బలహీనతలగురించి చెప్పాలా
ఉద్యోగ నియామక ఇంటర్వ్యూల్లో రిక్రూటర్లు.. అభ్యర్థులను తరచుగాఅడుగుతున్న ప్రశ్నల్లో ఒకటి.. ‘మీ బలహీనతల గురించి చెప్పండి’.వినడానికి ఇది సాధారణ ప్రశ్నగానే అనిపించినా సమాధానం చెప్పడం చాలా కష్టం. నిజం చెప్పాలా? అబద్ధం చెప్పాలా?ఏ సమాధానం చెబితే ఎలా తీసుకుంటారో? ఉద్యోగం ఇస్తారో.. ఇవ్వరో.. ఇలా ఉద్యోగార్థుల్లో ఎన్నో సందేహాలు. వీటి నివృత్తికి నిపుణులు అందిస్తున్న సూచనలు, సలహాలు..
ఉన్నది ఉన్నట్లు చెప్పాలా?
బలహీనతలు లేని మనుషులంటూ ప్రపంచంలో ఎవరూ ఉండరు. అందరూ అన్ని విషయాల్లో పరిపూర్ణులు కారు. ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక బలహీనత ఉంటుంది. వీటిల్లో రెండు రకాలున్నాయి. కొన్ని మనకు తెలియకుండానే హాని కలిగిస్తాయి. మరికొన్నిటితో ఎలాంటి సమస్యలు ఉండవు. మరి, ఇంటర్వ్యూల్లో రిక్రూటర్స్ అడిగేటప్పుడు బలహీనతల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పేయొచ్చా? ఇలా చెబితే ఉద్యోగం ఇచ్చేస్తారా? అంటే కాదంటున్నారు నిపుణులు. ఇంటర్వ్యూలో ఇలాంటి వాటిపై ప్రశ్నలు ఎదురైతే కంగారుపడకుండా చాకచక్యంగా సమాధానం ఇవ్వాలని సూచిస్తున్నారు.
అతిశయోక్తులు వద్దు
ఇంటర్వ్యూలో బలహీనతల గురించి చెప్పమంటే.. అభ్యర్థులకు వెంటనే సమాధానం తట్టదు. ఏ సమాధానం చె బితే ఏమవుతుందోనని ముందూవెనుక ఆలోచిస్తారు. అయితే ‘నాలో ఏ బలహీనతలు, లోపాలు లేవు’ అని మరీ అతిశయోక్తులు చెప్పొద్దని నిపుణులు అంటున్నారు. ఇలా చెప్తే మీరు అహంకారులని రిక్రూటర్స్ భావించొచ్చు. కొందరు అభ్యర్థులు ‘మా తప్పేమీ లేదని ఇతరుల వల్లే అలా చేయాల్సి వచ్చిందని’ తప్పించుకుంటారు. ఇది కూడా సరికాదని నిపుణులు సూచిస్తున్నారు. తనలో కూడా చిన్న చిన్న లోపాలున్నాయని.. వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటున్నాని చెప్పాలి.
అందరూ పరిపూర్ణులు కాదు
నిజానికి బలాలు, బలహీనతలు అనేవి సందర్భానుసారంగా బయటపడుతుంటాయి. ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చేందుకు మీలోని నైపుణ్యాలను ఉపయోగించండి. అందరూ పరిపూర్ణులు కారనే విషయం ఇంటర్వ్యూ బోర్డుకు కూడా తెలుసు. మీ కెరీర్‌కు ఇబ్బంది కాని బలహీనతల గురించి వివరించొచ్చు. ఉదాహరణకు.. నాకు లెక్కలంటే భయం అని చెబితే దానివల్ల పెద్దగా ప్రమాదం ఉండదు. దాన్ని సులభంగా సరిచేసుకొనే అవకాశం ఉంది కాబట్టి రిక్రూటర్ ఆ సమాధానం పట్ల సంతృప్తి చెందుతారు. ఒకవేళ మీలోని అసలైన లోపాలను చెబితే.. అదే సమయంలో వాటిని అధిగమించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వివరించాలి. దాన్ని రిక్రూటర్ అర్ధం చేసుకునేలా ఒప్పించి మెప్పించాలి.
పాజిటివ్స్.. నెగెటివ్స్..
సంబంధిత ఉద్యోగానికి మీరు సరిపోతారనుకుంటే కంపెనీ మీకు ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఇందులో అభ్యర్థి వ్యక్తిత్వాన్ని, సమగ్ర మూర్తిమత్వాన్ని పరిశీలిస్తారు. ఈ క్రమంలో అభ్యర్థిలో ఉన్న పాజిటివ్స్, నెగెటివ్స్ అన్నింటినీ సంస్థ తెలుసుకోవాలనుకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వాలి. కొందరు తమ బలాలను లోపాలుగా మార్చి చెబుతుంటారు. ఉదాహరణకు.. నేను పని రాక్షసుడిని(వర్క్‌హాలిక్), పనిపూర్తయ్యేదాకా విశ్రమించను అంటుంటారు. అది మంచి లక్షణమే, బలహీనత కాదు కదా! గతంలో కొన్ని తప్పులు చేశాను, వాటి నుంచి పాఠాల నేర్చుకొని, అవి పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతున్నాను అని చెబితే మీలో వ్యక్తిత్వం ఉందని రిక్రూటర్ భావించేందుకు వీలుంటుంది. ఇంటర్వ్యూలో అభ్యర్థి మాట్లాడే మాటల్లో నిజాయతీ ధ్వనించాలి. అందుకు ముందుగానే సిద్ధం కావాలి. ఇలా చేస్తే ఇంటర్వ్యూలో విజయం సాధించి కోరుకున్న కొలువును దక్కించుకోవచ్చు.