
ఇండియన్ హిస్టరీ
గుప్తానంతర యుగం - 3
ఈ యుగంలో దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజవంశాల్లో ముఖ్యమైన రాజవంశం పల్లవులు. వీరు నేటి తమిళనాడు, ఆంధ్రా ప్రాంతాలను పరిపాలించారు. బాదామి చాళుక్యులతో నిరంతరం యుద్ధాల్లో మునిగి ఉన్నప్పటికీ దక్షిణ భారత వాస్తుశిల్ప కళలకు వీరు విశేషమైన సేవ చేశారు. దక్షిణ భారత దేవాలయాల నిర్మాణానికి పేరెన్నికగన్న ద్రవిడ శైలి పల్లవుల కాలంలోనే ప్రారంభమైంది. తర్వాతి కాలంలో చోళులు ఈ ద్రవిడ శైలిని అత్యున్నత దశకు తీసుకెళ్లారు.
పల్లవులు: పల్లవుల పుట్టుపూర్వోత్తరాలపై భిన్న వివాదాలున్నాయి. కొందరు వీరిని ఉత్తర భారతదేశాన్ని పాలించిన పార్థియన్లు, పహ్లవుల శాఖ అని, మరికొందరు వాకాటకుల శాఖ అని, ఇంకొందరు స్థానిక నాగజాతివారని అభిప్రాయపడ్డారు.
కంచి రాజధానిగా క్రీ.శ. 3వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం వరకు తొలి పల్లవులు పాలించారు. వీరి రాజ్యాన్ని కలభ్రులు అంతం చేశారు. అయితే తిరిగి కలభ్రులను అంతం చేసి సింహవిష్ణు అనే రాజు పల్లవ వంశాన్ని పునఃస్థాపించాడు. వీరినే నవీన పల్లవులుగా పరిగణిస్తారు. గుప్తానంతర యుగంలో దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజులు వీరే.
పల్లవుల రాజకీయ చరిత్ర
నవీన పల్లవులు క్రీ.శ. 6వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు తమిళ దేశాన్ని కంచి కేంద్రంగా పాలించారు.
సింహవిష్ణు: ఇతడు నవీన పల్లవ వంశ స్థాపకుడు. కృష్ణా నది నుంచి కావేరి నది వరకు ఉన్న మొత్తం భూభాగాన్ని పరిపాలించాడు. పల్లవ వంశంలోని ఇతర రాజులకు భిన్నంగా సింహ విష్ణు వైష్ణవ మతాన్ని ఆదరించాడు. ప్రముఖ కవి భారవి ఇతడి ఆస్థానాన్ని సందర్శించాడు.
మొదటి మహేంద్రవర్మ: ఇతడు బహుముఖ ప్రజ్ఞాశాలి. విచిత్రచిత్త, మత్తవిలాస, గుణభద్ర, శత్రుమల్ల తదితర బిరుదులను ధరించాడు. మొదటి మహేంద్రవర్మ తొలుత జైన మతాన్ని ఆదరించాడు. కానీ తన కాలంలో ఉన్న ప్రముఖ నయనార్ తిరునవుక్కరసు ప్రభావంతో శైవాన్ని స్వీకరించాడు. రెండో పులకేశి ఇతడిని క్రీస్తుశకం 630లో పుల్లలూరు యుద్ధంలో అంతం చేసి, రాజ్య ఉత్తర ప్రాంతాలను ఆక్రమించాడు. మహేంద్రవర్మ రాసిన మత్తవిలాస ప్రహసనం అనే గ్రంథం ఆనాటి శైవ, బౌద్ధ మత సంప్రదాయాలను విమర్శనాత్మకంగా వెల్లడించింది.
మొదటి నరసింహవర్మ: పల్లవ రాజులందరిలోకి అగ్రగణ్యుడు మొదటి నరసింహవర్మ. ఇతడికి మహామల్ల, మహాబలి అనే బిరుదులున్నాయి. ఇతడు రెండో పులకేశిని మూడుసార్లు ఓడించడమే కాకుండా క్రీ.శ. 642లో మణిమంగళ యుద్ధంలో పులకేశిని అంతం చేశాడు. చాళుక్యుల రాజధానిని ధ్వంసం చేసి వాతాపికొండ అనే బిరుదును ధరించాడు. తన మిత్రుడు మానవర్మ సహాయార్థం శ్రీలంకపై దాడిచేసి, అతడికి శ్రీలంక సింహాసనాన్ని ఇప్పించాడు. ఇతడి పాలనా కాలంలో చైనా యాత్రికుడు హ్యుయాన్‌త్సాంగ్ కంచిని సందర్శించాడు. కంచిలో హిందూ మతంతో పాటు జైన, బౌద్ధాలు కూడా ఆదరణకు నోచుకున్నాయని హ్యుయాన్‌త్సాంగ్ పేర్కొన్నాడు.
రెండో మహేంద్రవర్మ: ఇతడు బాదామి చాళుక్య రాజు. మొదటి విక్రమాదిత్యుడి చేతిలో అంతమయ్యాడు.
మొదటి పరమేశ్వర వర్మ: ఇతడికి ఉగ్రదండ అనే బిరుదు ఉంది. మొదటి విక్రమాదిత్యుడిని ఓడించడమే కాక చాళుక్య నగరాన్ని ధ్వంసం చేశాడు. చిత్రమాయ, లోకాదిత్య, రణజయ అనేవి ఇతడి ఇతర బిరుదులు.
రెండో నరసింహవర్మ: ఇతడి పాలనాకాలం శాంతి సామరస్యాలకు, దేవాలయాల నిర్మాణానికి పేరుగాంచింది. రెండో నరసింహవర్మ తన కాలంలో హిందూ విద్యాలయాలైన ఘటికలను పునరుద్ధరించాడు. రెండో నరసింహవర్మకు రాజసింహ అనే బిరుదుతోపాటు మరో 250 దాకా బిరుదులున్నాయి. వీటి వివరాలను కైలాసనాథ దేవాలయం గోడలపై లిఖించారు.
రెండో పరమేశ్వర వర్మ: ఇతడు చాళుక్య రాజు రెండో విక్రమాదిత్యుడి దాడిని ఎదుర్కొన్నాడు. చివరికి పశ్చిమ గాంగుల చేతిలో హతమయ్యాడు.
రెండో నందివర్మ: ఇతడు 65 ఏళ్లు సుదీర్ఘకాలంపాటు పల్లవ రాజ్యాన్ని పాలించాడు. వైష్ణవ మతాన్ని ఆదరించాడు. అనేక ప్రాచీన దేవాలయాలను పునరుద్దరించాడు. తిరుమంగై ఆళ్వార్ అనే వైష్ణవ సన్యాసి ఇతడి కాలంలో నివసించాడు.
దంతివర్మన్: ఇతడి కాలంలో రాష్ర్టకూట రాజు రెండో గోవిందుడు పల్లవ రాజ్యంపై దాడిచేసి దంతివర్మన్‌ను ఓడించాడు. మరోవైపు పాండ్యులతో కూడా ఇతడు పోరాడాల్సి వచ్చింది.
మూడో నందివర్మ: ఇతడు రాష్ర్టకూటులు, గాంగులతో కలిసి పాండ్యులను ఓడించాడు. సాహిత్యం, కళలను గొప్పగా పోషించాడు. మూడో నందివర్మ కాలంలోనే పెరుందేవనార్ అనే తమిళ కవి సంస్కృత మహాభారతాన్ని తమిళంలోకి అనువదించాడు.
నృపతుంగ: ఇతడు పాండ్యరాజు శ్రీమారను అంతం చేశాడు. నృపతుంగ కాలంలోనే చోళులు పల్లవులకు సామంతులుగా తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
అపరాజిత వర్మ: పల్లవ వంశంలో చివరిరాజు. ఇతడికి రాజమార్తాండ అనే బిరుదు ఉంది. అపరాజిత వర్మను చోళ సామంతుడు ఆదిత్యచోళుడు అంతం చేసి స్వతంత్ర చోళ రాజ్యాన్ని స్థాపించాడు.
పల్లవుల సాంస్కృతిక సేవ
సాహిత్యం: పల్లవులు సంస్కృత, తమిళ సాహిత్యాలను సమానంగా ఆదరించారు. ఈ కాల సంస్కృత గ్రంథాల్లో ముఖ్యమైనవి భారవి రచించిన కిరాతార్జునీయం, దండి రచించిన దశకుమార చరిత్ర, మొదటి మహేంద్రవర్మ రచించిన మత్త విలాస ప్రహసనం.
ఈ కాల తమిళ సాహిత్యంలో ముఖ్యమైన గ్రంథాలు ఏరుందేవనార్ రచించిన తమిళ భా రతం, అళ్వారులు రచించిన వైష్ణవ సాహిత్య గ్రంథం నీలరీయం, నయనార్లు రచించిన శైవ సాహిత్య గ్రంథం తేవరం ముఖ్యమైనవి.
వాస్తు శిల్ప కళ: భారతదేశానికి ఒక కొత్త వాస్తు శిల్పకళా శైలిని అందించిన ఘనత పల్లవులదే. ఈ శైలిలో వీరు ఒకవైపు గుహాలయాలు, మరోవైపు రాతి కట్టడాలను నిర్మించారు.
గుహాలయాలు: మొదటి మహేంద్రవర్మ కాలంలో భైరవకొండ, సిత్తన్నవస్సల్ ప్రాంతా ల్లో రెండు శైవాలయాలు, ఉండవల్లిలో ఐదు అంతస్థులు కలిగిన వైష్ణవ గుహాలయాన్ని నిర్మించారు. ఇంకా తిరుచునాపల్లి, మహేంద్రవాడి, దాలవనూరు ప్రాంతాల్లో గుహాలయాలను కట్టించారు.
మొదటి నరసింహ వర్మ తాను నిర్మించిన కొత్త రాజధాని మామల్లపురం (మహాబలిపురం)లో గుహాలయాలతోపాటు ఏకశిలా నిర్మితమైన 8 పాండవ రథాలను నిర్మించారు. రెండో నరసింహవర్మ గుహాలయాలకు బదులు గొప్ప అలంకృత శైలిలో అనేక రాతి నిర్మాణాలను ఏర్పాటు చేశాడు. ఇతడు కంచిలో కైలాసనాథ ఆలయం, మామల్లపురంలో తీర దేవాలయం, కంచిలో ఐరావతేశ్వరాలయం, పనమలైలో శైవాలయం, మహాబలిపురంలో ముకుంద, ఈశ్వర అనే ఇతర దేవాలయాలను నిర్మించాడు.
రెండో నందివర్మ కాలంలో నిర్మించిన ఆలయా ల్లో ముఖ్యమైనవి... కంచిలోని వైకుంఠ పెరుమాళ్ ఆలయం, ముక్తేశ్వరాలయం, మాతంగేశ్వరాలయం, ఆర్గండంలోని వాడమల్లీశ్వరాలయం, గుడిమల్లంలోని పరశురామేశ్వర ఆలయం.