సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా తెలుగుదేశం పార్టీలో రెండు అధికార కేంద్రాలు(పవర్ పాయింట్స్)గా ఉన్న మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద బ్రదర్స్ మధ్య ఇక కోవూరు టికెట్ వార్ తీవ్రం కానుంది. కాంగ్రెస్‌కు టాటా చెప్పి పచ్చచొక్కా తొడుక్కోవడానికి అన్నీ సిద్ధం చేసుకున్న మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
ఇప్పటిదాకా కోవూరు టీడీపీ అభ్యర్థి తానేనని విస్తృత ప్రచారం చేసుకుంటున్న సోమిరెడ్డి మద్దతుదారుడు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డికి ఈ పరిణామం ఆందోళన కలిగించేదే. కోవూరు నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో తమ మద్దతుదారుడినే పోటీ చేయించాలనే దిశగా సోమిరెడ్డి, మస్తాన్‌రావు కొంతకాలంగా రాజ కీయ పరమపద సోపానం ఆటకు తెర లేపారు. ఇందులో భాగంగా సోమిరెడ్డి తన సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అయిన పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డిని రంగంలోకి తెచ్చారు.
పార్టీ అధినాయకత్వం మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డిని ఆహ్వానించినప్పటికీ ఆయన ఇదిగో.. అదిగో అని తప్పించుకుని తిరగడంతో దీన్నే కారణంగా చూపి తన మద్దతుదారుడికి టికెట్ ఖరారు చేయిం చేందుకు సోమిరెడ్డి పావులు కదుపుతూ వచ్చారు. ఇందులోభాగంగానే గత నాలుగైదు నెలలుగా పెళ్లకూరు నియోజకవర్గంలో ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. కొత్తగా ఎవరు పార్టీలో చేరినా టికెట్ మాత్రం తనకేనని ఆయన పార్టీ శ్రేణుల వద్ద బహిరంగంగానే చెబుతూ వస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో పోలంరెడ్డి తెలుగుదేశంలోనే కర్చీఫ్ వేసి ఉంచారు. కోవూరు టికెట్ ఆయనకే ఇప్పించడానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవి చంద్ర, కావలి ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు సై అన్నారు.
కోవూరులో తమ కత్తికి ఎదురు లేకుండా చేసుకునే ఆలోచనతో ఆత్మకూరు టికెట్‌ను సోమిరెడ్డి మద్దతుదారుడైన గూటూరు కన్నబాబుకు ఖరారు చేయించడంలో వీరు కీలకంగా వ్యవహరించారని ఆ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆత్మకూరు టికెట్ సోమిరెడ్డి మనిషికి ఇచ్చినందువల్ల కోవూరు టికెట్ తాము సిఫారసు చేసిన వ్యక్తికి ఇవ్వాలని బాబు ముందు బీద బ్రదర్స్ డిమాండ్ పెట్టారు. మాజీ శాసనసభ్యుడు కావడంతో చంద్రబాబు కూడా పోలంరెడ్డి వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.
బాబు నుంచి పచ్చజెండా ఊగడంతోనే పోలంరెడ్డి టీడీపీలో ప్రవేశానికి వేగంగా అడుగులు వేయడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఆయన కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం నార్త్ రాజుపాళెంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం ప్రకటించారు. త్వరలోనే తాను టీడీపీలో చేరుతున్నట్లు చెప్పకనే చెప్పారు. పోలంరెడ్డికే టికెట్ ఖరారైందని ఆయన మద్దతుదారులు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేది ఎవరైనా టికెట్ కోసం మాత్రం సోమిరెడ్డి, బీద బ్రదర్స్ మధ్య ఇక డెరైక్ట్ వార్ ప్రారంభమైందని చెప్పవచ్చు. చంద్రబాబు వద్ద ఈ ఇద్దరిలో ఎవరి పంతం నెగ్గుతుందనేది చూడాలి.
ఇలా చేయొచ్చు?
రాజ్యసభ సభ్యత్వం దక్కలేదని రగి లిపోతున్న సోమిరెడ్డిని సంతృప్తిపరచడానికి బాబు కొత్త ఫార్ములా అమలు చేయొచ్చని తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. సోమిరెడ్డిని నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి పంపి, ఆయన మద్దతుదారుడైన పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డిని సర్వేపల్లి నుంచి పోటీకి దింపొచ్చనే ప్రచారం జరుగుతోంది. కోవూరులో బీద బ్రదర్స్ బలపరుస్తున్న పోలంరెడ్డికి టికెట్ ఇస్తే అందర్నీ సంతృప్తిపరచినట్లు అవుతుందనే ఫార్ములాను చంద్రబాబు తెర మీదకు తేవచ్చనేది పార్టీ ముఖ్య నేతల అభిప్రాయం.
కోవూరు వార్
Published Sat, Feb 15 2014 2:04 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement