
ఎమ్మెల్సీ కోసమేనా?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికను టీడీపీకి అనుకూలంగా మలుచుకుంటే తనకు ఎమ్మెల్సీ దక్కుతుందనే భావనలో మాజీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఉన్నట్లు తెలిసింది. అయితే అది అంత సులువు కాదని ఆయనకు అర్థమైనట్లు సమాచారం. డబ్బుంటే జెడ్పీ సభ్యులను, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేషన్ కార్పొరేటర్లను కొనుగోలు చేయవచ్చునని సోమిరెడ్డి భావించినట్లు తెలిసింది. శాసనసభ ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి పోటీ చేసి పరాజయం పాలైన ఆయన జెడ్పీ, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తమకు అనుకూలం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. జెడ్పీ చైర్మన్ పదవి టీడీపీకి దక్కేలా కృషి చేస్తే, సోమిరెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడానికి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇది సోమిరెడ్డికి సవాలుగా మారింది. ఇతర పార్టీలకు చెందిన సభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు సోమిరెడ్డి విప్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారని సమాచారం. సాక్షాత్తు ఎన్నికల కమిషన్, స్థానికంగా జిల్లా కలెక్టర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విప్ జారీ చేసే అధికారం ఉందని పేర్కొన్నారు.
అయినా ఖాతరు చేయకుండా తానే మేధావినని, తనకు తెలిసినంత ఎన్నికల కమిషనర్‌కు, జిల్లా కలెక్టర్‌కు తెలియదని సోమిరెడ్డి చెప్పుకునే స్థాయికి చేరుకున్నారు. 46 జెడ్పీ స్థానాల్లో 31 గెలుచుకున్న వైఎస్సార్‌సీపీని దెబ్బ తీయడానికి, ఆ పార్టీ నుంచి సభ్యులను తమ వైపు తిప్పుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కేవలం 15 స్థానాలున్న తెలుగుదేశం అధికార దుర్వినియోగం చేసైనా, జెడ్పీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్‌లో కూడా భారీ వ్యత్యాసం ఉన్నా తమకే మేయరు పదవి వస్తుందని చెప్పుకుంటూ, స్వంత పార్టీ కార్యకర్తలను మోసం చేస్తున్నారు.
అదే విధంగా ఆత్మకూరు, కావలి, సూళ్లూరుపేటలలో వైఎస్సార్‌సీపీకి అధిక స్థానాలు ఉన్నాయి. గూడూరులో రెండు పార్టీలకు సమానంగా 16 మంది చొప్పున కౌన్సిలర్లు చొప్పున ఉండగా, చైర్మన్ అభ్యర్థిని నిర్ణయించే ఒకే స్వతంత్ర అభ్యర్థిని తమ వైపు తిప్పుకోవాలని శత విధాలా ప్రయత్నిస్తున్నారు.
దీనికి గాను ఇంత కాలం మౌనంగా ఉన్న సోమిరెడ్డి అకస్మాత్తుగా తెరమీదకు వచ్చి, వైఎస్సార్‌సీపీకి విప్ జారీ చేసే అవకాశం లేదని పేర్కొంటూ కౌన్సిలర్లను తప్పుదోవ పట్టించేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఆయన తన పదవి కోసం చేస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన ముందు నాయకులుగా ఎదిగిన వారు మంత్రుల స్థానంలో ఉండగా, తాను ఎమ్మెల్సీ అయినా దక్కించుకోవాలనే ప్రయత్నంతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు సమాచారం.
సోమిరెడ్డి నివాసంలో మంత్రుల మంతనాలు
నెల్లూరు రూరల్: మండలంలోని అల్లీపురంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నివాసంలో మంగళవారం రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలు సోమిరెడ్డితో సుదీర్ఘ మంతనాలు కొనసాగించారు. సాయంత్రం ఐదు గంటల నుంచి వివిధ అంశాలపై చర్చలు సాగించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, నగరపాలకసంస్థను చేజిక్కించుకునేందుకు ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. సోమిరెడ్డి నివాసం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తల హడావుడి నెలకొంది. ఇతర పార్టీల మద్దతుతో ఎన్నికల్లో గెలుపొందిన వారిని ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకునే అంశాలపై వీరు దృష్టిసారించినట్లు తెలుస్తోంది.