Recruitment job
-
భర్తీ ఎన్ని? మిగిలినవి ఎన్ని?
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ గణాంకాలపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా సిద్ధం కావడంతో పాటు ఇప్పటికే మెజార్టీ కేటగిరీల్లో అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను సైతం పంపిణీ చేశారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం పలువురు అభ్యర్థులు ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకోలేదు. ఇంతలోనే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడటం.. దానికితోడు జూన్ మొదటి వారం వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పెండింగ్‌లో ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేయడానికి అప్పటివరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఎంతమంది అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకున్నారనే గణాంకాలపై స్పష్టత వచ్చే అవకాశం లేదని అధికారులు చెపుతున్నారు. 9,231 కొలువులకు నోటిఫికేషన్లు.. రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ గురుకుల సొసైటీలు న్నాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్)లతో పాటు విద్యాశాఖ పరిధిలో కొనసాగుతున్న తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఆర్ఈఐఎస్)ల పరిధిలో వివిధ కేటగిరీల్లో 9,231 ఉద్యోగ ఖాళీలకు గురుకుల బోర్డు గతేడాది ఏప్రిల్ 5వ తేదీన ఏక కాలంలో నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో ఆర్ట్, క్రాప్ట్, మ్యూజిక్ కేటగిరీల్లోని 350 ఉద్యోగాల భర్తీ పెండింగ్‌లో ఉండగా.. మిగతా 8,881 ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. అపాయింట్మెంట్ ఆర్డర్లు సైతం సిద్ధం చేసిన అధికారులు.. కొన్ని జిల్లాల్లో ఇంకా పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలుండటంతో అభ్యర్థులు ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాశారు. దీంతో దాదాపు రెండు వేల మంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించారు. కొందరైతే మూడు, నాలుగు ఉద్యోగాలు కూడా సాధించడం గమనార్హం. అయితే ఎన్ని ఉద్యోగాలు వచ్చినా అందులో ఉత్తమమైన కేటగిరీని ఎంపిక చేసుకోవడంతో పాటు పోస్టింగ్ వచ్చిన ప్రాంతం ఆధారంగా విధుల్లో చేరేందుకు అభ్యర్థి సిద్ధమవుతారు. ప్రస్తుతం చాలావరకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిననప్పటికీ.. ఇంకా ఒక్క కేటగిరీలోనూ పోస్టింగులు ఇవ్వలేదు. ఎన్నికల కోడ్ ముగిశాకే.. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం పూర్తయిన తర్వాత అందరికీ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇవ్వాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈప్రక్రియ మొదలు కానుంది. దీంతో కౌన్సెలింగ్ ముగిసి విధుల్లో చేరే గడువు పూర్తయిన తర్వాతే ఎంతమంది అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరతారన్న అంశంపై స్పష్టత వస్తుంది. అప్పటివరకు నోటిఫికేషన్లో పేర్కొన్న ఉద్యోగాల్లో భర్తీ అయిన కొలువులు ఎన్ని, మిగిలిన పోస్టులు ఎన్ని.. అనే దానిపై స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు మరో రెండు నెలల సమయం పట్టవచ్చని గురుకుల అధికారులు చెపుతున్నారు. -
ఐటీలో కొలువుల ఖుషీ!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారిపరమైన పరిణామాలతో సాఫ్ట్వేర్ సర్వీసులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో నియామకాల జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో (జూన్ ముగిసే నాటికి) టాప్ 10 ఐటీ కంపెనీలు 1.21 లక్షల మంది ఉద్యోగులను తీసుకోవడం ఇందుకు నిదర్శనం. గడిచిన అయిదేళ్ల కాలంలో ప్రథమార్ధంలో నియామకాలకు సంబంధించి ఇది గరిష్టం కావడం గమనార్హం. దీనికన్నా ముందు 2019 తొలి ఆరు నెలల్లో టాప్ 10 కంపెనీలు అత్యధికంగా 45,649 మంది సిబ్బందిని నియమించుకున్నాయి. ఇక ఈ ఏడాది విషయానికొస్తే, డిజిటల్ విభాగంపై అంతర్జాతీయంగా కంపెనీలు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నందున హైరింగ్ మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 2021 పూర్తి ఏడాదిలో నియామకాలు 2 లక్షల స్థాయికి చేరవచ్చని అంచనా వేస్తున్నాయి. కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో అంతా డిజిటల్ బాట పట్టడం మరింత వేగవంతం అవుతుండటంతో ఐటీ కంపెనీలు కూడా ఆదాయాలపై అత్యంత ఆశావహంగా ఉన్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ కంపెనీలు ఈ ఏడాది రెండంకెల స్థాయి వృద్ధిపై ధీమాగా ఉన్నాయి. కొత్త టెక్నాలజీల ఊతం.. నిపుణులకు డిమాండ్ ఆల్–టైమ్ గరిష్ట స్థాయిలో ఉంటున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో కంపెనీల్లో అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇందుకు ప్రధానంగా రెండు అంశాలు కారణమని పేర్కొన్నాయి. మొదటిది కొంగొత్త టెక్నాలజీలు కాగా రెండోది డిజిటల్ అంశమని తెలిపాయి. దాదాపు దశాబ్దం క్రితం సుమారు ఒకే రకం టెక్నాలజీతో పరిశ్రమ నడిచేదని, ప్రస్తుతం రకరకాల టెక్నాలజీలు ఆవిష్కృతమవుతున్నాయని వివరించాయి. ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, క్లౌడ్, 5జీ.. ఇలా అనేకానేక సాంకేతికతలు పుట్టుకొస్తుండటంతో నిపుణులకు డిమాండ్ పెరుగుతోందని ఓ ఐటీ కంపెనీ అధికారి తెలిపారు. ఇక, రెండో అంశమైన డిజిటల్ విషయానికొస్తే ప్రస్తుతం చాలా కంపెనీల ఆదాయాల్లో ఈ విభాగం వాటా 30–50 శాతం దాకా ఉంటోంది. ఈ కారణంగానూ పెద్ద సంఖ్యలో డిజిటల్ నిపుణుల నియామకాలు జరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అయా టెక్నాలజీల్లో సుశిక్షితులైన వారి సంఖ్య పరిమితంగానే ఉండటంతో డిమాండ్‌తో పాటు వేతన ప్యాకేజీ కూడా పెరుగుతోందని వివరించాయి. ఈ నిపుణులకు డిమాండ్.. డేటా సైంటిస్టులు, ఫుల్ స్టాక్ ఇంజినీర్లు, సైబర్‌సెక్యూరిటీ ప్రొఫెషనల్స్, క్లౌడ్ ఆర్కిటెక్ట్‌లు, ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు మొదలైన వారికి డిమాండ్ అధికంగా ఉంటోంది. డేటా సైంటిస్టు ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలు లక్షల్లో ఉన్నాయి. క్లౌడ్, డేటా అనలిటిక్స్, బిగ్ డేటా, నెట్వర్క్ సెక్యూరిటీ వంటి వివిధ విభాగాల్లో యాక్సెంచర్ సంస్థలో 34,000 పైచిలుకు ఖాళీలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క్వాంటమ్ మెషిన్ లెరి్నంగ్ వంటి టెక్నాలజీల్లో నిపుణులకు ప్రారంభ వేతనాలు నెలకు రూ. 1.20 లక్షల దాకా ఉంటున్నాయని కన్సల్టెన్సీ సంస్థ టీమ్‌లీజ్ ఒక నివేదికలో తెలిపింది. అట్రిషన్ రేటు పెరుగుతుండటంతో రాబోయే రోజుల్లో డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసాన్ని భర్తీ చేసుకోవడానికి కంపెనీలు జీతభత్యాలను కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీంతో కంపెనీలకు ఆ మేరకు వ్యయాలు పెరుగుతాయని వివరించింది. అట్రిషన్ సమస్య పరిష్కారానికి, డిమాండ్ అందుకోవడానికి కంపెనీలు జోరుగా ఫ్రెషర్ల నియామకాలు చేపట్టనున్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో టాప్ నాలుగు ఐటీ కంపెనీలు 1.1 లక్షల మంది ఫ్రెషర్లను తీసుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఉద్యోగాల కల్పనలో మేటి.. దాదాపు 45 లక్షల మంది పైగా ఉద్యోగులతో సాఫ్ట్వేర్ రంగం దేశీయంగా అత్యధికంగా ఉద్యోగాలు కలి్పస్తున్న రంగాల్లో ఒకటిగా ఉంటోంది. వీటిలో దేశ విదేశ ఐటీ, బీపీఎం కంపెనీలు కూడా ఉన్నాయి. భారత్ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)లో 1992–93లో ఐటీ రంగం వాటా 0.4%గా ఉండగా ప్రస్తుతం 8%కి చేరింది. 1991లో 150 మిలియన్ డాలర్లుగా ఉన్న పరిమాణం ఇప్పుడు 194 బిలియన్ డాలర్లకు ఎగిసింది. ఉపాధి కల్పన కూడా భారీగా పెరిగింది. టాప్ 10 ఐటీ కంపెనీలలో అయిదేళ్ల క్రితం 10 లక్షలుగా ఉన్న సిబ్బంది సంఖ్య 40% పెరిగి 14 లక్షలకు చేరింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సంస్థల్లో రెండు లక్షల మంది పైగా సిబ్బంది ఉండగా.. హెచ్‌సీఎల్ టెక్‌లో 1.76 లక్షలు, టెక్ మహీంద్రాలో 1.26 లక్షల ఉద్యోగులు ఉన్నారు. 5 లక్షల మంది ఉద్యోగులతో టీసీఎస్ దేశీయంగా ప్రైవేట్ రంగంలో అత్యధికంగా కొలువులు కల్పిస్తున్న కంపెనీగా ఎదిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ సంస్థలు రెండంకెల స్థాయి ఆదాయాలు ఆశిస్తున్న నేపథ్యంలో హైరింగ్ మరింత పెరుగుతుందే తప్ప తగ్గదని అంచనాలు ఉన్నాయి. -
బలహీనతలగురించి చెప్పాలా
ఉద్యోగ నియామక ఇంటర్వ్యూల్లో రిక్రూటర్లు.. అభ్యర్థులను తరచుగాఅడుగుతున్న ప్రశ్నల్లో ఒకటి.. ‘మీ బలహీనతల గురించి చెప్పండి’.వినడానికి ఇది సాధారణ ప్రశ్నగానే అనిపించినా సమాధానం చెప్పడం చాలా కష్టం. నిజం చెప్పాలా? అబద్ధం చెప్పాలా?ఏ సమాధానం చెబితే ఎలా తీసుకుంటారో? ఉద్యోగం ఇస్తారో.. ఇవ్వరో.. ఇలా ఉద్యోగార్థుల్లో ఎన్నో సందేహాలు. వీటి నివృత్తికి నిపుణులు అందిస్తున్న సూచనలు, సలహాలు.. ఉన్నది ఉన్నట్లు చెప్పాలా? బలహీనతలు లేని మనుషులంటూ ప్రపంచంలో ఎవరూ ఉండరు. అందరూ అన్ని విషయాల్లో పరిపూర్ణులు కారు. ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక బలహీనత ఉంటుంది. వీటిల్లో రెండు రకాలున్నాయి. కొన్ని మనకు తెలియకుండానే హాని కలిగిస్తాయి. మరికొన్నిటితో ఎలాంటి సమస్యలు ఉండవు. మరి, ఇంటర్వ్యూల్లో రిక్రూటర్స్ అడిగేటప్పుడు బలహీనతల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పేయొచ్చా? ఇలా చెబితే ఉద్యోగం ఇచ్చేస్తారా? అంటే కాదంటున్నారు నిపుణులు. ఇంటర్వ్యూలో ఇలాంటి వాటిపై ప్రశ్నలు ఎదురైతే కంగారుపడకుండా చాకచక్యంగా సమాధానం ఇవ్వాలని సూచిస్తున్నారు. అతిశయోక్తులు వద్దు ఇంటర్వ్యూలో బలహీనతల గురించి చెప్పమంటే.. అభ్యర్థులకు వెంటనే సమాధానం తట్టదు. ఏ సమాధానం చె బితే ఏమవుతుందోనని ముందూవెనుక ఆలోచిస్తారు. అయితే ‘నాలో ఏ బలహీనతలు, లోపాలు లేవు’ అని మరీ అతిశయోక్తులు చెప్పొద్దని నిపుణులు అంటున్నారు. ఇలా చెప్తే మీరు అహంకారులని రిక్రూటర్స్ భావించొచ్చు. కొందరు అభ్యర్థులు ‘మా తప్పేమీ లేదని ఇతరుల వల్లే అలా చేయాల్సి వచ్చిందని’ తప్పించుకుంటారు. ఇది కూడా సరికాదని నిపుణులు సూచిస్తున్నారు. తనలో కూడా చిన్న చిన్న లోపాలున్నాయని.. వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటున్నాని చెప్పాలి. అందరూ పరిపూర్ణులు కాదు నిజానికి బలాలు, బలహీనతలు అనేవి సందర్భానుసారంగా బయటపడుతుంటాయి. ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చేందుకు మీలోని నైపుణ్యాలను ఉపయోగించండి. అందరూ పరిపూర్ణులు కారనే విషయం ఇంటర్వ్యూ బోర్డుకు కూడా తెలుసు. మీ కెరీర్‌కు ఇబ్బంది కాని బలహీనతల గురించి వివరించొచ్చు. ఉదాహరణకు.. నాకు లెక్కలంటే భయం అని చెబితే దానివల్ల పెద్దగా ప్రమాదం ఉండదు. దాన్ని సులభంగా సరిచేసుకొనే అవకాశం ఉంది కాబట్టి రిక్రూటర్ ఆ సమాధానం పట్ల సంతృప్తి చెందుతారు. ఒకవేళ మీలోని అసలైన లోపాలను చెబితే.. అదే సమయంలో వాటిని అధిగమించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వివరించాలి. దాన్ని రిక్రూటర్ అర్ధం చేసుకునేలా ఒప్పించి మెప్పించాలి. పాజిటివ్స్.. నెగెటివ్స్.. సంబంధిత ఉద్యోగానికి మీరు సరిపోతారనుకుంటే కంపెనీ మీకు ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఇందులో అభ్యర్థి వ్యక్తిత్వాన్ని, సమగ్ర మూర్తిమత్వాన్ని పరిశీలిస్తారు. ఈ క్రమంలో అభ్యర్థిలో ఉన్న పాజిటివ్స్, నెగెటివ్స్ అన్నింటినీ సంస్థ తెలుసుకోవాలనుకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వాలి. కొందరు తమ బలాలను లోపాలుగా మార్చి చెబుతుంటారు. ఉదాహరణకు.. నేను పని రాక్షసుడిని(వర్క్‌హాలిక్), పనిపూర్తయ్యేదాకా విశ్రమించను అంటుంటారు. అది మంచి లక్షణమే, బలహీనత కాదు కదా! గతంలో కొన్ని తప్పులు చేశాను, వాటి నుంచి పాఠాల నేర్చుకొని, అవి పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతున్నాను అని చెబితే మీలో వ్యక్తిత్వం ఉందని రిక్రూటర్ భావించేందుకు వీలుంటుంది. ఇంటర్వ్యూలో అభ్యర్థి మాట్లాడే మాటల్లో నిజాయతీ ధ్వనించాలి. అందుకు ముందుగానే సిద్ధం కావాలి. ఇలా చేస్తే ఇంటర్వ్యూలో విజయం సాధించి కోరుకున్న కొలువును దక్కించుకోవచ్చు.