పరిగి: ప్రైవేటు విద్యాలయాలపై మండల విద్యాధికారి కొరడా ఝుళిపించారు. అకాస్మాత్తుగా సోదాలు నిర్వహించి అనుమతి లేని, పుస్తకాలు, బ్యాగులు విక్రయించిన పాఠశాలలు మూసివేయాలని ఆదేశించారు. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం పట్టణ కేంద్రంలోని పలు ప్రైవేటు పాఠశాలలను మండల విద్యాధికారి హరిశ్చందర్ తనిఖీ చేశారు. న్యూబ్రిలియంట్ టెక్నో స్కూల్‌లో పాఠ్యపుస్తకాలు ఉండటంతో గదిని సీజ్ చేశారు. లిటిల్ బడ్డీ స్కూల్‌కు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో వెంటనే మూసి వేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలలో ఎలాంటి వాణిజ్యపరమైన పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్మ్, స్కూల్ బ్యాగ్స్ ఏ వస్తువులు అమ్మినా పాఠశాల పర్మిషన్ రద్దు చేస్తామని చెప్పారు. ఫీజులు ఎక్కువ వసూలు చేయరాదని, విద్యాహక్కు చట్టం ప్రకారం గతేడాది వసూలు చేసిన విధంగానే.. ఇప్పుడు తీసుకోవాలని సూచించారు.
రాతపూర్వకంగా..
గతేడాది కంటే ఇప్పుడు ఎవరైనా అధిక ఫీజులు వసూలు చేసినట్లయితే.. విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు అండర్ టేకింగ్ సర్టిఫికెట్ ఇవ్వాలని, బడిలో ఎలాంటి పుస్తకాలు, దుస్తులు, బ్యాగులు విక్రయించమని రాతపూర్వకంగా రెండు రోజుల్లో మండల విద్యావనరుల కేంద్రంలో ఇవ్వాలని హెచ్చరించారు. ఇప్పటికే రెండు పాఠశాలల్లో దుస్తులు, పాఠ్యపుస్తకాలు విక్రయించినట్లు తెలిసిందని, వాటిని సీజ్ చేశామని, త్వరలో మళ్లీ సోదాలు చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment