ఇజ్రాయెల్‌తో చెలిమి | israel pm Netanyahu visit to india | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌తో చెలిమి

Published Wed, Jan 17 2018 1:26 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

 israel pm Netanyahu visit to india - Sakshi

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఆరు రోజుల పర్యటన కోసం శని వారం న్యూఢిల్లీ వచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రొటోకాల్‌ పక్కనపెట్టి విమానాశ్రయానికి వెళ్లడమే కాదు... ఆయనను గాఢంగా హత్తుకుని తన అభిమానాన్ని చాటుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తీరును గమనిస్తే పాతికేళ్ల క్రితం మొదలైన ఇరు దేశాల బంధమూ ఏ స్థాయికి చేరుకుందో అర్ధమవుతుంది. సరిగ్గా ఆరునెలలక్రితం అంటే జూలై మొదటివారంలో మోదీ ఇజ్రాయెల్‌ పర్య టనకు వెళ్లినప్పుడు కూడా ఈ మాదిరి స్వాగత సత్కారాలే లభించాయి.

మన ప్రధాని ఒకరు ఇజ్రాయెల్‌ పర్యటించడం అదే మొదటిసారి కాగా, ఇజ్రాయెల్‌ ప్రధాని ఇక్కడకు రావడం పదిహేనేళ్ల తర్వాత ఇది రెండోసారి. మోదీ జూలై పర్యటన సందర్భంగా వ్యవసాయం, జల సంరక్షణ, నవీకరణ రంగాల్లో సహకార ఒప్పందాలు కుదిరాయి. అవన్నీ వెనువెంటనే చకచకా కదిలాయి. ఇండో– ఇజ్రా యెల్‌ వ్యవసాయ పథకం కింద మన దేశంలో 35 ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలు ప్రారం భించాలని నిర్ణయించగా వాటిలో 20 ఇప్పటికే పనిచేయడం ప్రారంభించాయి. తీవ్రమైన నీటి కొరత ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌లో జల సంరక్షణ విధానాలను అభివృద్ధి చేసి అందులో ఉత్తమ సాంకేతికతను సాధించిన శాస్త్రవేత్తలు మన దేశంలో నీటి కరువు అధికంగా ఉన్న ప్రాంతాల్లో వినియోగపడగల పథకాలకు తుదిరూపం ఇస్తున్నారు.

నవీకరణ రంగానికి సంబంధించినంతవరకూ వ్యవ సాయం, జల సంరక్షణ, ఆరోగ్యం అంశాల్లో ఇరు దేశాలకూ చెందిన 36 ఔత్సాహిక పరిశ్రమలకు అనుమతులు లభించాయి. ఇందుకోసం ప్రత్యేక నిధిని ఏర్పాటుచేసి ఏడాదికి చెరో 40 లక్షల డాలర్లు చొప్పున అయిదేళ్లపాటు కేటాయించాలని తాజాగా నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని ఇప్పుడున్న 500 కోట్ల డాలర్ల స్థాయి నుంచి మరింత పెంచుకోవాలన్న ఉద్దేశం రెండు దేశాలకూ ఉంది. వాణిజ్య రంగంలో భారత్‌ భాగస్వాముల్లో ఇజ్రాయెల్‌ స్థానం 38. వివిధ అరబ్‌ దేశాలు మొదటి 15 ర్యాంకుల్లో ఉన్నాయంటే ఇజ్రాయెల్‌తో మన వాణిజ్యం ఎంత తక్కువగా ఉన్నదో అర్ధమవుతుంది. అయితే ఆయుధాలు, రక్షణ రంగానికి సంబం ధించిన ఇతర కొనుగోళ్లకు సంబంధించినంత వరకూ ఇజ్రాయెల్‌దే అగ్ర   స్థానం. ఇజ్రాయెల్‌ నుంచి ఏటా వంద కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు, ఇతర రక్షణ పరికరాలు మన దేశం కొనుగోలు చేస్తున్నది. ఇతర రంగాల్లో సైతం వాణిజ్యం ఈ స్థాయికి విస్తరించాలన్నది రెండు దేశాల ఆలోచన. దాన్ని దృష్టిలో పెట్టుకునే నెత న్యాహుతో పాటు భారీ పారిశ్రామికవేత్తల బృందం మన దేశం వచ్చింది. 

అయితే ఇజ్రాయెల్‌తో మన సంబంధాలు సంక్లిష్టమైనవి. రెండు దేశాల మధ్య నెలకొన్న సంబంధాలనూ ‘స్వర్గంలో కుదిరిన పెళ్లి’గా నెతన్యాహు అభి వర్ణించడం మాటెలా ఉన్నా దాని పర్యవసానాలు కూడా తక్కువేమీ కాదు. ఎందుకంటే ఇజ్రాయెల్‌కు అరబ్‌ దేశాలతో ససేమిరా కుదరదు. ఇరాన్‌– ఇజ్రాయెల్‌ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గున మండుతుంది. ఇక పాలస్తీనా సమస్య ఉండనే ఉంది. ఇజ్రాయెల్‌తో సంబంధాలు బలపడేకొద్దీ అరబ్‌ దేశాలతో, ఇరా న్‌తో మనకున్న సంబంధాలపై అవి తీవ్ర ప్రభావం కలగజేస్తాయని, ఇది మంచిది కాదని దౌత్య నిపుణులు చాన్నాళ్లుగా హెచ్చరిస్తున్నారు. మన చమురు దిగు మతుల్లో అరబ్‌ దేశాల వాటా 50 శాతం. సహజవాయువు అవసరాల్లో  85 శాతం ఆ దేశాలనుంచే లభిస్తుంది. అలాగే గల్ఫ్‌ సహకార మండలి(జీసీసీ)తో మన వాణిజ్యం 15000 కోట్ల డాలర్లు మించి ఉంది. మన దేశానికి చెందిన 80 లక్షల మంది యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, బహ్రైన్‌ దేశాలకు వలస పోయి అక్కడ ఉపాధి పొందుతున్నారు. సాధారణంగా అయితే ఒక దేశంతో సంబంధాలు మరో దేశంతో ఉన్న సంబంధాలను దెబ్బతీస్తాయని భావించ నవసరం లేదు. తైవాన్‌తో మనకున్న సంబంధాలు చైనాతో ఉన్న సంబంధాలకు అడ్డు రాలేదు. అలాగే చైనా–పాకిస్తాన్‌ మైత్రి భారత్‌–చైనా సంబంధాలపై ప్రభా వం చూపడం లేదు. 

అయితే ఇజ్రాయెల్‌తో పశ్చిమాసియాకు, ఇరాన్‌కు ఉన్న వైరం నేపథ్యం వేరు. 1947లో ఇజ్రాయెల్‌ ఆవిర్భావం తమ ప్రయోజనాలకు భంగకరమని ముస్లిం ప్రపంచం భావిస్తోంది. జర్మనీలో యూదుల వేధింపును 1938లో మహాత్మా గాంధీ తీవ్రంగా ఖండించినా యూదుల కోసం ఇజ్రాయెల్‌ ఏర్పరచాలన్న ప్రతిపాదనను ససేమిరా అంగీకరించలేదు. అరబ్‌ల మనసు గెల్చుకుని, వారి ఇష్టంతో మాత్రమే అలాంటి ప్రయత్నం చేయాలని చెప్పారు. స్వాతంత్య్రానంతరం కూడా మన దేశం ఆ మార్గాన్నే ఎన్నుకుంది. 1947లో ఇజ్రాయెల్‌ ఏర్పాటైనప్పుడు భారత్‌ గట్టిగా వ్యతిరేకించింది.

మరో రెండేళ్లకు ఐక్యరాజ్యసమితిలో దానికి సభ్యత్వం ఇవ్వడాన్ని కూడా అంగీకరించలేదు. పాలస్తీనా ప్రజానీకంపై ఇజ్రాయెల్‌ దాడులు చేసిన ప్పుడల్లా వాటిని మన దేశం ఖండిస్తూనే ఉంది. అమెరికా తన దౌత్య కార్యాలయాన్ని వివాదాస్పద జెరుసలేంకు తరలించాలని నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ గత నెలలో ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం తీర్మా నించినప్పుడు సైతం మన దేశం దానికి మద్దతునిచ్చింది. ఇటీవలికాలంలో అమెరికా–అరబ్‌–ఇజ్రాయెల్‌ దేశాల మధ్య లోపాయికారీగా సాన్నిహిత్యం పెరగడాన్ని, ముఖ్యంగా పర్షియన్‌ జలసంధిలో ఇరాన్‌ యుద్ధ నౌకల కదలికపై నిఘాకు అవసరమైన గూఢచార ద్రోన్‌లను సౌదీ అరేబియాకు ఇజ్రాయెల్‌ సరఫరా చేయడాన్ని గమనిస్తే పశ్చిమాసియా మునుపటిలా లేదని, అక్కడ సమీకరణాలు మారుతున్నాయని  అవగతమవుతుంది.

అటు చైనా తలపెట్టిన వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌(ఓబీఓఆర్‌)ను ఇజ్రాయెల్‌ స్వాగతించడాన్ని, సిరియాకు వ్యతిరేకంగా అల్‌ కాయిదా, ఐఎస్‌ల సాయం తీసుకోవడానికి అది ప్రయ త్నించడాన్ని మన దేశం వ్యతిరేకించింది. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌ ఆశిస్తున్నట్టు ఇరు దేశాల సంబంధాలూ వ్యూహాత్మక స్థాయికి చేరడం ఏమేరకు సాధ్యమో, అసలు ప్రస్తుత సంబంధాల పరిధి, పరిమితి ఏమిటో రాగలకాలంలో తేట తెల్లమవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement