ఆస్కార్‌ ఉత్తమ చిత్రంగా మూన్‌లైట్‌ | 'Moonlight' won best picture because of Oscars' version of Electoral | Sakshi
Sakshi News home page

ఆస్కార్‌ ఉత్తమ చిత్రంగా మూన్‌లైట్‌

Published Thu, Mar 2 2017 12:34 AM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM

ఆస్కార్‌ ఉత్తమ చిత్రంగా మూన్‌లైట్‌

ఆస్కార్‌ ఉత్తమ చిత్రంగా మూన్‌లైట్‌

జాతీయం
దేశంలోనే అతిపెద్ద శివుడి విగ్రహం ఆవిష్కరణ
దేశంలోనే అతిపెద్ద శివుడి విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ తమిళనాడులోని కోయంబత్తూరులో ఆవిష్కరించారు. 112 అడుగుల ఎల్తైన ఆది యోగి విగ్రహాన్ని ఈశా ఫౌండేషన్‌ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్, తమిళనాడు గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి తదితరులు పాల్గొన్నారు.

భారత్, రువాండాల మధ్య 3 ఒప్పందాలు
భారత ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ రువాండా పర్యటన సందర్భంగా రెండు దేశాలు ఫిబ్రవరి 20న మూడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇందులో ఇరు దేశాల మధ్య నేరుగా విమానాలు నడిపేందుకు ఉద్దేశించిన వాయు సేవల ఒప్పందం, రువాండాలో ఎంటర్‌ప్రెన్యూరియల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు, దౌత్యవేత్తలు, అధికారిక పాస్‌పోర్ట్‌ కలిగిన వారికి వీసా మినహాయింపు ఒప్పందాలు ఉన్నాయి.

తీర నిఘా ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
తీర ప్రాంతాలపై నిఘా పెంచడమే లక్ష్యంగా ప్రతిపాదించిన ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ నేతృత్వంలోని రక్షణ పరికరాల కొనుగోలు మండలి (డీఏసీ) ఫిబ్రవరి 21న అంగీకారం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌ కోసం రూ.800 కోట్లను వెచ్చించనున్నారు. ఇందులో భాగంగా తీర ప్రాంతాల్లో 38 రాడార్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

జాతీయ పార్కుల్లో బీబీసీ ఎంట్రీపై నిషేధం
భారతదేశంలోని జాతీయ పార్కుల్లోకి బీబీసీ, అందులో పనిచేసే జర్నలిస్ట్‌ జస్టిన్‌ రౌలత ప్రవేశంపై ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ ఫిబ్రవరి 27న జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్‌సీటీఏ) నిర్ణయం తీసుకుంది. అసోంలోని ప్రఖ్యాత కజిరంగా నేషనల్‌ పార్క్‌లో భారత్‌ చేపడుతున్న జంతువుల రక్షణ చర్యలను ప్రశ్నిస్తూ బీబీసీ తీసిన డాక్యుమెంటరీ అత్యంత దారుణంగా ఉండటంతో ఎన్‌సీటీఏ ఈ చర్యలు తీసుకుంది.

అంతర్జాతీయం
అమల్లోకి డబ్ల్యూటీఓ వాణిజ్య సదుపాయాల ఒప్పందం
ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)కు చెందిన వాణిజ్య సదుపాయాల ఒప్పందం (ట్రేడ్‌ ఫెసిలిటేషన్‌ అగ్రిమెంట్‌) ఫిబ్రవరి 22 నుంచి అమల్లోకి వచ్చింది. కస్టమ్స్‌ నిబంధనల సరళీకరణ తదితర అంశాలకు ఉద్దేశించిన ఈ ఒప్పందాన్ని భారత్‌తో సహా డబ్ల్యూటీఓలోని రెండింట మూడొంతుల సభ్య దేశాలు ఆమోదించాయి. ఈ ఒప్పందం కారణంగా ప్రపంచ వాణిజ్యం ఏటా ట్రిలియన్‌ డాలర్ల మేర పెరిగే అవకాశం ఉంది.

పీహెచ్‌డీలు అత్యధికంగా పొందుతుంది యూఎస్‌లోనే
పరిశోధన రంగంలో అత్యధిక పీహెచ్‌డీలు సాధిస్తున్న దేశాలకు సంబంధించి ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ) ఫిబ్రవరి 27న విడుదల చేసిన నివేదిక ప్రకారం అమెరికాలో అత్యధికంగా డాక్టరేట్‌ డిగ్రీలు పొందుతున్నారు. ఉన్నత విద్యపై కమిటీ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ టెక్నలాజికల్‌ పాలసీ– 2016, సెప్టెంబర్‌లో రూపొందించిన నివేదికను ఓఈసీడీ ఆమోదించింది. ఆర్థిక సహకారం, అభివృద్ధి సంఘంగా పిలిచే ఓఈసీడీలో 35 దేశాలు సభ్యులుగా ఉన్నాయి.

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
ఇజ్రాయెల్‌తో భారీ క్షిపణి ఒప్పందం
ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను చేధించే మధ్యంతర శ్రేణి క్షిపణి (ఎంఆర్‌–శామ్‌)ని ఇజ్రాయెల్‌తో కలిసి అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన భారీ ఒప్పందానికి కేంద్ర కేబినెట్‌ ఫిబ్రవరి 22న ఆమోదం తెలిపింది. రూ.17,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ); ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ (ఐఏఐ)లు సంయుక్తంగా అమలుచేస్తాయి. ఈ ఒప్పందం ప్రకారం భారత సైన్యానికి క్షిపణులు సరఫరా చేస్తారు. ఈ క్షిపణి నౌకాదళం కోసం రూపొందిస్తున్న దీర్ఘశ్రేణి ఎల్‌ఆర్‌–శామ్‌కు భూతల వెర్షన్‌. దీని పరిధి దాదాపు 70 కిలోమీటర్లు.

ఏడు గ్రహాల సౌర కుటుంబాన్ని గుర్తించిన నాసా
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) శాస్త్రవేత్తలు మరో సౌర కుటుంబాన్ని గుర్తించారు. ఇందులో ఏడు గ్రహాలు కొంచెం అటు ఇటుగా భూమి సైజులోనే ఉన్నాయని నాసా ఫిబ్రవరి 21న తెలిపింది. వీటిలో కనీసం 6 గ్రహాలపై భూమిపై ఉన్నట్లే రాళ్లు, రప్పలు ఉన్నాయి. మొత్తం 7 గ్రహాల్లో మూడు గోల్డిలాక్‌ జోన్‌లో ఉన్నాయి. అంటే ఈ మూడు గ్రహాలు సూర్యుడి నుంచి మరీ దూరంగా కాకుండా (చల్లగా ఉండకుండా) మరీ దగ్గరగా లేకుండా (ఎండ వేడికి కరిగిపోకుండా) ఉన్నాయి. దీంతో ఈ మూడు గ్రహాలపై భారీ మహా సముద్రాలు ఉండే అవకాశం ఉంది.

ఆర్థికం
దేశంలోనే ధనిక నగరంగా ముంబై
దేశ ఆర్థిక రాజధాని ముంబై దేశంలోనే ధనిక నగరంగా నిలిచింది. 46,000 మంది మిలియనీర్లు, 28 మంది బిలియనీర్లకు ముంబై నివాస స్థలంగా ఉంది. ముంబైలో మొత్తం సంపద 820 బిలియన్‌ డాలర్లుగా ఉందని న్యూ వరల్డ్‌ వెల్త్‌ నివేదిక తెలిపింది. సంపద పరంగా ముంబై తర్వాత స్థానాల్లో వరుసగా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాలు ఉన్నాయి. ఢిల్లీలో 23,000 మంది మిలియనీర్లు, 18 మంది బిలియనీర్లు ఉన్నారు. మొత్తం సంపద 450 బిలియన్‌ డాలర్లు. బెంగళూరులో 7,700 మంది మిలియనీర్లు, 8 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరి మొత్తం సంపద 320 బిలియన్‌ డాలర్లు. నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్‌లో 9,000 మంది మిలియనీర్లు, ఆరుగురు బిలియనీర్లు ఉన్నారు. వీరి సంపద 310 బిలియన్‌ డాలర్లు. దేశంలో మొత్తం సంపద 6.2 లక్షల కోట్ల డాలర్లు కాగా, 2,64,000 మంది మిలియనీర్లు, 95 మంది బిలియనీర్లు ఉన్నారు.

వార్తల్లో వ్యక్తులు
ఆర్థికవేత్త కెన్నెత్‌ కన్నుమూత
ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్‌ పురస్కార గ్రహీత కెన్నెత్‌ జె.ఆరో (95) అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఫిబ్రవరి 21న మరణించారు. ఆయనకు సాధారణ సమతౌల్య సిద్ధాంతంలో గణిత నమూనాలపై చేసిన కృషికి 1972లో నోబెల్‌ బహుమతి దక్కింది.

అజర్‌బైజాన్‌ ఉపాధ్యక్షురాలిగా
అధ్యక్షుడి భార్య
అజర్‌బైజాన్‌ అధ్యక్షుడు ఇల్హమ్‌ అలియెవ్‌ తన భార్య మెహ్రిబన్‌ను ఆ దేశానికి మొట్టమొదటి ఉపాధ్యక్షురాలిగా నియమించారు. దీని కోసం 2016, సెప్టెంబర్‌లో రిఫరెండం నిర్వహించారు.

అవార్డులు
ఆస్కార్‌ ఉత్తమ చిత్రంగా మూన్‌లైట్‌
చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకమైన 89వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం ఫిబ్రవరి 27న లాస్‌ఏంజెల్స్‌లో జరిగింది.
అవార్డులు–విజేతలు
ఉత్తమ చిత్రం: మూన్‌లైట్‌
ఉత్తమ నటుడు: కేసీ ఆఫ్లెక్‌
(మాంచెస్టర్‌ బై ద సీ)
ఉత్తమ నటి: ఎమ్మాస్టోన్‌ (లా లా లాండ్‌)
ఉత్తమ దర్శకుడు: డామీన చాజెల్లె
(లా లా లాండ్‌)
ఉత్తమ సహాయ నటుడు: మహేర్షాల అలీ (మూన్‌లైట్‌), ఆస్కార్‌ పొందిన తొలి ముస్లిం.
ఉత్తమ విదేశీ భాష చిత్రం:
ది సేల్స్‌మ్యాన్‌ (ఇరాన్‌)
ఉత్తమ సహాయ నటి:
వయోలా డేవిస్‌ (ఫెన్సెస్‌)
ఉత్తమ డాక్యుమెంటరీ:
.జే.. మేడ్‌ ఇన్‌ అమెరికా
 స్ట్‌ సినిమాటోగ్రఫీ: లా లా లాండ్‌
బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌: లా లా లాండ్‌
టంకశాల అశోక్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
ప్రముఖ పాత్రికేయుడు టంకశాల అశోక్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. ఆంగ్లంలో రాజ్‌మోహన్‌గాంధీ రచించిన పటేల్‌: ఏ లైఫ్‌ (బయోగ్రఫీ) పుస్తకాన్ని టంకశాల అశోక్‌.. వల్లభాయ్‌పటేల్‌ పేరుతో తెలుగులోకి అనువదించారు. దీన్ని 2016లో తెలుగులో ఉత్తమ అనువాద పుస్తకంగా అకాడమీ ప్రకటించింది.

సంస్కృత అనువాదంలో రాణి సదాశివమూర్తికి పురస్కారం: రాష్ట్రీయ సంస్కృత విద్యాపీuŠ‡ ప్రొఫెసర్‌ రాణి సదాశివమూర్తికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తెలుగులో రాళ్లబండి కవితాప్రసాద్‌ రచించిన ‘ఒంటరి పూలబుట్ట (కవితలు)’ ను సదాశివమూర్తి ‘వివక్త పుష్పకరంద’ పేరుతో సంస్కృతంలోకి అనువదించారు. దీన్ని 2016లో సంస్కృతంలో ఉత్తమ అనువాద పుస్తకంగా అకాడమీ ప్రకటించింది.

రాష్ట్రీయం
రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌
ఆఫ్‌ హైదరాబాద్‌ ప్రారంభం

హైదరాబాద్‌లోని పరిశోధనశాలలు, అత్యున్నత విద్యా సంస్థలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఒక దగ్గరకు చేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (రిచ్‌)ను ఫిబ్రవరి 24న ఏర్పాటు చేసింది. శాస్త్ర పరిశోధనలకు విలువలు జోడించడం, వాటిని ఉత్పత్తులు, సేవలుగా మార్చడంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడంతోపాటు వ్యాపార స్థాయికి అభివృద్ధి చేయడమే రిచ్‌ ప్రధాన లక్ష్యాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు.

మేధోసంపత్తి, వాణిజ్య చట్టాలపై అంతర్జాతీయ సదస్సు
‘మేధోసంపత్తి, వాణిజ్య న్యాయాలకు అనుగుణంగా చట్టాలు’ అనే అంశంపై విజయవాడలో ఫిబ్రవరి 24, 25 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సును బెజవాడ బార్‌ అసోసియేషన్, ఏపీ ఆర్థికాభివృద్ధి బోర్డు, జపాన్‌కు చెందిన జపాన్‌ విదేశీ వాణిజ్య సంస్థ (జెట్రో) నిర్వహించాయి. సైబర్‌క్రైమ్‌ నివారణకు ఐటీ చట్టాలను మరింత పటిష్టం చేయాల్సి ఉందని సదస్సులో పాల్గొన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు.

క్రీడలు
భారత మహిళల టీమ్‌కు ప్రపంచకప్‌
అర్హత టోర్నీ టైటిల్‌

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫైయింగ్‌ టోర్నీ ఫైనల్లో భారత్‌ విజేతగా నిలిచింది. కొలంబోలో ఫిబ్రవరి 21న జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించింది. మొత్తం పది జట్లు పాల్గొన్నSఈ టోర్నీలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్‌లు జూన్‌లో ఇంగ్లండ్‌లో జరగనున్న ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి.

హెచ్‌ఐఎల్‌ టైటిల్‌ గెలుచుకున్న
కళింగ లాన్సర్స్‌
కళింగ లాన్సర్స్‌ జట్టు హాకీ ఇండియా లీగ్‌–2017 టైటిల్‌ గెలుచుకుంది. ఛండీగఢ్‌లో ఫిబ్రవరి 26న జరిగిన ఫైనల్లో దబాంగ్‌ ముంబైపై విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్‌ విజార్డ్స్‌ జట్టు మూడో స్థానంలో నిలిచింది.

చెస్‌ ప్రపంచకప్‌లో హారికకు కాంస్యం
ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక ప్రపంచ మహిళల నాకౌట్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. ఇరాన్‌లోని టెహ్రాన్‌లో ఫిబ్రవరి 25న జరిగిన సెమీఫైనల్లో తాన్‌ జోంగి (చైనా) చేతిలో హారిక ఓడిపోయింది. దీంతో వరుసగా మూడోసారి కాంస్యంతో సరిపెట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement