ఐటీలో కొలువుల ఖుషీ! | Top 10 IT Firms Hire 1. 2 Lakh In 6 Months | Sakshi
Sakshi News home page

ఐటీలో కొలువుల ఖుషీ!

Published Tue, Aug 10 2021 1:28 AM | Last Updated on Tue, Aug 10 2021 1:28 AM

Top 10 IT Firms Hire 1. 2 Lakh In 6 Months - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారిపరమైన పరిణామాలతో సాఫ్ట్‌వేర్‌ సర్వీసులకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో నియామకాల జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో (జూన్‌ ముగిసే నాటికి) టాప్‌ 10 ఐటీ కంపెనీలు 1.21 లక్షల మంది ఉద్యోగులను తీసుకోవడం ఇందుకు నిదర్శనం. గడిచిన అయిదేళ్ల కాలంలో ప్రథమార్ధంలో నియామకాలకు సంబంధించి ఇది గరిష్టం కావడం గమనార్హం. దీనికన్నా ముందు 2019 తొలి ఆరు నెలల్లో టాప్‌ 10 కంపెనీలు అత్యధికంగా 45,649 మంది సిబ్బందిని నియమించుకున్నాయి.

ఇక ఈ ఏడాది విషయానికొస్తే, డిజిటల్‌ విభాగంపై అంతర్జాతీయంగా కంపెనీలు భారీగా ఇన్వెస్ట్‌ చేస్తున్నందున హైరింగ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 2021 పూర్తి ఏడాదిలో నియామకాలు 2 లక్షల స్థాయికి చేరవచ్చని అంచనా వేస్తున్నాయి. కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో అంతా డిజిటల్‌ బాట పట్టడం మరింత వేగవంతం అవుతుండటంతో ఐటీ కంపెనీలు కూడా ఆదాయాలపై అత్యంత ఆశావహంగా ఉన్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ కంపెనీలు ఈ ఏడాది రెండంకెల స్థాయి వృద్ధిపై ధీమాగా ఉన్నాయి.

కొత్త టెక్నాలజీల ఊతం..
నిపుణులకు డిమాండ్‌ ఆల్‌–టైమ్‌ గరిష్ట స్థాయిలో ఉంటున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో కంపెనీల్లో అట్రిషన్‌ రేటు (ఉద్యోగుల వలసలు) కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇందుకు ప్రధానంగా రెండు అంశాలు కారణమని పేర్కొన్నాయి. మొదటిది కొంగొత్త టెక్నాలజీలు కాగా రెండోది డిజిటల్‌ అంశమని తెలిపాయి. దాదాపు దశాబ్దం క్రితం సుమారు ఒకే రకం టెక్నాలజీతో పరిశ్రమ నడిచేదని, ప్రస్తుతం రకరకాల టెక్నాలజీలు ఆవిష్కృతమవుతున్నాయని వివరించాయి.

ఆరి్టఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, రోబోటిక్స్, క్లౌడ్, 5జీ.. ఇలా అనేకానేక సాంకేతికతలు పుట్టుకొస్తుండటంతో నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోందని ఓ ఐటీ కంపెనీ అధికారి తెలిపారు. ఇక, రెండో అంశమైన డిజిటల్‌ విషయానికొస్తే ప్రస్తుతం చాలా కంపెనీల ఆదాయాల్లో ఈ విభాగం వాటా 30–50 శాతం దాకా ఉంటోంది. ఈ కారణంగానూ పెద్ద సంఖ్యలో డిజిటల్‌ నిపుణుల నియామకాలు జరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అయా టెక్నాలజీల్లో సుశిక్షితులైన వారి సంఖ్య పరిమితంగానే ఉండటంతో డిమాండ్‌తో పాటు వేతన ప్యాకేజీ కూడా పెరుగుతోందని వివరించాయి.  

ఈ నిపుణులకు డిమాండ్‌..
డేటా సైంటిస్టులు, ఫుల్‌ స్టాక్‌ ఇంజినీర్లు, సైబర్‌సెక్యూరిటీ ప్రొఫెషనల్స్, క్లౌడ్‌ ఆర్కిటెక్ట్‌లు, ఆరి్టఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నిపుణులు మొదలైన వారికి డిమాండ్‌ అధికంగా ఉంటోంది. డేటా సైంటిస్టు ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలు లక్షల్లో ఉన్నాయి. క్లౌడ్, డేటా అనలిటిక్స్, బిగ్‌ డేటా, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ వంటి వివిధ విభాగాల్లో యాక్సెంచర్‌ సంస్థలో 34,000 పైచిలుకు ఖాళీలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క్వాంటమ్‌ మెషిన్‌ లెరి్నంగ్‌ వంటి టెక్నాలజీల్లో నిపుణులకు ప్రారంభ వేతనాలు నెలకు రూ. 1.20 లక్షల దాకా ఉంటున్నాయని కన్సల్టెన్సీ సంస్థ టీమ్‌లీజ్‌ ఒక నివేదికలో తెలిపింది.

అట్రిషన్‌ రేటు పెరుగుతుండటంతో రాబోయే రోజుల్లో డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసాన్ని భర్తీ చేసుకోవడానికి కంపెనీలు జీతభత్యాలను కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీంతో కంపెనీలకు ఆ మేరకు వ్యయాలు పెరుగుతాయని వివరించింది. అట్రిషన్‌ సమస్య పరిష్కారానికి, డిమాండ్‌ అందుకోవడానికి కంపెనీలు జోరుగా ఫ్రెషర్ల నియామకాలు చేపట్టనున్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో టాప్‌ నాలుగు ఐటీ కంపెనీలు 1.1 లక్షల మంది ఫ్రెషర్లను తీసుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నాయి.

ఉద్యోగాల కల్పనలో మేటి..
దాదాపు 45 లక్షల మంది పైగా ఉద్యోగులతో సాఫ్ట్‌వేర్‌ రంగం దేశీయంగా అత్యధికంగా ఉద్యోగాలు కలి్పస్తున్న రంగాల్లో ఒకటిగా ఉంటోంది. వీటిలో దేశ విదేశ ఐటీ, బీపీఎం కంపెనీలు కూడా ఉన్నాయి. భారత్‌ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)లో 1992–93లో ఐటీ రంగం వాటా 0.4%గా ఉండగా ప్రస్తుతం 8%కి చేరింది. 1991లో 150 మిలియన్‌ డాలర్లుగా ఉన్న పరిమాణం ఇప్పుడు 194 బిలియన్‌ డాలర్లకు ఎగిసింది. ఉపాధి కల్పన కూడా భారీగా పెరిగింది. 

టాప్‌ 10 ఐటీ కంపెనీలలో అయిదేళ్ల క్రితం 10 లక్షలుగా ఉన్న సిబ్బంది సంఖ్య 40% పెరిగి 14 లక్షలకు చేరింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సంస్థల్లో రెండు లక్షల మంది పైగా సిబ్బంది ఉండగా.. హెచ్‌సీఎల్‌ టెక్‌లో 1.76 లక్షలు, టెక్‌ మహీంద్రాలో 1.26 లక్షల ఉద్యోగులు ఉన్నారు. 5 లక్షల మంది ఉద్యోగులతో టీసీఎస్‌ దేశీయంగా ప్రైవేట్‌ రంగంలో అత్యధికంగా కొలువులు కల్పిస్తున్న కంపెనీగా ఎదిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ సంస్థలు రెండంకెల స్థాయి ఆదాయాలు ఆశిస్తున్న నేపథ్యంలో హైరింగ్‌ మరింత పెరుగుతుందే తప్ప తగ్గదని అంచనాలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement