైందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. మానవత్వం, ప్రజాస్వామ్యం, స్వాతంత్య్ర విలువలపై ఈ బంధం ఆధారపడి ఉందన్నారు. భారత పర్యటనకు వచ్చిన నెతన్యాహు గురువారం ముంబైలో ఏర్పాటుచేసిన భారత్–ఇజ్రాయెల్ వ్యాపారవేత్తల సదస్సులో మాట్లాడారు. ఇజ్రాయెల్ క్లిష్టపరిస్థితులనుంచి పైకెదిగి తన దిశను మార్చుకుని ప్రయాణిస్తున్నట్లే.. భారత్ మోదీ నాయకత్వంలో ఇదే విధంగా ముందుకెళ్తోందన్నారు. ఇరుదేశాల మధ్య లోతైన వ్యక్తిగత స్నేహముందన్నారు.
భారత సంస్కృతి సాంప్రదాయాలంటే తనకు ఎనలేని గౌరవమని వెల్లడించారు. ‘ప్రపంచంలోని పురాతన సంస్కృతులున్న ప్రజాస్వామ్య దేశాలు మనవి. మనం స్వాతంత్య్రాన్ని, మానవత్వాన్ని పంచుకున్నాం. మనం అసలైన భాగస్వాములం. అందుకే ఈ బంధం స్వర్గంలోనే నిర్ణయమైంది’ అని నెతన్యాహు వ్యాఖ్యానించారు. 2008 ముంబై దాడులతో రక్తమోడిన ఛబాద్ భవనాన్ని నెతన్యాహు సందర్శించారు. నారీమన్ హౌజ్ వద్ద ఆనాటి మృతులకు ఆయన నివాళులర్పించారు. ముంబై దాడుల్లో తల్లిదండ్రులను కోల్పోయిన 11 ఏళ్ల మోషే హోల్ట్‌జ్‌బర్గ్‌ను కలిసి మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment