సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పెదవి విప్పారు. ఇంకా చెప్పాలంటే అబద్ధాల పుట్ట బద్ధలైంది. మాటలు మార్చడంలో దిట్టగా పేరొందిన ఆయన వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ విషయమై నేరుగా స్పష్టత ఇవ్వనప్పటికీ ఆ దిశగా సంకేతాలు మాత్రం ఇచ్చారు. తనకు సెంటిమెంట్‌గా భావించే తోటపల్లిగూడూరు మండలం మహాలక్ష్మీపురంలోని మహలక్ష్మమ్మ గుడిలో శుక్రవారం ఉదయం పూజలు నిర్వహించి స్థానిక దేశం నేతలతో 10 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను త్వరలోనే సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.
సమయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర కూడా ఆయన వెంట ఉన్నారు. దీన్నిబట్టి సోమిరెడ్డి అక్కడ నుంచి పోటీకి సిద్ధమైనట్టు చె ప్పకనే చెప్పినట్టయింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో నే ఆయన సర్వేపల్లి వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోం ది. ఈ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే(కాంగ్రెస్) ఆ దాల ప్రభాకర్‌రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు ప్ర చారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ మేరకు టీడీపీ తరపున సర్వేపల్లి నుంచి పోటీ చేసేందుకు ఆదాల విముఖత వ్యక్తం చేయడంతో అధిష్టానం ఆదేశాల మేరకు సోమిరెడ్డి అయిష్టంగానే అంగీకరించారని సమాచారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకున్న ఆ యనకు అధిష్టానం ఆదేశాలు మింగుడుపడటం లేదు.
2004 తరువాత కష్టకాలం..
జిల్లాలో టీడీపీ అంటే సోమిరెడ్డి, సోమిరెడ్డి అంటే టీడీపీ అనే పరిస్థితి. 2004 ముందు వరకు టీడీపీ ప్రభుత్వంలో పలు కీలక మంత్రి పదవుల్లో పనిచేసిన ఆయన ప్రభుత్వం పడిపోయిన తరువాత జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా మారారు. ఇదే ఆయనకు శాపంగా మారిందని కూడా చెప్పవచ్చు. స్థాయి కలిగిన నేతలు లేకపోవడంతో ఏ ఎన్నికలు వచ్చినా పార్టీలో ఆయన పేరు ప్రముఖంగా వినిపించడం పరిపాటిగా మారింది. 2006లో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఓపెన్ కేటగిరిలో ఉండటంతో చంద్రమోహన్‌రెడ్డి కంటే బలమైన అభ్యర్థి టీడీపీకి కరువయ్యారు. దీంతో ఆయనను ఒప్పించి పెళ్లకూరు మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడి పదవికి పోటీ చేయించారు. వెనకబడిన మండలం నుంచి తనను గెలిపిస్తే జెడ్పీ చైర్మన్‌గా మండల అభివృద్ధికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అయితే మండల ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చినా జెడ్పీ పీఠం మాత్రం కాంగ్రెస్ వశమయ్యింది. దీంతో ఆయన జిల్లా పరిషత్ సమావేశాలకు మాత్రం హాజరయ్యేవారు కాదు. సభ్యత్వం కోల్పోకుండా మూడేళ్లు నెట్టుకొచ్చారు.
మండల ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చిన దాఖలాలు లేవు. 2009 సాధారణ ఎన్నికలకు ముందు జెడ్పీటీసీ సభ్యుడి పదవికి రాజీనామా చేసి మళ్లీ సర్వేపల్లి నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లోనూ వరుసగా రెండోసారి ఓటమి చవిచూశారు. 2012లో కోవూరు అసెంబ్లీ స్థానానికి అనూహ్యంగా ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లోనూ ఆయన పార్టీకి దిక్కయ్యారు. తాను కోవూరు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని హామీలు గుప్పించారు. స్వయంగా పార్టీ అధినేత బాబు కూడా వారం రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయినా పరాజయం తప్పలేదు. పార్టీ ఆదేశాల మేరకు మరోసారి ఆయన సర్వేపల్లి నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. వీటన్నింటినీ పరిశీలిస్తే చంద్రమోహన్‌రెడ్డికి మాట మార్చడమంటే తేలికైన విషయంగా స్పష్టమవుతోంది.
శత్రువుతో చేతులు కలిపి..
సర్వేపల్లి నియోజకవర్గంలో రెండుసార్లు వరుసగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి చేతిలో ఓటమి చవిచూసిన సోమిరెడ్డి 2014 ఎన్నికల్లో ఆయన సహకారంతో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలకు ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితి. కానీ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆదాల టీడీపీ వైపు చూస్తున్నారు. త్వరలోనే ఆ పార్టీలో చేరుతారనే ప్రచారం ఉంది. ఈ పరిస్థితుల్లో ఇద్దరు నేతలు విభేదాలు మరిచి పరస్పరం సహకరించుకోవాల్సిన అగత్యం ఏర్పడుతోంది. ముత్తుకూరు మండలంలో ఏపీ జెన్‌కో చేపట్టిన యాష్‌పాండ్ నిర్మాణం విషయంలో ఆదాల ప్రభాకర్‌రెడ్డి ప్రధాన కాంట్రాక్టర్‌గా అవతారమెత్తి ప్రభుత్వ సొమ్ము దోచుకుంటున్నారని సోమిరెడ్డి పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఆ పనులు నిలిచిపోయేంతవరకు పోరాటం చేశారు. అప్పట్లో అభివృద్ధి నిరోధకులని సోమిరెడ్డిపై ఆదాల ఎదురుదాడి చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు చేతులు కలపాల్సి వస్తోందని టీడీపీ నేతల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాజీకీయం!
Published Sat, Dec 14 2013 3:45 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement