మురళి మెడలో విజయ హారం! | Kommisetty Muralidhar success speak | Sakshi
Sakshi News home page

మురళి మెడలో విజయ హారం!

Published Thu, Feb 6 2014 2:47 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

మురళి మెడలో విజయ హారం! - Sakshi

మురళి మెడలో విజయ హారం!

ఎంచుకున్న లక్ష్యం ఉన్నతంగా ఉన్నప్పుడు.. దాన్ని అందుకునేందుకు పయనించే మార్గం అత్యున్నతంగా ఉండాలి. కసితో కూడిన సాధన ఎంతటి కఠిన లక్ష్యాన్నయినా ఛేదిస్తుంది.. విజయ గమ్యాన్ని చేరుకునే మార్గంలో అపజయాలు ఎదురైనా, వాటినే గెలుపు సోపానాలుగా మార్చుకునే వారు కొందరే ఉంటారు. ఇలా సక్సెస్ బాటలో నడిచి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్)లో జాతీయ స్థాయిలో 12వ ర్యాంకు సాధించారు తెలుగు తేజం కొమ్మిశెట్టి మురళీధర్. ఆయన గెలుపు ప్రస్థానం ‘భవిత’ పాఠకుల కోసం..
 

మాది వైఎస్సార్ కడప జిల్లా. నాన్న రామప్రసాద్ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో శానిటరీ సూపర్‌వైజర్. అమ్మ గోపాలమ్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. తమ్ముడు గిరిధర్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. జీవి త భాగస్వామి హరిప్రియ సివిల్స్‌కు సిద్ధమవుతున్నారు.
 
 ఆ సంకల్పం బడిలోనే:  నాన్న ప్రోత్సాహంతో 6-8 తరగతి వరకు కోరుకొండ సైనిక్ స్కూల్‌లో చదివా. విజయవాడ శ్రీచైతన్యలో ఇంటర్ పూర్తిచేశా. సైనిక్ స్కూల్‌లో చదివినప్పటికీ అప్పట్లో సైన్యంలో చేరాలన్న ఆలోచన లేదు. అయితే సమాజానికి ఏదో ఒక విధంగా సేవచేయాలని అప్పట్లోనే మనసులో నాటుకుపోయింది. ఐఐటీ మద్రాస్‌లో డ్యూయల్ డిగ్రీ (బీటెక్+ఎంటెక్) పూర్తిచేశా. పుణేలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నప్పుడు సివిల్స్ దిశగా ఆలోచనలు సాగాయి. అందుకే ఐదంకెల వేతనం వస్తున్న కొలువును వదులుకొని, ఐఏఎస్ అధికారి అయిన మామయ్య రామాంజనేయులు సలహాతో ఢిల్లీ వెళ్లి, ఓ కోచింగ్ సెంటర్‌లో చేరాను.


 
 ఓటమి నుంచి ఆత్మవిశ్వాసం:  సివిల్స్ సాధించే క్రమంలో మొదటిసారి అపజయం ఎదురైంది. అయితే ఆ ప్రయత్నంలో సాధించిన మార్కులు నా ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. రెండోసారి మెయిన్స్ వరకు వెళ్లి, ఫలితం కోసం ఎదురుచూస్తున్న సమయంలో నువ్వు ఐఎఫ్‌ఎస్‌కు ఎందుకు ప్రయత్నించకూడదనే ఫ్యాకల్టీ సలహాతో ఆ దిశగా ప్రయత్నం ప్రారంభించాను. 2013లో సివిల్స్, ఐఎఫ్‌ఎస్ రెండింటిలోనూ ప్రిలిమ్స్ దశను దాటాను.

 

ఐఎఫ్‌ఎస్ మెయిన్స్‌కు ఫారెస్ట్రీ, జియాలజీలు ఆప్షనల్ సబ్జెక్టులు. సివిల్స్ ప్రిపరేషన్ ఐఎఫ్‌ఎస్ జనరల్ స్టడీస్ పేపర్‌కు బాగా ఉపయోగపడింది. ఫారెస్ట్రీ మెటీరియల్ కోసం ఢిల్లీలో నేను ఉన్నచోటకు దగ్గర్లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీకి వెళ్లేవాణ్ని. ఇక జియాలజీ సబ్జెక్టుకు కోచింగ్ మెటీరియల్ చాలా వరకు ఉపయోగపడింది. గత పరీక్షల సమయంలో చేసిన తప్పులను గుర్తించి, వాటిని సరిదిద్దుకున్నాను.
 


 రోజుకు ఎనిమిది గంటలు:  ప్రిపరేషన్‌కు రోజుకు ఎనిమిది గంటలు కేటాయించాను. పరీక్షకు రెండు నెలల ముందు 10 గంటలు చదివా. ఉదయం తప్పనిసరిగా ఇంగ్లిష్ దినపత్రికలు చదివేవాణ్ని. రోజులో జనరల్ స్టడీస్‌కు రెండు గంటలు, ఆప్షనల్స్‌కు రెండు గంటలు కేటాయించాను. సొంతంగా నోట్స్ రూపొందించుకున్నాను. సబ్జెక్టుల వారీగా ప్రిపరేషన్‌ను ప్రణాళికను రూపొందించుకొని, ఏ రోజు చదవాల్సిన అంశాలను ఆ రోజే చదివాను. చదవడం వల్ల వచ్చిన అలసటను దూరం చేసుకునేందుకు బ్లాగులు రాసేవాణ్ని.


 
 ఇంటర్వ్యూ కొత్త అనుభవం:  గతంలో రైల్వేస్ చైర్మన్‌గా పనిచేసిన వినయ్ మిట్టల్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం నన్ను ఇంటర్వ్యూ చేసింది. ‘‘మీరు ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగం నుంచి ఆశిస్తున్నదేమిటి?’’- ఇంటర్వ్యూలో ఎదురైన మొదటి ప్రశ్న ఇది. తొలి రోజు మొదటి అభ్యర్థిగా ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టడంతో ఒత్తిడికి గురయ్యా. అయితే బోర్డు సభ్యులు స్నేహపూర్వకంగా వ్యవహరించడంతో ఆ ఒత్తిడి దూరమైంది. బయోడేటా నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు.

 

నా హాబీలైన జాగింగ్, వీధి బాలలకు చదువుచెప్పడంపై ప్రశ్నలు అడిగారు. నీకు తెలిసిన టైగర్ రిజర్వ్ ఏంటని ప్రశ్నించగా శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ అని సమాధానం చెప్పాను. అక్కడ ఎన్ని పులులుంటాయో చెప్పండంటూ మరో ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానం తెలియదని చెప్పాను. దాదాపు 25 ప్రశ్నలు అడిగారు. మొత్తంమీద ఇంటర్వ్యూను బాగా చేశాను. తప్పకుండా విజయం సాధిస్తానని ఆ రోజే నమ్మకం కలిగింది. అది నిజమైంది.


 
 నిజాయితీగా శ్రమిస్తే విజయం!
 భారత ఆర్థిక వ్యవస్థలో అటవీ ప్రాంతానికి కీలక స్థానముంది. ఈ క్రమంలోనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌పై యువతలో క్రేజ్ పెరిగింది. లక్ష్యాన్ని సాధించాలన్న తపనతో పాటు కష్టపడే తత్వం ఉంటే అవి విజయానికి చేరువ చేస్తాయి. భారతదేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన అంశాలపై పూర్తిస్థాయిలో పట్టుసాధిస్తే విజయం చేజిక్కినట్లే.

 

మార్కెట్లో సులువుగా మెటీరియల్ లభించే సబ్జెక్టులను ఆప్షన్స్‌గా ఎంపిక చేసుకోవాలి. ఇంటర్వ్యూ సందర్భంగా బోర్డు సభ్యులు అడిగే ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు చెప్పడం ప్రధానం. మనం ఇచ్చే సమాధానం ఎంత నిజాయితీగా, ఆత్మవిశ్వాసంతో ఇస్తున్నామన్నదాన్ని బోర్డు చూస్తుంది. జవాబు తెలియనపుడు ‘తెలియదు’ అనే సమాధానం చెప్పగలిగే ధైర్యం కావాలి.

 

'‘కుటుంబ సభ్యులు అందించిన ప్రోత్సాహం, ఐఏఎస్ అధికారి అయిన మామయ్య రామాంజనేయులు స్ఫూర్తితో కొనసాగించిన ప్రణాళికాబద్ధమైన ప్రిపరేషన్ నాకు విజయాన్ని చేజిక్కేలా చేసింది’’
కొమ్మిశెట్టి మురళీధర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement