chandra mohan reddy
-
ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా చంద్రమోహనరెడ్డి
అనంతపురం కల్చరల్ : రెడ్డి సంక్షేమ సంఘం ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన పెద్దకోట్ల చంద్రమోహనరెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గంగుల కుంట నరేష్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో వివరించారు. ఈనెల 25న జిల్లాలో జరిగే ఓ సభలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. ఏపీ రెడ్డి సంక్షేమ సంఘానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన తొలిసారే తాడిమర్రి మండలం పెద్దకోట్లకు చెందిన ఐటీ నిపుణులు, పీసీఎంఆర్ ట్రస్టు నిర్వాహకులు చంద్రమోహనరెడ్డి ఎంపిక కావడంపై రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. -
'కేంద్రంతో మా సత్సంబంధాలు కొనసాగుతాయి'
విజయవాడ: కేంద్రంతో తమ సత్సంబంధాలు కొనసాగుతాయని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్సీ చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీల మధ్య చిచ్చు రగిలించాలనే కుట్రకు టీడీపీ బలి కాదని తెలిపారు. టీడీపీ రాష్ట్ర సమావేశం శనివారం విజయవాడలో జరిగింది. అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ.. సమావేశంలో ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై చర్చించామని చెప్పారు. అదే విధంగా ప్రజా ప్రతినిధులు తమ పనితీరును మరింత మెరుగు పరచుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. -
పుష్కరాలకూ కన్సల్టెన్సీ కావాలా?
చంద్రబాబు ప్రభుత్వ తీరుపై కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: మన రాష్ట్రంలో పుష్కరాలను మనం నిర్వహించుకోవడానికి కూడా కన్సల్టెన్సీల అవసరం కావాల్సి వచ్చిందా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు సర్కారుపై ధ్వజమెత్తింది. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి శుక్రవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులు, అధికారుల ప్రభుత్వం నడుస్తోందా? లేదంటే విదేశీ కన్సల్టెన్సీల ప్రభుత్వం నడుస్తోందా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. ప్రభుత్వంలోగానీ, రాష్ట్రంలోగానీ ఏదైనా రంగానికి సంబంధించి నిపుణులు లేకుంటేనే.. ఆయా రంగానికి విదేశీ కన్సల్టెన్సీల అవసరం ఏర్పడుతుందని, కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అన్నింటికీ విదేశీ కన్సల్టెన్సీలను నియమించుకునే తీరు కనబడుతోందని విమర్శించారు. ‘‘గోదావరి పుష్కరాల బాధ్యతలను కన్సల్టెన్సీకే ఇచ్చారు.. తాత్కాలిక రాజధాని నిర్మాణం ప్లాన్ రూపకల్పన బాధ్యతలు విదేశీ కన్సల్టెన్సీకి ఇచ్చారు. ఇక రెవెన్యూ చట్టంలో మార్పులు తేవడానికి కన్సల్టెన్సీ.. సీఎం విదేశీ పర్యటన ప్రణాళిక రూపకల్పనకు కన్సల్టెన్సీ.. నీటి పారుదలశాఖలో అంశాలకు కన్సల్టెన్సీ.. ప్రభుత్వ ప్రచార బాధ్యతల నిర్వహణకు కన్సల్టెన్సీ.. చివరకు రోడ్ల పనుల నాణ్యతా తనిఖీలనూ కన్సల్టెన్సీకి ఇస్తున్నారు’’ అని ఆయన దుయ్యబట్టారు. సీఎంకు తన ప్రభుత్వంలోని మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్‌లపై నమ్మకం లేక కన్సల్టెన్సీల నియామకానికి వెళుతున్నారా? అని ప్రశ్నించారు. ఒకవైపు రాష్ట్రంలో లోటు బడ్జెట్ అంటూ కన్సల్టెన్సీల పేరుతో రూ.వందల కోట్లను విదేశీ సంస్థలకు చెల్లించడమేమిటని తప్పుపట్టారు.చంద్రబాబు కుటుంబానికి సింగపూర్‌లో హోటళ్లు, కంపెనీలున్నాయన్న ప్రచారం ఉందని, ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమాలకు విదేశీ కన్సల్టెన్సీలను నియమించుకుని.. వాటిద్వారా అక్కడ తన సంస్థలకు క్విడ్ ప్రో కో జరుగుతోందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయని ఆయన చెప్పారు. లోటు బడ్జెట్ అంటూనే..: రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూనే చంద్రబాబు ప్రభుత్వం రూ.కోట్లా ప్రజాధనాన్ని వృథా చేస్తోందని మోహన్‌రెడ్డి విమర్శించారు. కన్సల్టెన్సీలకు రూ.వంద కోట్లు, సంక్రాంతి సంబరాలకు రూ.324 కోట్లు.. కేవలం సంచులపై చంద్రబాబు ఫొటో వేసుకోవడానికి రూ.15 కోట్లు.. ఇంకా విదేశీ పర్యటనలకు, వాస్తు పేరుతో కోట్లలో ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు.మరోవైపు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వేల కోట్ల నిధులను తేవడంలోనూ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నారు. -
ఎమ్మెల్సీ కోసమేనా?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికను టీడీపీకి అనుకూలంగా మలుచుకుంటే తనకు ఎమ్మెల్సీ దక్కుతుందనే భావనలో మాజీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఉన్నట్లు తెలిసింది. అయితే అది అంత సులువు కాదని ఆయనకు అర్థమైనట్లు సమాచారం. డబ్బుంటే జెడ్పీ సభ్యులను, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేషన్ కార్పొరేటర్లను కొనుగోలు చేయవచ్చునని సోమిరెడ్డి భావించినట్లు తెలిసింది. శాసనసభ ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి పోటీ చేసి పరాజయం పాలైన ఆయన జెడ్పీ, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తమకు అనుకూలం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. జెడ్పీ చైర్మన్ పదవి టీడీపీకి దక్కేలా కృషి చేస్తే, సోమిరెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడానికి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇది సోమిరెడ్డికి సవాలుగా మారింది. ఇతర పార్టీలకు చెందిన సభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు సోమిరెడ్డి విప్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారని సమాచారం. సాక్షాత్తు ఎన్నికల కమిషన్, స్థానికంగా జిల్లా కలెక్టర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విప్ జారీ చేసే అధికారం ఉందని పేర్కొన్నారు. అయినా ఖాతరు చేయకుండా తానే మేధావినని, తనకు తెలిసినంత ఎన్నికల కమిషనర్‌కు, జిల్లా కలెక్టర్‌కు తెలియదని సోమిరెడ్డి చెప్పుకునే స్థాయికి చేరుకున్నారు. 46 జెడ్పీ స్థానాల్లో 31 గెలుచుకున్న వైఎస్సార్సీపీని దెబ్బ తీయడానికి, ఆ పార్టీ నుంచి సభ్యులను తమ వైపు తిప్పుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కేవలం 15 స్థానాలున్న తెలుగుదేశం అధికార దుర్వినియోగం చేసైనా, జెడ్పీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్లో కూడా భారీ వ్యత్యాసం ఉన్నా తమకే మేయరు పదవి వస్తుందని చెప్పుకుంటూ, స్వంత పార్టీ కార్యకర్తలను మోసం చేస్తున్నారు. అదే విధంగా ఆత్మకూరు, కావలి, సూళ్లూరుపేటలలో వైఎస్సార్సీపీకి అధిక స్థానాలు ఉన్నాయి. గూడూరులో రెండు పార్టీలకు సమానంగా 16 మంది చొప్పున కౌన్సిలర్లు చొప్పున ఉండగా, చైర్మన్ అభ్యర్థిని నిర్ణయించే ఒకే స్వతంత్ర అభ్యర్థిని తమ వైపు తిప్పుకోవాలని శత విధాలా ప్రయత్నిస్తున్నారు. దీనికి గాను ఇంత కాలం మౌనంగా ఉన్న సోమిరెడ్డి అకస్మాత్తుగా తెరమీదకు వచ్చి, వైఎస్సార్సీపీకి విప్ జారీ చేసే అవకాశం లేదని పేర్కొంటూ కౌన్సిలర్లను తప్పుదోవ పట్టించేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఆయన తన పదవి కోసం చేస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన ముందు నాయకులుగా ఎదిగిన వారు మంత్రుల స్థానంలో ఉండగా, తాను ఎమ్మెల్సీ అయినా దక్కించుకోవాలనే ప్రయత్నంతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు సమాచారం. సోమిరెడ్డి నివాసంలో మంత్రుల మంతనాలు నెల్లూరు రూరల్: మండలంలోని అల్లీపురంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నివాసంలో మంగళవారం రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలు సోమిరెడ్డితో సుదీర్ఘ మంతనాలు కొనసాగించారు. సాయంత్రం ఐదు గంటల నుంచి వివిధ అంశాలపై చర్చలు సాగించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, నగరపాలకసంస్థను చేజిక్కించుకునేందుకు ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. సోమిరెడ్డి నివాసం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తల హడావుడి నెలకొంది. ఇతర పార్టీల మద్దతుతో ఎన్నికల్లో గెలుపొందిన వారిని ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకునే అంశాలపై వీరు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. -
మొండి చెయ్యేనా?
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో చేదు ఫలితాలు రావడంతో మంత్రి పదవుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా పార్టీ నేతలకు మొండి చెయ్యి చూపేందుకు సిద్ధమయ్యారు. శనివారం జరగబోయే మంత్రివర్గ పదవీ ప్రమాణ స్వీకారంలో జిల్లా నుంచి నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణకు మాత్రమే అవకాశం కల్పించి మ.మ. అనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఎన్నికల్లో తలపడి నెగ్గిన ముగ్గురు ఎమ్మెల్యేలుండగా వీరెవరినీ కాదని జిల్లా రాజకీయాలతో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సంబంధం లేని వ్యక్తిని మంత్రిని చేసే ఆలోచనపై తెలుగుతమ్ముళ్లు లోలోన రగిలిపోతున్నారు. జిల్లాలోని 10 శాసనసభ స్థానాల్లో కనీసం ఒక్క సీటైనా అధికంగా గెలుచుకుని తమ ఆధిపత్యం చాటుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు. ఈ లక్ష్యంతోనే ఆయన పార్టీలో సీనియర్లను సైతం పక్కనపెట్టి విమర్శలు, అసంతృప్తులు ఎదురైనా ఆర్థికంగా బలవ ంతులైన వ్యక్తులకే టికెట్లు కేటాయించారు. అయితే జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పూర్తి ఆధిక్యతను చాటింది. ఏడు శాసనసభ, రెండు లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీ విజయపతాకం ఎగురవేసింది. జిల్లా పార్టీలో మహామహులనుకునే వారంతా ఓటమి చవిచూశారు. ఈ ఫలితాలు చంద్రబాబును తీవ్ర అసంతృప్తికి గురి చేసినట్లు సమాచారం. ఓట్ల లెక్కింపు తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ (వెంకటగిరి), పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి (కోవూరు), బొల్లినేని రామారావు( ఉదయగిరి) మంత్రి వర్గంలో తమకు లక్కు తగలవచ్చని ఆశ పడ్డారు. వీరిలో బొల్లినేని పెద్దగా ప్రయత్నించక పోయినప్పటికీ మిగిలి న ఇద్దరు మంత్రి వర్గంలో బెర్త్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలే చేశారు. జిల్లా పార్టీలో చక్రం తిప్పగలరని భావిస్తున్న మాజీ మంత్రులు ఆదాల ప్రభాకరరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ద్వారా లాబీయింగ్ చేయిం చారు. వీరి బాధలు వీరు పడుతున్న తరుణంలోనే అనూహ్యంగా నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ పేరు తెర మీదకు వచ్చింది. ఆయన్ను రాజ్యసభకు పంపుతారని తొలుత భావించినా, ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నట్లు ప్రచారం జరగడం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ముందుగా మంత్రి అయ్యి ఆ తర్వాత శాసనమండలికి ఎంపిక కావాలని ఆశ పడిన నేతలకు గొంతులో వెలక్కాయ పడినట్లయింది. జిల్లాకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కితే ఇక ఐదేళ్లూ తమకు మంత్రి పదవి ఎండమావేననే ఆందోళన వారిలో వ్యక్తమైంది. దీంతో కొందరు నేతలు చంద్రబాబును కలిసి జిల్లా రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని నారాయణకు మంత్రి పదవి ఇవ్వవద్దని కోరారు. వీరి అభ్యర్థనపై చంద్రబాబు ఏ మాత్రం స్పందించలేదు. దీన్ని బట్టే ఆ నాయకులకు నారాయణకు పదవి ఇస్తున్న విషయం అర్థమైంది. పార్టీ కోసం శ్రమించి పనిచేసిన వారిని పక్కన పెట్టి గెలుపోటముల ఆధారంగా మంత్రి పదవి ఇవ్వడంపై జిల్లా నేతలు మండి పడుతున్నారు. అయితే ఇప్పుడు తమ అసంతృప్తి గానం వినిపించడం భావ్యం కాదనే ఆలోచనతో వారు మనసులోనే బాధపడుతున్నారు. -
పాపం సోమిరెడ్డి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘ఓడలు బండ్లవుతాయి. బండ్లు ఓడలవుతాయి’ జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఈ సామెత ఇప్పుడు అచ్చు సరిపోతోంది. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపికలో చక్రం తిప్పిన ఆయన ఇప్పుడు తనకు టికెట్ ఇప్పించుకోలేక చతికిలపడ్డారు. పొమ్మనలేక పొగబెట్టినట్లు చంద్రబాబు వ్యూహాత్మకంగా చంద్రమోహన్‌రెడ్డికి చెక్ పెట్టారు. జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో తొలినాళ్లలో తాళ్లపాక రమేష్‌రెడ్డి చక్రం తిప్పారు. ఇప్పుడు తాము యోధులమని చెప్పుకునే వారికి కూడా ఆయనే టికెట్లు ఇప్పించారు. ఆ తర్వాత ఆనం కుటుంబం కొంత కాలం పాటు ఈ హవా నడిపింది. ఈ దశ తర్వాత జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి శకం ప్రారంభమైంది. రెండు దశాబ్దాల పాటు ఆయన జిల్లా తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పారు. తనకు వ్యతిరేకమనుకున్న వారిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి వారిని పార్టీ నుంచి బయటకు పోయేలా చేశారు. ఎన్నికల్లో కూడా ఆయన నో అన్న వారికి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ హై కమాండ్ వెనకడుగు వేసేలా ఆధిపత్యం చలాయిం చారు. 2009లో బీద మస్తాన్‌రావు కావలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, 2011లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన సోదరుడు బీద రవిచంద్ర టీడీపీ అభ్యర్థిగా పోటీచేయడంతో సోమిరెడ్డికి ప్రత్యామ్నాయ నాయకత్వం తెర మీదకు వచ్చింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సోమిరెడ్డి రాజ కీయం చేసి టీడీపీ ఓట్లు కాంగ్రెస్‌కు వేయించి తనను ఓడించారని రవి చంద్ర పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేశారని ప్రచారం జరిగింది. గతంలో తనను జెడ్పీ చైర్మన్ కాకుండా చేశారని, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వెన్నుపోటు పొడిచారని సోమిరెడ్డి మీద రవిచంద్ర మనసులో ఆగ్రహం దాచుకున్నారు. దీంతో బీద సోదరులు సోమిరెడ్డికి ప్రత్యామ్నాయంగా ఎదగాలనే కసితో జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే రవిచంద్ర జిల్లా అధ్యక్ష పదవి సాధించు కోగలిగారు. రాజ్యసభ నిరాశ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఇబ్బందులు పడటం కంటే రాజ్యసభకు వెళ్లి ఆరేళ్లపాటు హాయిగా ఉండవచ్చని భావించిన సోమిరెడ్డి ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా టికెట్ కోసం ప్రయత్నించారు. చివరి నిమిషంలో చంద్రబాబు హ్యాండివ్వడంతో సోమిరెడ్డి షాక్ తిన్నారు. సోమిరెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోను రాజ్యసభ టికెట్ వచ్చే అవకాశమే లేదని టీడీపీలోని ఆయన వ్యతిరేక వర్గం ముందునుంచే ప్రచారం చేసింది. ఈ రకంగా సోమిరెడ్డికి జిల్లా రాజకీయాల్లో చెక్ పడింది. కోవూరులో మరో చెక్ కోవూరు తెలుగుదేశం పార్టీ టికెట్‌ను తన మద్దతుదారుడు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డికి ఇప్పించుకోవాలని సోమిరెడ్డి చేసిన ప్రయత్నాలను బీద సోదరులు వ్యూహాత్మకంగా తిప్పికొట్టారు. సోమిరెడ్డి వ్యతిరేకి ఆదాలను పార్టీలోకి తీసుకురావడం ద్వారా తమ వర్గం మరింత గట్టి చేసుకుని సోమిరెడ్డిని జీరో చేసే వ్యూహానికి పదును పెట్టారు. వీరికి వ్యక్తిగతంగా పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి మీద కోపం లేక పోయినప్పటికీ సోమిరెడ్డి ప్రతిపాదించిన వ్యక్తి కావడంతో పట్టుబట్టి ఆయనకు టికెట్ రాకుండా చేయగలిగారు. నెరవేరని రూరల్ ఆశలు రాజ్యసభ సీటు దక్కకపోయినా నెల్లూరు రూరల్ టికెట్ అయినా తనకే వస్తుందని సోమిరెడ్డి ధీమాగా వ్యవహరించారు. ప్రజాగర్జన సభ నిర్వహణ సమయంలో ఎంపీలు సుజన చౌదరి, గరికపాటి మోహన్‌రావు సమక్షంలోనే ఈ పంచాయితీ జరిగింది. సోమిరెడ్డికి రూరల్ ఇవ్వడానికి చంద్రబాబు కూడా ఆమోదం తెలిపారని వారు వెల్లడించారు. దీంతో రెండు నెలలుగా సోమిరెడ్డి రూరల్ నియోజకవర్గంపై దృష్టి సారించారు. ఎన్నికల పొత్తులో ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించి చంద్రబాబు వ్యూహాత్మకంగా సోమిరెడ్డికి చెక్ పెట్టారు. ఈ అవమానం భరించలేని సోమిరెడ్డి అలక పాన్పు ఎక్కి కూర్చున్నా చంద్రబాబు నామ మాత్రపు బుజ్జగింపులు చేయించారే తప్ప సోమిరెడ్డి డిమాండ్ తీర్చే దిశగా ప్రయత్నించలేదు. ఆరునూరైనా ఇక సోమిరెడ్డికి నెల్లూరు రూరల్ టికెట్ దక్కే అవకాశమే లేకుండా పోయింది. దీని వెనుక కూడా బీద సోదరులతో పాటు, తెర చాటుగా ఆదాల హస్తం కూడా ఉందనే అనుమానాలు సోమిరెడ్డి వర్గంలో వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద రెండు దశాబ్దాలు జిల్లా టీడీపీలో చక్రం తిప్పిన సోమిరెడ్డి చివరకు తనకు కూడా తాను టికెట్ ఇప్పించుకోలేని స్థితిలో పడిపోయారు. -
కోవూరు వార్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా తెలుగుదేశం పార్టీలో రెండు అధికార కేంద్రాలు(పవర్ పాయింట్స్)గా ఉన్న మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద బ్రదర్స్ మధ్య ఇక కోవూరు టికెట్ వార్ తీవ్రం కానుంది. కాంగ్రెస్‌కు టాటా చెప్పి పచ్చచొక్కా తొడుక్కోవడానికి అన్నీ సిద్ధం చేసుకున్న మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటిదాకా కోవూరు టీడీపీ అభ్యర్థి తానేనని విస్తృత ప్రచారం చేసుకుంటున్న సోమిరెడ్డి మద్దతుదారుడు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డికి ఈ పరిణామం ఆందోళన కలిగించేదే. కోవూరు నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో తమ మద్దతుదారుడినే పోటీ చేయించాలనే దిశగా సోమిరెడ్డి, మస్తాన్‌రావు కొంతకాలంగా రాజ కీయ పరమపద సోపానం ఆటకు తెర లేపారు. ఇందులో భాగంగా సోమిరెడ్డి తన సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అయిన పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డిని రంగంలోకి తెచ్చారు. పార్టీ అధినాయకత్వం మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డిని ఆహ్వానించినప్పటికీ ఆయన ఇదిగో.. అదిగో అని తప్పించుకుని తిరగడంతో దీన్నే కారణంగా చూపి తన మద్దతుదారుడికి టికెట్ ఖరారు చేయిం చేందుకు సోమిరెడ్డి పావులు కదుపుతూ వచ్చారు. ఇందులోభాగంగానే గత నాలుగైదు నెలలుగా పెళ్లకూరు నియోజకవర్గంలో ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. కొత్తగా ఎవరు పార్టీలో చేరినా టికెట్ మాత్రం తనకేనని ఆయన పార్టీ శ్రేణుల వద్ద బహిరంగంగానే చెబుతూ వస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో పోలంరెడ్డి తెలుగుదేశంలోనే కర్చీఫ్ వేసి ఉంచారు. కోవూరు టికెట్ ఆయనకే ఇప్పించడానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవి చంద్ర, కావలి ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు సై అన్నారు. కోవూరులో తమ కత్తికి ఎదురు లేకుండా చేసుకునే ఆలోచనతో ఆత్మకూరు టికెట్‌ను సోమిరెడ్డి మద్దతుదారుడైన గూటూరు కన్నబాబుకు ఖరారు చేయించడంలో వీరు కీలకంగా వ్యవహరించారని ఆ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆత్మకూరు టికెట్ సోమిరెడ్డి మనిషికి ఇచ్చినందువల్ల కోవూరు టికెట్ తాము సిఫారసు చేసిన వ్యక్తికి ఇవ్వాలని బాబు ముందు బీద బ్రదర్స్ డిమాండ్ పెట్టారు. మాజీ శాసనసభ్యుడు కావడంతో చంద్రబాబు కూడా పోలంరెడ్డి వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. బాబు నుంచి పచ్చజెండా ఊగడంతోనే పోలంరెడ్డి టీడీపీలో ప్రవేశానికి వేగంగా అడుగులు వేయడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఆయన కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం నార్త్ రాజుపాళెంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం ప్రకటించారు. త్వరలోనే తాను టీడీపీలో చేరుతున్నట్లు చెప్పకనే చెప్పారు. పోలంరెడ్డికే టికెట్ ఖరారైందని ఆయన మద్దతుదారులు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేది ఎవరైనా టికెట్ కోసం మాత్రం సోమిరెడ్డి, బీద బ్రదర్స్ మధ్య ఇక డెరైక్ట్ వార్ ప్రారంభమైందని చెప్పవచ్చు. చంద్రబాబు వద్ద ఈ ఇద్దరిలో ఎవరి పంతం నెగ్గుతుందనేది చూడాలి. ఇలా చేయొచ్చు? రాజ్యసభ సభ్యత్వం దక్కలేదని రగి లిపోతున్న సోమిరెడ్డిని సంతృప్తిపరచడానికి బాబు కొత్త ఫార్ములా అమలు చేయొచ్చని తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. సోమిరెడ్డిని నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి పంపి, ఆయన మద్దతుదారుడైన పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డిని సర్వేపల్లి నుంచి పోటీకి దింపొచ్చనే ప్రచారం జరుగుతోంది. కోవూరులో బీద బ్రదర్స్ బలపరుస్తున్న పోలంరెడ్డికి టికెట్ ఇస్తే అందర్నీ సంతృప్తిపరచినట్లు అవుతుందనే ఫార్ములాను చంద్రబాబు తెర మీదకు తేవచ్చనేది పార్టీ ముఖ్య నేతల అభిప్రాయం. -
రాజీకీయం!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పెదవి విప్పారు. ఇంకా చెప్పాలంటే అబద్ధాల పుట్ట బద్ధలైంది. మాటలు మార్చడంలో దిట్టగా పేరొందిన ఆయన వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ విషయమై నేరుగా స్పష్టత ఇవ్వనప్పటికీ ఆ దిశగా సంకేతాలు మాత్రం ఇచ్చారు. తనకు సెంటిమెంట్‌గా భావించే తోటపల్లిగూడూరు మండలం మహాలక్ష్మీపురంలోని మహలక్ష్మమ్మ గుడిలో శుక్రవారం ఉదయం పూజలు నిర్వహించి స్థానిక దేశం నేతలతో 10 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను త్వరలోనే సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. సమయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర కూడా ఆయన వెంట ఉన్నారు. దీన్నిబట్టి సోమిరెడ్డి అక్కడ నుంచి పోటీకి సిద్ధమైనట్టు చె ప్పకనే చెప్పినట్టయింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో నే ఆయన సర్వేపల్లి వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోం ది. ఈ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే(కాంగ్రెస్) ఆ దాల ప్రభాకర్‌రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు ప్ర చారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ మేరకు టీడీపీ తరపున సర్వేపల్లి నుంచి పోటీ చేసేందుకు ఆదాల విముఖత వ్యక్తం చేయడంతో అధిష్టానం ఆదేశాల మేరకు సోమిరెడ్డి అయిష్టంగానే అంగీకరించారని సమాచారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకున్న ఆ యనకు అధిష్టానం ఆదేశాలు మింగుడుపడటం లేదు. 2004 తరువాత కష్టకాలం.. జిల్లాలో టీడీపీ అంటే సోమిరెడ్డి, సోమిరెడ్డి అంటే టీడీపీ అనే పరిస్థితి. 2004 ముందు వరకు టీడీపీ ప్రభుత్వంలో పలు కీలక మంత్రి పదవుల్లో పనిచేసిన ఆయన ప్రభుత్వం పడిపోయిన తరువాత జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా మారారు. ఇదే ఆయనకు శాపంగా మారిందని కూడా చెప్పవచ్చు. స్థాయి కలిగిన నేతలు లేకపోవడంతో ఏ ఎన్నికలు వచ్చినా పార్టీలో ఆయన పేరు ప్రముఖంగా వినిపించడం పరిపాటిగా మారింది. 2006లో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఓపెన్ కేటగిరిలో ఉండటంతో చంద్రమోహన్‌రెడ్డి కంటే బలమైన అభ్యర్థి టీడీపీకి కరువయ్యారు. దీంతో ఆయనను ఒప్పించి పెళ్లకూరు మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడి పదవికి పోటీ చేయించారు. వెనకబడిన మండలం నుంచి తనను గెలిపిస్తే జెడ్పీ చైర్మన్‌గా మండల అభివృద్ధికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అయితే మండల ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చినా జెడ్పీ పీఠం మాత్రం కాంగ్రెస్ వశమయ్యింది. దీంతో ఆయన జిల్లా పరిషత్ సమావేశాలకు మాత్రం హాజరయ్యేవారు కాదు. సభ్యత్వం కోల్పోకుండా మూడేళ్లు నెట్టుకొచ్చారు. మండల ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చిన దాఖలాలు లేవు. 2009 సాధారణ ఎన్నికలకు ముందు జెడ్పీటీసీ సభ్యుడి పదవికి రాజీనామా చేసి మళ్లీ సర్వేపల్లి నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లోనూ వరుసగా రెండోసారి ఓటమి చవిచూశారు. 2012లో కోవూరు అసెంబ్లీ స్థానానికి అనూహ్యంగా ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లోనూ ఆయన పార్టీకి దిక్కయ్యారు. తాను కోవూరు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని హామీలు గుప్పించారు. స్వయంగా పార్టీ అధినేత బాబు కూడా వారం రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయినా పరాజయం తప్పలేదు. పార్టీ ఆదేశాల మేరకు మరోసారి ఆయన సర్వేపల్లి నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. వీటన్నింటినీ పరిశీలిస్తే చంద్రమోహన్‌రెడ్డికి మాట మార్చడమంటే తేలికైన విషయంగా స్పష్టమవుతోంది. శత్రువుతో చేతులు కలిపి.. సర్వేపల్లి నియోజకవర్గంలో రెండుసార్లు వరుసగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి చేతిలో ఓటమి చవిచూసిన సోమిరెడ్డి 2014 ఎన్నికల్లో ఆయన సహకారంతో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలకు ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితి. కానీ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆదాల టీడీపీ వైపు చూస్తున్నారు. త్వరలోనే ఆ పార్టీలో చేరుతారనే ప్రచారం ఉంది. ఈ పరిస్థితుల్లో ఇద్దరు నేతలు విభేదాలు మరిచి పరస్పరం సహకరించుకోవాల్సిన అగత్యం ఏర్పడుతోంది. ముత్తుకూరు మండలంలో ఏపీ జెన్కో చేపట్టిన యాష్‌పాండ్ నిర్మాణం విషయంలో ఆదాల ప్రభాకర్‌రెడ్డి ప్రధాన కాంట్రాక్టర్‌గా అవతారమెత్తి ప్రభుత్వ సొమ్ము దోచుకుంటున్నారని సోమిరెడ్డి పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఆ పనులు నిలిచిపోయేంతవరకు పోరాటం చేశారు. అప్పట్లో అభివృద్ధి నిరోధకులని సోమిరెడ్డిపై ఆదాల ఎదురుదాడి చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు చేతులు కలపాల్సి వస్తోందని టీడీపీ నేతల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. -
దిక్కూ.. మొక్కూ లేదు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : తెలుగుదేశం పార్టీ అధిష్టానం వైఖరిపై జిల్లా శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తమవుతోంది. సగానికిపైగా నియోజకవర్గాల్లో పార్టీకి దిక్కు లేకుండా పోయినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ చేసే నాయకుల కోసం వేచిచూస్తున్న ధోరణి వారిని ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. జిల్లా పార్టీలో సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కారణంగా నాలుగు నియోజకవర్గాల్లో మరింత గందరగోళం ఏర్పడింది. ఆయన ఎక్కడ పోటీ చేస్తారో తేల్చి చెప్పడం లేదు. మరికొన్ని నియోజకవర్గాల్లో తన సొంత మనుషులను ఇన్చార్జిలుగా నియమించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు పార్టీ కోసం ఎప్పటి నుంచే పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలను అసంతృప్తికి గురిచేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లా నాయకులతో సంబంధం లేకుండా కొం దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీలతో అధిష్టానం నేరుగా చర్చలు జరుపుతోంది. ఈ పరిణామాలు అధికారం కోల్పోయినప్పటి నుంచి పార్టీని అంటిపెట్టుకున్న వారిలో అసహనం, ఆవేదనను పెంచుతున్నాయి. 2009 ఎన్నికల తరువాత నియోజకవర్గ ఇన్చార్జిలను నియమించకపోగా సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయడంలో జిల్లా నాయకత్వం పూర్తిగా విఫలమైంది. ఐదేళ్ల కాలంలో ఏ నియోజకవర్గంలోనూ గ్రామ, మండల కమిటీలను నియమించిన దాఖలాలు లేవు. నెల్లూరు నగరంలోనూ ఇదే పరిస్థితి. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నందమూరి బాలకృష్ణ అభిమానని చెప్పుకుంటుండగా, మాజీ మంత్రి టి. రమేష్‌రెడ్డి ఎన్టీఆర్ అభిమానుల్లో తానొక్కడినే మిగిలానంటూ ఇన్చార్జి పదవి కోసం పోటీ పడుతున్నారు. వీరిద్దరిని కాదని ఒక ఎమ్మెల్యే కోసం తెలుగుదేశం అధిష్టానం నేరుగా రంగంలోకి దిగడంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. రూరల్ నియోజకవర్గంలో సోమిరెడ్డి పోటీ చేస్తారని మొన్నటి వరకు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక్కడ నుంచి కిలారి వెంకటస్వామినాయుడు కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తారుమారవుతున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. ఈయనతో ఇప్పటికే అధిష్టానం ఒక దఫా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. చంద్రమోహన్‌రెడ్డిని సర్వేపల్లికి పంపి ఆదాలను రూరల్ నుంచి పోటీ చేయిస్తే రెండు నియోజకవర్గాల్లోనూ పార్టీకి ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నట్టు సమాచారం. ఇక కోవూరు విషయానికి వస్తే ఒకసారి పార్టీలో చేరేందుకు నిర్ణయించిన ముహూర్తానికి డుమ్మా కొట్టిన మాజీ ఎమ్మెల్యే కోసం మళ్లీ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ నుంచి తన వ్యాపార భాగస్వామి అయిన బడా కాంట్రాక్టర్ శ్రీనివాసులురెడ్డిని సీన్లోకి తీసుకురావాలని చంద్రమోహన్‌రెడ్డి ఎత్తులు వేస్తుం డగా అధిష్టానం మాత్రం మాజీ ఎమ్మెల్యే వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డికి నారాయణ విద్యాసంస్థల చైర్మన్ నారాయణ ఆశీస్సులు ఉన్నాయి. దీంతో ఇక్కడ పోటాపోటీ నెలకొంది. మరోవైపు గత ఏడాది జరిగిన ఉపఎన్నికల్లో చంద్రమోహన్‌రెడ్డి తాను మళ్లీ ఇక్కడ నుంచే పోటీ చేస్తానని హామీ ఇచ్చారు. మరి ఆయన ఎటువైపు మొగ్గుతారనేది కూడా చూడాల్సి ఉంది. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బీద రవిచంద్రకు చంద్రబాబు దగ్గర మంచి పలుకుబడే ఉంది. అయితే ఆయన అధ్యక్ష పదవిని చేపట్టి ఏడాది గడుస్తున్నా ఒక్క నియోజకవర్గంలోనూ తన ముద్ర వేసుకోలేకపోతున్నారు. పార్టీని గాడిలో పెడతారని భావించి పగ్గాలు అప్పగిస్తే ఆయన కూడా చంద్రమోహన్‌రెడ్డి బాటలో నడుస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఎటు దారితీస్తాయనేది వేచి చూడాల్సి ఉంది.