హైదరాబాద్: అమెరికా తెలుగు సంఘం (ఆటా) హైదరాబాద్ నగరంలో బిజినెస్ సెమినార్ 2021ను నిర్వహించింది. వ్యాపారాలకు సంబంధించిన ఆలోచనలను ప్రోత్సహించడం, యువ వాణిజ్యవేత్తలకు మెంటారింగ్, వెంచర్ క్యాపిటలిస్టులకు ఒక వేదిక కల్పించడం, స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందివ్వడం లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ఇందులో అమెరికా, భారతదేశాలకు చెందిన దాదాపు 100 పాల్గొన్నారు.
లక్ష్యాలు ఇవే
ఈ సెమినార్‌లో ఆటా వేడుకల బిజినెస్ కమిటీ ఛైర్ శ్రీ కాశీ కొత్త మాట్లాడుతూ.. బిజినెస్ సెమినార్ ఎజెండా బహుముఖం. అమెరికాలో స్థిరపడిన తెలుగు వాణిజ్యవేత్తలు, తెలంగాణలోని వ్యాపారవేత్తల మధ్య అనుసంధానం, అనుబంధం పెంచాల్సి ఉందన్నారు. తెలంగాణలోని స్టార్టప్ కంపెనీలకు మెంటారింగ్ చేసి, వాటిలో పెట్టుబడులు వచ్చేలా సూచనలు చేస్తామన్నారు. అదే విధంగా ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ లాంటి టైర్-2 నగరాలకు మరిన్ని కంపెనీలను ఆకర్షించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశాలని తెలిపారు.
ప్రతీ రెండేళ్లకు ఓసారి
ఆటా కాన్ఫరెన్స్ సలహా కమిటీ చైర్మన్ జయంత్ చల్లా మాట్లాడుతూ.. 2014 నుంచి హైదరాబాద్‌లో ప్రతీ రెండేళ్లకు ఓసారి ఆటా ఇలాంటి సెమినార్లు నిర్వహిస్తోందని తెలిపారు. వీటి ద్వారా ఇప్పటి వరకు భారతీయ స్టార్టప్‌లలో దాదాపు 20 మిలియన్ డాలర్లు (రూ. 150 కోట్లకు పైగా) పెట్టుబడులు వచ్చాయన్నారు. ఈ బిజినెస్ సెమినార్ల వల్ల పలు సంంస్థలు టైర్-2 నగరాలకు తరలి వచ్చాయన్నారు. ఖమ్మంలో టి-హబ్ ప్రారంభించడమనేది ఆటా బిజినెస్ కో-ఛైర్ చేపూరి సాధించిన ఓ అతిపెద్ద విజయంగా భావిస్తున్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు.
పాల్గొన్న వారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, తెలంగాణ ప్రభుత్వ ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, ఐటీ పెట్టుబడుల విభాగం సీఈవో విజయ్ రంగినేని, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సీఈవో శ్రీకాంత్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. ఆటా తరఫున భువనేష్ బూజల (ఆటా ప్రెసిడెంట్), మధు బొమ్మినేని (ఆటా ప్రెసిడెంట్ ఎలక్ట్), ఆటా వేడుకల ఛైర్ జయంత్ చల్లా, సదస్సు సలహా కమిటీ ఛైర్ కిరణ్ పాశంలతో పాటు సమన్వయకర్తలు కాశీ కొత్త, ఆటా వేడుకల బిజినెస్ ఛైర్ లక్ష్ చేపూరి, ఆటా వేడుకలు బిజినెస్ కో-ఛైర్ తదితరులు పాల్గొన్నారు.
1990 నుంచి
అమెరికా వ్యాప్తంగా ఉన్న ఐదువేల మందికి పైగా తెలుగువారికి ప్రాతినిధ్యం వహించేందుకు 1990లో అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు ఇందులో పెద్ద సంఖ్యలో సభ్యత్వం కలిగి ఉన్నారు. అమెరికాకు వచ్చిన తొలితరం వారు ఎక్కువ మంది ఆటాలో సభ్యత్వం కలిగి ఉన్నారు. సమాజ సేవ, వ్యాపారం, సంస్కృతి, సామాజిక కార్యకలాపాలు, విద్యార్థులకు సాయం, తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణ, ప్రోత్సాహం తదితరాల బాధ్యతలను అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థ నిర్వహిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment