business conference
-
ఈ దశాబ్దం భారత్‌దే
న్యూఢిల్లీ: ప్రస్తుత దశాబ్దం (2030 వరకు) భారత్‌కు ఆశావహం అని, ఎన్నో అవకాశాలు రానున్నాయని టాటా గ్రూపు చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అన్నారు. దేశ సమగ్ర అభివృద్ధికి కోట్లాది మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే, మరింత మంది మహిళలను ఉద్యోగాల్లోకి వచ్చేలా చూడాలన్నారు. సీఐఐ నిర్వహించిన వ్యాపార సదస్సులో ఆయన మాట్లాడారు. రానున్న దశాబ్దాల్లో 70% ప్రపంచ వృద్ధి అంతా వర్ధమాన దేశాల నుంచే ఉంటుందని చంద్రశేఖరన్ అంచనా వేశారు. అందులోనూ ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్ వృద్ధి రేటు ఎక్కువగా ఉంటుందని, భారత్ ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. సమ్మిళిత వృద్ధి..: ‘‘మనం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నాం. కానీ, ఈ వృద్ధి ఫలాలు అందరూ అనుభవించే విధంగా ఉండాలి. ధనిక, పేదల మధ్య అంతరం పెరగకుండా చూడాలి. నా వరకు ఇదే మూల సూత్రం’’అని చంద్రశేఖరన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కనీస నాణ్యమైన జీవనాన్ని ప్రతి ఒక్కరూ పొందేలా ఉండాలన్నారు. రానున్న పదేళ్లలో కోట్లాది మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని సూచించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి చూస్తే భారత్ ప్రపంచ జీడీపీలో 3% నుంచి 7%కి చేరింది. ఈ అభివృద్ధి వల్ల గత పదేళ్లలోనే 27 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తులయ్యారు. మనం కొత్త వ్యాపారాలు, కొత్త రంగాల్లోకి అడుగు పెట్టాం. నేడు ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా అవతరించాం. 2022లోనే ఇప్పటి వరకు చూస్తే ప్రతీ వారం ఒక యూనికార్న్ ఏర్పడింది. అయినా, మనం ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉంది. అది మహిళలకు ఉపాధి కల్పించే విషయంలోనూ. ఇప్పటికీ ఎంతో మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. వీరు ఆరోగ్య, విద్యా సదుపాయాలను అందుకోలేకున్నారు’’అని చంద్రశేఖరన్ తెలిపారు. సమస్యలను పరిష్కరించుకోవాలి.. భారత ఆర్థిక వ్యవస్థ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ‘‘5 లక్షల కోట్ల డాలర్లు, 8 లక్షల కోట్ల డాలర్లకు భవిష్యత్తులో చేరుకుంటాం. తలసరి ఆదాయం రెట్టింపు అవుతుంది. కానీ, ఇది సమ్మిళితంగా ఉండాలి’’ అని తెలిపారు. ఈ దశాబ్దం భారత్‌దేనని మరోసారి గుర్తు చేస్తూ ఈ క్రమంలో సమస్యలు, సవాళ్లను పరిష్కరించుకున్నప్పుడే అవకాశాలను అందిపుచ్చుకోగలమన్నారు. సమాజంలోని అంతరాలను తొలగించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. మహిళలకు ప్రాతినిధ్యం పని ప్రదేశాల్లో మహిళల ప్రాతినిధ్యం తగ్గిపోతున్న విషయాన్ని ఎన్.చంద్రశేఖరన్ గుర్తు చేశారు. గత దశాబ్దంలో ఇది 27 శాతం నుంచి 23 శాతానికి దిగివచ్చినట్టు చెప్పారు. అయితే, కొత్త నైపుణ్య నమూనా కారణంగా ఇది మారుతుందన్నారు. ఇంటి నుంచే పని విధానం ఇప్పుడప్పుడే పోదంటూ, అది శాశ్వతంగానూ కొనసాగదన్నారు. -
వాణిజ్యవేత్తలకు దన్నుగా నిలుస్తున్న ఆటా
హైదరాబాద్: అమెరికా తెలుగు సంఘం (ఆటా) హైదరాబాద్ నగరంలో బిజినెస్ సెమినార్ 2021ను నిర్వహించింది. వ్యాపారాలకు సంబంధించిన ఆలోచనలను ప్రోత్సహించడం, యువ వాణిజ్యవేత్తలకు మెంటారింగ్, వెంచర్ క్యాపిటలిస్టులకు ఒక వేదిక కల్పించడం, స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందివ్వడం లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ఇందులో అమెరికా, భారతదేశాలకు చెందిన దాదాపు 100 పాల్గొన్నారు. లక్ష్యాలు ఇవే ఈ సెమినార్లో ఆటా వేడుకల బిజినెస్ కమిటీ ఛైర్ శ్రీ కాశీ కొత్త మాట్లాడుతూ.. బిజినెస్ సెమినార్ ఎజెండా బహుముఖం. అమెరికాలో స్థిరపడిన తెలుగు వాణిజ్యవేత్తలు, తెలంగాణలోని వ్యాపారవేత్తల మధ్య అనుసంధానం, అనుబంధం పెంచాల్సి ఉందన్నారు. తెలంగాణలోని స్టార్టప్ కంపెనీలకు మెంటారింగ్ చేసి, వాటిలో పెట్టుబడులు వచ్చేలా సూచనలు చేస్తామన్నారు. అదే విధంగా ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ లాంటి టైర్-2 నగరాలకు మరిన్ని కంపెనీలను ఆకర్షించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశాలని తెలిపారు. ప్రతీ రెండేళ్లకు ఓసారి ఆటా కాన్ఫరెన్స్ సలహా కమిటీ చైర్మన్ జయంత్ చల్లా మాట్లాడుతూ.. 2014 నుంచి హైదరాబాద్‌లో ప్రతీ రెండేళ్లకు ఓసారి ఆటా ఇలాంటి సెమినార్లు నిర్వహిస్తోందని తెలిపారు. వీటి ద్వారా ఇప్పటి వరకు భారతీయ స్టార్టప్‌లలో దాదాపు 20 మిలియన్ డాలర్లు (రూ. 150 కోట్లకు పైగా) పెట్టుబడులు వచ్చాయన్నారు. ఈ బిజినెస్ సెమినార్ల వల్ల పలు సంంస్థలు టైర్-2 నగరాలకు తరలి వచ్చాయన్నారు. ఖమ్మంలో టి-హబ్ ప్రారంభించడమనేది ఆటా బిజినెస్ కో-ఛైర్ చేపూరి సాధించిన ఓ అతిపెద్ద విజయంగా భావిస్తున్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు. పాల్గొన్న వారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, తెలంగాణ ప్రభుత్వ ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, ఐటీ పెట్టుబడుల విభాగం సీఈవో విజయ్ రంగినేని, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సీఈవో శ్రీకాంత్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. ఆటా తరఫున భువనేష్ బూజల (ఆటా ప్రెసిడెంట్), మధు బొమ్మినేని (ఆటా ప్రెసిడెంట్ ఎలక్ట్), ఆటా వేడుకల ఛైర్ జయంత్ చల్లా, సదస్సు సలహా కమిటీ ఛైర్ కిరణ్ పాశంలతో పాటు సమన్వయకర్తలు కాశీ కొత్త, ఆటా వేడుకల బిజినెస్ ఛైర్ లక్ష్ చేపూరి, ఆటా వేడుకలు బిజినెస్ కో-ఛైర్ తదితరులు పాల్గొన్నారు. 1990 నుంచి అమెరికా వ్యాప్తంగా ఉన్న ఐదువేల మందికి పైగా తెలుగువారికి ప్రాతినిధ్యం వహించేందుకు 1990లో అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు ఇందులో పెద్ద సంఖ్యలో సభ్యత్వం కలిగి ఉన్నారు. అమెరికాకు వచ్చిన తొలితరం వారు ఎక్కువ మంది ఆటాలో సభ్యత్వం కలిగి ఉన్నారు. సమాజ సేవ, వ్యాపారం, సంస్కృతి, సామాజిక కార్యకలాపాలు, విద్యార్థులకు సాయం, తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణ, ప్రోత్సాహం తదితరాల బాధ్యతలను అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థ నిర్వహిస్తుంది. -
మరిన్ని సంస్కరణలకు రెడీ
న్యూఢిల్లీ: భారత్‌లో తయారీ కోసం, పెట్టుబడులకు భారత్‌ను ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కార్పొరేట్ పన్ను తగ్గింపు సహా ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నట్టు ఆమె గుర్తు చేశారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన భారత్ – స్వీడన్ వ్యాపార సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి సీతారామన్ మాట్లాడారు. ‘‘భారత ప్రభుత్వం తదుపరి సంస్కరణలను బ్యాంకింగ్, మైనింగ్, బీమా తదితర రంగాల్లో తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉందని నేను హామీ ఇస్తున్నాను’’ అని ఈ సందర్భంగా చెప్పారు. ఆ సంస్కరణలు ఏంటన్న వివరాలను మాత్రం పేర్కొనలేదు. భారతీయ పరిశ్రమలే కాకుండా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రభుత్వం పరిష్కరించే పనిలో ఉందని చెప్పారు. ‘‘బడ్జెట్ తర్వాత నుంచి పరిశ్రమలను నిరంతరం సంప్రదిస్తూ, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకుంటున్నాను. బడ్జెట్ తర్వాత నుంచి మరుసటి బడ్జెట్ 2020 ఫిబ్రవరి వరకు వేచి చూడకుండానే, కార్పొరేట్ పన్ను తగ్గింపు రూపంలో భారీ సంస్కరణ చర్య తీసుకున్నాం. ప్రభుత్వం సంస్కరణలను ఏ విధంగా విశ్వసిస్తుందన్నది ఈ ఒక్క చర్య తెలియజేస్తుంది. మేము మరిన్ని చర్యలు తీసుకోనున్నామని ఈ రోజు నేను స్పష్టం చేస్తున్నాను’’ అంటూ ప్రభుత్వ ఆలోచనలను ఈ సదస్సు వేదికగా మంత్రి సీరారామన్ ఆవిష్కరించారు. కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ గత సెపె్టంబర్లో కేంద్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకున్న విషయం గమనార్హం. గడిచిన 28 ఏళ్లలో పన్నుల పరంగా ఇది అతిపెద్ద సంస్కరణ. తయారీ రంగంలో కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహకంగా కార్పొరేట్ పన్నును ప్రస్తుతమున్న 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వం ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.45 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోనున్నది. స్వీడన్ కంపెనీలకు ఆహ్వానం భారత్‌లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలంటూ స్వీడన్‌కు చెందిన కంపెనీలను ఈ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్ ఆహా్వనించారు. రానున్న ఐదేళ్ల కాలంలో మౌలిక సదుపాయాల రంగంలో రూ.100 లక్షల కోట్ల మేర ఇన్వెస్ట్ చేయాలన్న భారత్ ప్రణాళికల గురించి తెలియజేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్‌్కఫోర్స్ పది భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను గుర్తించి ఈ నెల 15 నాటికి నివేదికను అందజేయనున్నట్టు చెప్పారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నేతృత్వంలో ఒక కార్యాచరణ బృందాన్ని (టాస్‌్కఫోర్స్) గత సెపె్టంబర్లో కేంద్ర ప్రభుత్వం నియమించింది. 2019–20 నుంచి 2024–25 మధ్య కాలంలో రూ.100 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రణాళికను అనుసరించి ప్రాధాన్య క్రమంలో జాతీయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల జాబితాను ఈ టాస్క్ ఫోర్స్ రూపొందించాల్సి ఉంటుంది. రూ.100 కోట్లకు పైగా వ్యయంతో కూడిన గ్రీన్‌ఫీల్డ్ (ముందస్తు పని అవసరం లేనివి), బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్టులను (ప్రాజెక్టు ఆరంభానికి ముందు పనితో కూడుకున్నవి) ఇది తన నివేదికలో భాగంగా పొందుపరచాల్సి ఉంటుంది. భారత్ కేవలం పెద్ద మార్కెట్‌గానే కాకుండా, కొనుగోలు శక్తి, ఆకాంక్షలతో కూడిన మధ్య తరగతి జనాభా అధికంగా కలిగి ఉండడం ఎన్నో అవకాశాలకు వేదికగా మంత్రి పేర్కొన్నారు. ‘‘స్పష్టమైన నిబంధనలతో, మరింత పారదర్శకత మార్గంలో ఈ దేశం నడుస్తోంది. తమకు బాగా తెలిసిన, తమకు ఎంతో ఆమోదనీయమైన వాతావరణం కోసం అంతర్జాతీయ ఇన్వెస్టర్లు చూస్తున్నట్టు అయితే.. అందుకు భారత్ సరిగ్గా సరితూగుతుంది’’ అని మంత్రి సీతారామన్ వివరించారు. -
భారత్... అవకాశాల గని!
న్యూయార్క్: అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్ స్వర్గధామంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు దీర్ఘకాల ప్రయాణంలో కేవలం ఆరంభమేనన్నారు. కార్పొరేట్ పన్నును చరిత్రాత్మక స్థాయిలో ప్రభుత్వం తగ్గించిందని, పెట్టుబడులకు ఇదొక బంగారం లాంటి అవకాశమని అభివర్ణించారు. భారత్‌లో వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని న్యూయార్క్‌లో బుధవారం జరిగిన బ్లూంబర్గ్ వ్యాపార సదస్సులో భాగంగా ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కార్పొరేట్లను, సంపద సృష్టికర్తలను గౌరవించే ప్రభుత్వం భారత్‌లో ఉందన్నారు. ‘‘విస్తరణకు అవకాశం ఉన్న మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు భారత్‌కు విచ్చేయండి. ఆధునిక ధోరణులు, ఫీచర్లను అభినందించే మార్కెట్లో చేయదలిస్తే భారత్‌కు రండి. భారీ మార్కెట్ ఉన్న చోట స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే భారత్‌కు రండి. ప్రపంచంలో ఒకానొక అతిపెద్ద మౌలిక సదుపాయాల వ్యవస్థలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే భారత్‌కు తరలిరండి’’ అని ప్రధాని అంతర్జాతీయ కంపెనీలకు పిలుపునిచ్చారు. కార్పొరేట్ పన్నును అన్ని రకాల సెస్సులు, చార్జీలతో కలుపుకుని 35 శాతంగా ఉన్నదాన్ని ఇటీవలే ప్రభుత్వం 25.17 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల పన్నులకు దీటుగా భారత కార్పొరేట్ పన్ను మారింది. ఆ నాలుగు అంశాలే భారత్‌కు బలం... ‘‘భారత వృద్ధి పథం నాలుగు కీలక అంశాలతో ముడిపడి ఉంది. ప్రపంచంలో వేరెక్కడా ఇవి లేవు. అవి ప్రజాస్వామ్యం, జనాభా, డిమాండ్, నిర్ణయాత్మక శక్తి. ప్రజాస్వామ్యానికి తోడు, రాజకీయ స్థితర్వం, ఊహించతగ్గ విధానాలు, స్వతంత్ర న్యాయవ్యవస్థ అన్నవి పెట్టుబడుల వృద్ధికి భరోసానిచ్చేవి., రక్షణనిచ్చేవి. భారత్ తన పట్టణాలను ఎంతో వేగంగా ఆధునీకరిస్తోంది. ఆధునిక టెక్నాలజీలతో, పౌరులకు సౌకర్యమైన సదుపాయాలతో వాటిని తీర్చిదిద్దుతోంది. కనుక పట్టణీకరణపై ఇన్వెస్ట్ చేయాలనుకుంటే భారత్‌కు రావాలి’’అని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. రక్షణ రంగంలో ముందెన్నడూ లేని స్థాయిలో పెట్టుబడులకు ద్వారాలు తెరిచినట్టు ఆయన చెప్పారు.భారత్ కోసం, ప్రపంచం కోసం భారత్‌లో తయారు చేయాలనుకుంటే భారత్‌కు రావాలని ఆహ్వానం పలికారు. వ్యాపార వాతావరణం మెరుగుపరిచేందుకు గాను రెండోసారి అధికార పగ్గాలు స్వీకరించిన అనంతరం.. మోదీ సర్కారు 50 చట్టాలను రద్దు చేసిన విషయం గమనార్హం. ఆరంభమే... మున్ముందు ఇంకా చూస్తారు ‘‘భారత ప్రభుత్వం వ్యాపార ప్రపంచాన్ని, సంపద సృష్టిని గౌరవిస్తుంది. వ్యాపార నిర్వహణను సులభతరం చేసేందుకు కఠినమైన, భారీ నిర్ణయాలను తీసుకుంటోంది. నూతన ప్రభుత్వం కొలువుదీరి కేవలం మూడు నాలుగు నెలలే అయింది. ఇది కేవలం ఆరంభమేనని చెప్పదలుచుకున్నా. ఇంకా ఎంతో పదవీ కాలం ఉంది. ఈ ప్రయాణంలో అంతర్జాతీయ వ్యాపార సమూహంతో భాగస్వామ్యం పటిష్టం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది మీకు బంగారం లాంటి అవకాశం’’ అని మోదీ వివరించారు. 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి (రూ.350 లక్షల కోట్లు) దేశ జీడీపీని తీసుకెళ్లాలన్న లక్ష్యాన్ని కేంద్ర సర్కారు విధించుకున్న విషయం గమనార్హం. ఇప్పటికే ఐదేళ్లలో ట్రిలియన్ డాలర్ల మేర జీడీపీ స్థాయిని పెంచామని, 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మోదీ చెప్పారు. 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యంలో ఇప్పటికే 120 గిగావాట్ల మేర సాధించినట్టు తెలిపారు. 450 గిగావాట్ల లక్ష్యాన్ని సమీప కాలంలో చేరుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. గడచిన ఐదేళ్లలో భారత్ 286 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిందని, అంతక్రితం 20 ఏళ్లలో వచ్చినవి ఇందులో సగమేనన్నారు. మౌలిక సదుపాయాలపై 100 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు చెప్పారు. సరుకు రవాణా, అంతర్జాతీయ పోటీతత్వం, అంతర్జాతీయ ఆవిష్కరణ, వ్యాపార సులభతర నిర్వహణ సూచీల్లో భారత్ తన స్థానాలను మెరుగుపరుచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. -
మన బంధం స్వర్గంలోనే నిశ్చయం
ముంబై: భారత–ఇజ్రాయెల్ బంధం స్వర్గంలోనే నిశ్చయమైందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. మానవత్వం, ప్రజాస్వామ్యం, స్వాతంత్య్ర విలువలపై ఈ బంధం ఆధారపడి ఉందన్నారు. భారత పర్యటనకు వచ్చిన నెతన్యాహు గురువారం ముంబైలో ఏర్పాటుచేసిన భారత్–ఇజ్రాయెల్ వ్యాపారవేత్తల సదస్సులో మాట్లాడారు. ఇజ్రాయెల్ క్లిష్టపరిస్థితులనుంచి పైకెదిగి తన దిశను మార్చుకుని ప్రయాణిస్తున్నట్లే.. భారత్ మోదీ నాయకత్వంలో ఇదే విధంగా ముందుకెళ్తోందన్నారు. ఇరుదేశాల మధ్య లోతైన వ్యక్తిగత స్నేహముందన్నారు. భారత సంస్కృతి సాంప్రదాయాలంటే తనకు ఎనలేని గౌరవమని వెల్లడించారు. ‘ప్రపంచంలోని పురాతన సంస్కృతులున్న ప్రజాస్వామ్య దేశాలు మనవి. మనం స్వాతంత్య్రాన్ని, మానవత్వాన్ని పంచుకున్నాం. మనం అసలైన భాగస్వాములం. అందుకే ఈ బంధం స్వర్గంలోనే నిర్ణయమైంది’ అని నెతన్యాహు వ్యాఖ్యానించారు. 2008 ముంబై దాడులతో రక్తమోడిన ఛబాద్ భవనాన్ని నెతన్యాహు సందర్శించారు. నారీమన్ హౌజ్ వద్ద ఆనాటి మృతులకు ఆయన నివాళులర్పించారు. ముంబై దాడుల్లో తల్లిదండ్రులను కోల్పోయిన 11 ఏళ్ల మోషే హోల్ట్జ్బర్గ్ను కలిసి మాట్లాడారు. -
‘రెట్రోస్పెక్టివ్’ పన్నుకు ఇక చెల్లు!
♦ భారత్-ఫ్రాన్స్ వ్యాపార సదస్సులో ప్రధాని మోదీ హామీ ♦ ఆ విధమైన పన్నుల విధానం ఇకపై ఉండబోదని స్పష్టీకరణ చండీగఢ్: భారత్‌లో రెట్రోస్పెక్టివ్ పన్నుల విధానం(పాత ఒప్పందాలకూ పన్నుల వర్తింపు) ఇక గతించిన అంశమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ విధమైన పన్నుల విధింపు అనేది ఇక్కడ మళ్లీ ఎప్పుడూ ఉండబోదని హామీనిచ్చారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ పర్యటన సందర్భంగా ఆదివారం ఇక్కడ జరిగిన భారత్-ఫ్రాన్స్ వ్యాపార సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు. వొడాఫోన్ పన్ను కేసు ఇతరత్రా ఇటువంటివే మరికొన్ని అంశాల కారణంగా భారత్‌లో స్థిరమైన పన్నుల విధానం లేదంటూ విదేశీ ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మోదీ తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘మరో 15 ఏళ్లపాటు భారత్‌లో సుస్థిరమైన పాలన, స్థిరమైన పన్నుల వ్యవస్థ ఉంటుంది. ఇదే విషయాన్ని ఈ సదస్సు సందర్భంగా విదేశీ ఇన్వెస్టర్లందరికీ స్పష్టం చేస్తున్నా. మా ప్రభుత్వం సరళతరమైన, స్థిరమైన పన్నుల విధానానికి కట్టుబడి ఉంది. రెట్రోస్పెక్టివ్ పన్ను అనేది ఇక గతం. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటిది పునరావృతం కాదు. మా ప్రభుత్వమే కాదు భవిష్యత్తులో వచ్చే ఏ ప్రభుత్వాలు కూడా ఈ విధానమైన పన్నుల విధింపు జోలికివెళ్లవని హామీనిస్తున్నా’ అని మోదీ పేర్కొన్నారు. భారత్‌లో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లందరికీ.. రానున్న ఐదేళ్లు, పదేళ్లు, పదిహేనేళ్లలో ఎలాంటి పన్నుల విధానం అమలవుతుందనేది స్పష్టంగా తెలుస్తుందని కూడా ఆయన వివరించారు. ఈ సదస్సులో ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్‌తో పాటు ఆ దేశానికి చెందిన దిగ్గజ కంపెనీల సీఈఓలు పాల్గొన్నారు. డిఫెన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టండి... భారత్‌లో చౌక ఉత్పాదక వ్యయాన్ని అవకాశంగా మలచుకుని ఇక్కడ పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫ్రెంచ్ కంపెనీలను ప్రధాని మోదీ ఆహ్వానించారు. ప్రధానంగా తయారీకి సంబంధించి డిఫెన్స్ రంగంలో అపార వ్యాపార అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. ‘రక్షణ దళాలకు సంబంధించి డిఫెన్స్ తయారీ రంగాన్ని భారత్ ప్రోత్సహిస్తోంది. ఈ విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా మీకు(ఫ్రెంచ్ కంపెనీలు) అన్నివిధాలుగా సహకారం అందిస్తాం’ అని మోదీ వివరించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు(ఎఫ్‌డీఐ) భారత్ అత్యంత ప్రధానమైన గమ్యంగా అవతరించిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ‘ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే వ్యాపారాలకు సానుకూల దేశాల ర్యాంకింగ్‌లో భారత్ 12 స్థానాలు ఎగబాకింది. స్వల్పకాలంలోనే ఎఫ్‌డీఐలు 40 శాతం ఎగబాకడం దీనికి నిదర్శనం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, సుపరిపాలన దిశగా మేం చర్యలు తీసుకుంటున్నాం. ఇవే ప్రపంచాన్ని భారత్‌వైపు ఆకర్షిస్తున్నాయి’ అని ప్రధాని తెలిపారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్... భారత్, ఫ్రాన్స్‌ల మధ్య సంబంధాన్ని ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’గా మోదీ అభివర్ణించారు. ‘అనేక రంగాల్లో ఇరు దేశాలు సమష్టిగా పనిచేసేందుకు అవకాశాలున్నాయి. మీకు(ఫ్రాన్స్) ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఇతరత్రా అంశాలు మాకు అవసరం. మా దగ్గరున్న అపారమైన మార్కెట్ మీకు అవసరం’ అని మోదీ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైల్వే నెట్వర్క్ ఆధునీకరణకు సహకారం అందించాల్సిందిగా మోదీ ఫ్రాన్స్‌ను కోరారు. భారత్ అభివృద్ధి విధానానికి ఫ్రాన్స్ నైపుణ్యం అవసరమని చెప్పారు. భూతాపోన్నతి(గ్లోబల్ వార్మింగ్)ని తగ్గించే విషయంలో చేస్తున్న ప్రయత్నాల్లో భారత్ కీలక పాత్ర పోషించాలని కోరుకుంటోందని కూడా ఈ సందర్భంగా మోదీ వివరించారు. రైల్వేలో డీజిల్ ఇంజిన్ల స్థానంలో భవిష్యత్తులో ఇక ఎలక్ట్రిక్ ఇంజిన్లను ప్రవేశపెట్టే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. పన్ను వివాదాల పరిష్కారంలో వినూత్న విధానాలు: రాష్ట్రపతి న్యూఢిల్లీ: దేశంలో వ్యాపారం నిర్వహణకు సంబంధించి ప్రపంచవ్యాప్త ర్యాంకింగ్ (ప్రపంచబ్యాంక్ 2016 నివేదిక ప్రకారం 130) మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) రెండురోజుల కార్యక్రమాన్ని ఆదివారం నాడు ఇక్కడ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వినూత్న పన్ను వివాద వ్యవస్థ ద్వారా ఈ వివాదాలు పెరక్కుండా చూడాలని సూచించారు. తద్వారా ఈ అంశాన్ని దేశ వృద్ధి బాటలో ఒక భాగంగా మలిచే చర్యలు తీసుకోవాలని సూచించారు.