
సాక్షి : భారత దేశ చరిత్రలో మొగలులు సాధించింది ఏం లేదు. దేశాన్ని పూర్తిగా కొల్లగొట్టడం తప్ప.. ఈ వ్యాఖ్యలు చేస్తుంది ఎవరో కాదు ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ. అందుకే చరిత్ర పుసక్తాలను తిరగరాయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క దినేశ్ మాత్రమేకాదు .. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ అంశంపై హాట్ హాట్ చర్చ జరుగుతోంది.
నిజానికి ఈ వ్యవహారం దశాబ్దాలుగా కొనసాగుతూనే వస్తోంది. ఇస్లాం పాలకులైన మొగలుల జీవిత కథలను పాఠ్యాంశాల నుంచి తొలగించాలంటూ హిందుత్వ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 1977 లో జనతా ప్రభుత్వ హయాంలో జన సంఘ్ నేతలు కొందరు చరిత్ర పుస్తకాలను మార్చేందుకు తీవ్రంగా యత్నించారు. రొమిల థాపర్, బిపిన్ చంద్ర, హరబన్స్ ముఖియా కొందరు జనసంఘ్ నేతలు పుస్తకాలు రాశారు కూడా. అయితే జాతీయ విద్యా పరిశోధక మండలి నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావటం ఆ ప్రయత్నం విఫలమైంది.
కానీ, ఇప్పుడు మారుతున్న పరిస్థితులు.. రాజకీయ ప్రభావాలు మెల్లి మెల్లిగా ఇస్లాం పాలకులైన మొగలుల చరిత్రను క్రమక్రమంగా కనుమరుగు చేస్తూ వస్తున్నాయి. ఇప్పటికే హిందుత్వ సంస్థ అయిన ఆరెస్సెస్ తమ ఆలోచనలకు తగ్గట్లుగా చరిత్ర పుస్తకాలను ప్రచురించింది. మరికొన్ని చోట్ల కూడా ఇప్పటికే ప్రచురించిన పుస్తకాలతోనే పాఠాలు బోధించటం మొదలుపెట్టేశారు.
గుజరాత్‌లో శిక్షా బచావో ఆందోళన్ సమితి కన్వీనర్, ఆరెస్సెస్ భావజాలకుడు దీనానాథ్ బత్రా రాసిన పుసక్తాలకు 2014 నుంచే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. త్వరలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆయన రాసిన పుస్తకాలనే ప్రవేశపెట్టబోతుంది. ఇక రాజస్థాన్ ప్రభుత్వం పదో తరగతి పుస్తకాల్లోని ఏకంగా గాంధీ, నెహ్రూలకు సంబంధించిన పాఠ‍్యాంశాలపై కోత విధించి.. హిందుత్వ వాది వీర సావర్కర్ కథాంశాన్ని హైలెట్ చేసింది. మహారాష్ట్ర, హర్యానా ప్రభుత్వాలైతే ఏకంగా మొగలులకు సంబంధించిన కథలను తగ్గించేసి హిస్టరీ అండ్ సివిక్స్ పేరటి పుస్తకాలకు నామకరణం చేసి పైగా అందులో మరాఠా వీరుడు శివాజీ పాలనకు సంబంధించిన విషయాలను.. మధ్యయుగం, మరాఠా సామ్రాజ్య విస్తరణ వంటి అంశాల గురించి ప్రస్తావించాయి.
అయితే మొగలులు బ్రిటీషర్ల మాదిరిగా ఏనాడూ దేశంపై పడి దోచుకునే ప్రయత్నం చేయలేదని హర్బన్స్ ముకియా అనే చరిత్ర ప్రొఫెసర్ చెబుతున్నారు. పైగా అక్బర్, బాబర్ లాంటి చక్రవర్తులు మన మతాలు, సాంప్రదాయాలకు మంచి గౌరవం ఇచ్చి మనలో ఒకరిగా కలిసిపోయారని, పైగా కళా సంపదను మనకు అందించారని అంటున్నారు. కొందరు వామపక్ష భావ జాలాలున్న రచయితలు స్వేచ్ఛ తీసుకుని చరిత్రపై రాయటం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని ముకియా అంటున్నారు. ఏది ఏమైనా ఈ అంశంలో మతపరమైన వాదనలు కాకుండా, సుదీర్ఘ అధ్యయనం అవసరమన్న భావనను చరిత్రకారులు బలంగా వినిపిస్తున్నారు.