సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘ఓడలు బండ్లవుతాయి. బండ్లు ఓడలవుతాయి’ జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఈ సామెత ఇప్పుడు అచ్చు సరిపోతోంది. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపికలో చక్రం తిప్పిన ఆయన ఇప్పుడు తనకు టికెట్ ఇప్పించుకోలేక చతికిలపడ్డారు. పొమ్మనలేక పొగబెట్టినట్లు చంద్రబాబు వ్యూహాత్మకంగా చంద్రమోహన్‌రెడ్డికి చెక్ పెట్టారు.
జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో తొలినాళ్లలో తాళ్లపాక రమేష్‌రెడ్డి చక్రం తిప్పారు. ఇప్పుడు తాము యోధులమని చెప్పుకునే వారికి కూడా ఆయనే టికెట్లు ఇప్పించారు. ఆ తర్వాత ఆనం కుటుంబం కొంత కాలం పాటు ఈ హవా నడిపింది. ఈ దశ తర్వాత జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి శకం ప్రారంభమైంది. రెండు దశాబ్దాల పాటు ఆయన జిల్లా తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పారు.
తనకు వ్యతిరేకమనుకున్న వారిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి వారిని పార్టీ నుంచి బయటకు పోయేలా చేశారు. ఎన్నికల్లో కూడా ఆయన నో అన్న వారికి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ హై కమాండ్ వెనకడుగు వేసేలా ఆధిపత్యం చలాయిం చారు. 2009లో బీద మస్తాన్‌రావు కావలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, 2011లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన సోదరుడు బీద రవిచంద్ర టీడీపీ అభ్యర్థిగా పోటీచేయడంతో సోమిరెడ్డికి ప్రత్యామ్నాయ నాయకత్వం తెర మీదకు వచ్చింది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సోమిరెడ్డి రాజ కీయం చేసి టీడీపీ ఓట్లు కాంగ్రెస్‌కు వేయించి తనను ఓడించారని రవి చంద్ర పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేశారని ప్రచారం జరిగింది. గతంలో తనను జెడ్‌పీ చైర్మన్ కాకుండా చేశారని, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వెన్నుపోటు పొడిచారని సోమిరెడ్డి మీద రవిచంద్ర మనసులో ఆగ్రహం దాచుకున్నారు. దీంతో బీద సోదరులు సోమిరెడ్డికి ప్రత్యామ్నాయంగా ఎదగాలనే కసితో జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే రవిచంద్ర జిల్లా అధ్యక్ష పదవి సాధించు కోగలిగారు.
రాజ్యసభ నిరాశ
ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఇబ్బందులు పడటం కంటే రాజ్యసభకు వెళ్లి ఆరేళ్లపాటు హాయిగా ఉండవచ్చని భావించిన సోమిరెడ్డి ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా టికెట్ కోసం ప్రయత్నించారు. చివరి నిమిషంలో చంద్రబాబు హ్యాండివ్వడంతో సోమిరెడ్డి షాక్ తిన్నారు. సోమిరెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోను రాజ్యసభ టికెట్ వచ్చే అవకాశమే లేదని టీడీపీలోని ఆయన వ్యతిరేక వర్గం ముందునుంచే ప్రచారం చేసింది. ఈ రకంగా సోమిరెడ్డికి జిల్లా రాజకీయాల్లో చెక్ పడింది.
కోవూరులో మరో చెక్
కోవూరు తెలుగుదేశం పార్టీ టికెట్‌ను తన మద్దతుదారుడు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డికి ఇప్పించుకోవాలని సోమిరెడ్డి చేసిన ప్రయత్నాలను బీద సోదరులు వ్యూహాత్మకంగా తిప్పికొట్టారు. సోమిరెడ్డి వ్యతిరేకి ఆదాలను పార్టీలోకి తీసుకురావడం ద్వారా తమ వర్గం మరింత గట్టి చేసుకుని సోమిరెడ్డిని జీరో చేసే వ్యూహానికి పదును పెట్టారు. వీరికి వ్యక్తిగతంగా పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి మీద కోపం లేక పోయినప్పటికీ సోమిరెడ్డి ప్రతిపాదించిన వ్యక్తి కావడంతో పట్టుబట్టి ఆయనకు టికెట్ రాకుండా చేయగలిగారు.
నెరవేరని రూరల్ ఆశలు
రాజ్యసభ సీటు దక్కకపోయినా నెల్లూరు రూరల్ టికెట్ అయినా తనకే వస్తుందని సోమిరెడ్డి ధీమాగా వ్యవహరించారు. ప్రజాగర్జన సభ నిర్వహణ సమయంలో ఎంపీలు సుజన చౌదరి, గరికపాటి మోహన్‌రావు సమక్షంలోనే ఈ పంచాయితీ జరిగింది. సోమిరెడ్డికి రూరల్ ఇవ్వడానికి చంద్రబాబు కూడా ఆమోదం తెలిపారని వారు వెల్లడించారు. దీంతో రెండు నెలలుగా సోమిరెడ్డి రూరల్ నియోజకవర్గంపై దృష్టి సారించారు. ఎన్నికల పొత్తులో ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించి చంద్రబాబు వ్యూహాత్మకంగా సోమిరెడ్డికి చెక్ పెట్టారు.
ఈ అవమానం భరించలేని సోమిరెడ్డి అలక పాన్పు ఎక్కి కూర్చున్నా చంద్రబాబు నామ మాత్రపు బుజ్జగింపులు చేయించారే తప్ప సోమిరెడ్డి డిమాండ్ తీర్చే దిశగా ప్రయత్నించలేదు. ఆరునూరైనా ఇక సోమిరెడ్డికి నెల్లూరు రూరల్ టికెట్ దక్కే అవకాశమే లేకుండా పోయింది. దీని వెనుక కూడా బీద సోదరులతో పాటు, తెర చాటుగా ఆదాల హస్తం కూడా ఉందనే అనుమానాలు సోమిరెడ్డి వర్గంలో వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద రెండు దశాబ్దాలు జిల్లా టీడీపీలో చక్రం తిప్పిన సోమిరెడ్డి చివరకు తనకు కూడా తాను టికెట్ ఇప్పించుకోలేని స్థితిలో పడిపోయారు.
పాపం సోమిరెడ్డి
Published Wed, Apr 16 2014 2:23 AM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM
Advertisement
Advertisement