సాక్షి ప్రతినిధి, నెల్లూరు : తెలుగుదేశం పార్టీ అధిష్టానం వైఖరిపై జిల్లా శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తమవుతోంది. సగానికిపైగా నియోజకవర్గాల్లో పార్టీకి దిక్కు లేకుండా పోయినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ చేసే నాయకుల కోసం వేచిచూస్తున్న ధోరణి వారిని ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. జిల్లా పార్టీలో సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కారణంగా నాలుగు నియోజకవర్గాల్లో మరింత గందరగోళం ఏర్పడింది. ఆయన ఎక్కడ పోటీ చేస్తారో తేల్చి చెప్పడం లేదు. మరికొన్ని నియోజకవర్గాల్లో తన సొంత మనుషులను ఇన్‌చార్జిలుగా నియమించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు పార్టీ కోసం ఎప్పటి నుంచే పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలను అసంతృప్తికి గురిచేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లా నాయకులతో సంబంధం లేకుండా కొం దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీలతో అధిష్టానం నేరుగా చర్చలు జరుపుతోంది.
ఈ పరిణామాలు అధికారం కోల్పోయినప్పటి నుంచి పార్టీని అంటిపెట్టుకున్న వారిలో అసహనం, ఆవేదనను పెంచుతున్నాయి. 2009 ఎన్నికల తరువాత నియోజకవర్గ ఇన్‌చార్జిలను నియమించకపోగా సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయడంలో జిల్లా నాయకత్వం పూర్తిగా విఫలమైంది. ఐదేళ్ల కాలంలో ఏ నియోజకవర్గంలోనూ గ్రామ, మండల కమిటీలను నియమించిన దాఖలాలు లేవు. నెల్లూరు నగరంలోనూ ఇదే పరిస్థితి. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నందమూరి బాలకృష్ణ అభిమానని చెప్పుకుంటుండగా, మాజీ మంత్రి టి. రమేష్‌రెడ్డి ఎన్టీఆర్ అభిమానుల్లో తానొక్కడినే మిగిలానంటూ ఇన్‌చార్జి పదవి కోసం పోటీ పడుతున్నారు. వీరిద్దరిని కాదని ఒక ఎమ్మెల్యే కోసం తెలుగుదేశం అధిష్టానం నేరుగా రంగంలోకి దిగడంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. రూరల్ నియోజకవర్గంలో సోమిరెడ్డి పోటీ చేస్తారని మొన్నటి వరకు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక్కడ నుంచి కిలారి వెంకటస్వామినాయుడు కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తారుమారవుతున్నాయి.
ఈ నియోజకవర్గం నుంచి సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. ఈయనతో ఇప్పటికే అధిష్టానం ఒక దఫా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. చంద్రమోహన్‌రెడ్డిని సర్వేపల్లికి పంపి ఆదాలను రూరల్ నుంచి పోటీ చేయిస్తే రెండు నియోజకవర్గాల్లోనూ పార్టీకి ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నట్టు సమాచారం. ఇక కోవూరు విషయానికి వస్తే ఒకసారి పార్టీలో చేరేందుకు నిర్ణయించిన ముహూర్తానికి డుమ్మా కొట్టిన మాజీ ఎమ్మెల్యే కోసం మళ్లీ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ నుంచి తన వ్యాపార భాగస్వామి అయిన బడా కాంట్రాక్టర్ శ్రీనివాసులురెడ్డిని సీన్‌లోకి తీసుకురావాలని చంద్రమోహన్‌రెడ్డి ఎత్తులు వేస్తుం డగా అధిష్టానం మాత్రం మాజీ ఎమ్మెల్యే వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డికి నారాయణ విద్యాసంస్థల చైర్మన్ నారాయణ ఆశీస్సులు ఉన్నాయి. దీంతో ఇక్కడ పోటాపోటీ నెలకొంది. మరోవైపు గత ఏడాది జరిగిన ఉపఎన్నికల్లో చంద్రమోహన్‌రెడ్డి తాను మళ్లీ ఇక్కడ నుంచే పోటీ చేస్తానని హామీ ఇచ్చారు. మరి ఆయన ఎటువైపు మొగ్గుతారనేది కూడా చూడాల్సి ఉంది.
తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బీద రవిచంద్రకు చంద్రబాబు దగ్గర మంచి పలుకుబడే ఉంది. అయితే ఆయన అధ్యక్ష పదవిని చేపట్టి ఏడాది గడుస్తున్నా ఒక్క నియోజకవర్గంలోనూ తన ముద్ర వేసుకోలేకపోతున్నారు. పార్టీని గాడిలో పెడతారని భావించి పగ్గాలు అప్పగిస్తే ఆయన కూడా చంద్రమోహన్‌రెడ్డి బాటలో నడుస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఎటు దారితీస్తాయనేది వేచి చూడాల్సి ఉంది.
దిక్కూ.. మొక్కూ లేదు
Published Fri, Dec 13 2013 3:37 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement