
నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్..
ఈ-విధంగా కెరీర్ సేవ!
భారీ స్థాయిలో డిజిటల్ ఇండియా కార్యక్రమానికి రూపకల్పన చేసిన కేంద్ర ప్రభుత్వం.. యువత కోసం 2015, జులై 20న నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్‌సీఎస్) పోర్టల్‌ను ప్రారంభించింది. దేశ వ్యాప్త ప్రభుత్వ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్‌ల ఆధునికీకరణలో భాగంగా ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. ఇది కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. ఉద్యోగార్థులను, ఉద్యోగాలు ఇచ్చే వారిని ఈ వెబ్ పోర్టల్ అనుసంధానిస్తోంది. ఎన్‌సీసీ పోర్టల్ ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతోంది.
అవకాశాలకు ఒకే వేదిక
ప్రతిభావంతులను అవకాశాలకు దగ్గర చేసేందుకు సరైన మార్గంగా ఎన్‌సీఎస్ పోర్టల్ నిలుస్తోంది. ఈ వెబ్‌సైట్ వివిధ వర్గాలను ఒకే వేదికపైకి తెస్తోంది. అవి..
ఉద్యోగం ఆశించే వారు
ఉద్యోగమిచ్చే వారు కెరీర్ సెంటర్
ప్రైవేటు ప్లేస్‌మెంట్ సంస్థలు
నైపుణ్యాలు/శిక్షణ అందించే వారు
కౌన్సెలర్లు
స్థానికంగా సేవలు అందించేవారు (ప్లంబర్స్, కార్పెంటర్స్..)
డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ అడ్మినిస్ట్రేషన్
పోర్టల్-సేవలు
వివిధ కోర్సులు పూర్తిచేసి, ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న వారు నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తమ విద్యార్హతలు, ఇతర నైపుణ్యాల ఆధారంగా మార్కెట్లో ఉన్న అవకాశాలను తెలుసుకోవచ్చు. తమ అవసరాల మేరకు ఉద్యోగులను నియమించుకోవాలనుకునే సంస్థలు ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పోర్టల్ ద్వారా సరైన నైపుణ్యాలున్న వారిని ఎంపిక చేసుకోవచ్చు.ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎన్నో కోర్సులు, మరెన్నో కెరీర్ ఆప్షన్లు. వీటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలి? ఆయా కోర్సుల ద్వారా లభించే ఉద్యోగావకాశాలు ఏమిటి? వంటి ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ఇలా కెరీర్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు కెరీర్ కౌన్సెలింగ్ నిపుణుల అపాయింట్‌మెంట్‌ను వెబ్‌పోర్టల్ ద్వారా పొందొచ్చు.
వెబ్‌పోర్టల్.. దాదాపు మూడు వేలకు పైగా కెరీర్ ఆప్షన్లకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఐటీ నుంచి టెక్స్‌టైల్స్ వరకు కన్‌స్ట్రక్షన్ నుంచి ఆటోమొబైల్స్ వరకు 53 కీలక రంగాలకు సంబంధించిన ఉద్యోగాలను సెర్చ్ చేయొచ్చు.ఎప్పటికప్పుడు వివిధ ప్రాంతాల్లో జరిగే కెరీర్ ఎగ్జిబిషన్లు, ఉద్యోగమేళాలకు సంబంధించిన సమాచారం వెబ్‌పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు.ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు వంటి ప్రత్యేక నైపుణ్యాలున్న వారి సేవలను స్థానికంగా పొందవచ్చు. లేదా ఇలాంటి ప్రత్యేక నైపుణ్యాలున్నవారు వెబ్‌పోర్టల్ ద్వారా సేవలు అందించి, వ్యాపారాన్ని, ఉపాధిని విస్తరించుకోవచ్చు.ఎక్కడ ఉన్నాసరే ఈ వెబ్‌పోర్టల్ ద్వారా తేలిగ్గా సేవలు పొందవచ్చు. టోల్‌ఫ్రీ నంబర్ లేదా దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్ (కెరీర్ సెంటర్) ద్వారా అవసరమైన సమాచారం పొందవచ్చు.
రిజిస్ట్రేషన్ విధానం
ఎలాంటి సేవ పొందాలన్నా తొలుత వెబ్‌పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవటం తప్పనిసరి. ఉద్యోగ అవకాశాల కోసం అన్వేషించే వారు ఇప్పటికే ఏదైనా ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్ లేదా నైపుణ్య శిక్షణ కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ వివరాలను నమోదు చేయాలి. లేదంటే ౌ్ఛ ఆప్షన్‌ను సెలక్ట్ చేయాలి. పేరు, పుట్టినతేదీ, ఈ-మెయిల్, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ తదితర వివరాలను పొందుపరచాలి. యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లను జనరేట్ చేసుకోవాలి. వీటి ఆధారంగా ఎప్పుడైనా నేరుగా పోర్టల్ ద్వారా అవసరమైన సేవలను పొందొచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మొబైల్‌కు ఎన్‌సీఎస్ ఐడీ నంబర్ మెసేజ్ రూపంలో వస్తుంది.
ఎప్పటికప్పుడు నివేదికలు
వెబ్‌సైట్ ద్వారా అందుతున్న సేవల ఆధారంగా ఎప్పటికప్పుడు నివేదికలు రూపొందించి, అందుబాటులో ఉంచుతారు. నిర్ణీత కాలంలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు; రాష్ట్రాల వారీగా, రంగాల వారీగా జాబ్ పోస్టింగ్‌లు; స్పెషలైజేషన్ల వారీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న కౌన్సెలర్లు తదితర వివరాలతో నివేదికలు రూపొందిస్తారు. ఇదే విధంగా వయసు, విద్యార్హత తదితరాల వారీగా కూడా నివేదికలను అందుబాటులో ఉంచుతారు. వీటి ఆధారంగా ఇటు ఉద్యోగార్థులు, అటు సంస్థల యాజమాన్యాలు జాబ్ మార్కెట్ ధోరణిపై అవగాహన పెంపొందించుకోవచ్చు. ఉదాహరణకు 2014, డిసెంబరు వరకు తెలంగాణ రాష్ర్టం నుంచి నమోదైన ఉద్యోగార్థుల రిజిస్ట్రేషన్లు 4,18,941. 2015, జనవరి నుంచి జులై 24 వరకు రిజిస్ట్రేషన్లు 13,761.