
మొండి చెయ్యేనా?
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో చేదు ఫలితాలు రావడంతో మంత్రి పదవుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా పార్టీ నేతలకు మొండి చెయ్యి చూపేందుకు సిద్ధమయ్యారు. శనివారం జరగబోయే మంత్రివర్గ పదవీ ప్రమాణ స్వీకారంలో జిల్లా నుంచి నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణకు మాత్రమే అవకాశం కల్పించి మ.మ. అనిపిస్తారనే ప్రచారం సాగుతోంది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఎన్నికల్లో తలపడి నెగ్గిన ముగ్గురు ఎమ్మెల్యేలుండగా వీరెవరినీ కాదని జిల్లా రాజకీయాలతో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సంబంధం లేని వ్యక్తిని మంత్రిని చేసే ఆలోచనపై తెలుగుతమ్ముళ్లు లోలోన రగిలిపోతున్నారు. జిల్లాలోని 10 శాసనసభ స్థానాల్లో కనీసం ఒక్క సీటైనా అధికంగా గెలుచుకుని తమ ఆధిపత్యం చాటుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు. ఈ లక్ష్యంతోనే ఆయన పార్టీలో సీనియర్లను సైతం పక్కనపెట్టి విమర్శలు, అసంతృప్తులు ఎదురైనా ఆర్థికంగా బలవ ంతులైన వ్యక్తులకే టికెట్లు కేటాయించారు. అయితే జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పూర్తి ఆధిక్యతను చాటింది. ఏడు శాసనసభ, రెండు లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీ విజయపతాకం ఎగురవేసింది. జిల్లా పార్టీలో మహామహులనుకునే వారంతా ఓటమి చవిచూశారు. ఈ ఫలితాలు చంద్రబాబును తీవ్ర అసంతృప్తికి గురి చేసినట్లు సమాచారం. ఓట్ల లెక్కింపు తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ (వెంకటగిరి), పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి (కోవూరు), బొల్లినేని రామారావు( ఉదయగిరి) మంత్రి వర్గంలో తమకు లక్కు తగలవచ్చని ఆశ పడ్డారు. వీరిలో బొల్లినేని పెద్దగా ప్రయత్నించక పోయినప్పటికీ మిగిలి న ఇద్దరు మంత్రి వర్గంలో బెర్త్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలే చేశారు. జిల్లా పార్టీలో చక్రం తిప్పగలరని భావిస్తున్న మాజీ మంత్రులు ఆదాల ప్రభాకరరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ద్వారా లాబీయింగ్ చేయిం చారు.
వీరి బాధలు వీరు పడుతున్న తరుణంలోనే అనూహ్యంగా నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ పేరు తెర మీదకు వచ్చింది. ఆయన్ను రాజ్యసభకు పంపుతారని తొలుత భావించినా, ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నట్లు ప్రచారం జరగడం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ముందుగా మంత్రి అయ్యి ఆ తర్వాత శాసనమండలికి ఎంపిక కావాలని ఆశ పడిన నేతలకు గొంతులో వెలక్కాయ పడినట్లయింది. జిల్లాకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కితే ఇక ఐదేళ్లూ తమకు మంత్రి పదవి ఎండమావేననే ఆందోళన వారిలో వ్యక్తమైంది.
దీంతో కొందరు నేతలు చంద్రబాబును కలిసి జిల్లా రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని నారాయణకు మంత్రి పదవి ఇవ్వవద్దని కోరారు. వీరి అభ్యర్థనపై చంద్రబాబు ఏ మాత్రం స్పందించలేదు. దీన్ని బట్టే ఆ నాయకులకు నారాయణకు పదవి ఇస్తున్న విషయం అర్థమైంది. పార్టీ కోసం శ్రమించి పనిచేసిన వారిని పక్కన పెట్టి గెలుపోటముల ఆధారంగా మంత్రి పదవి ఇవ్వడంపై జిల్లా నేతలు మండి పడుతున్నారు. అయితే ఇప్పుడు తమ అసంతృప్తి గానం వినిపించడం భావ్యం కాదనే ఆలోచనతో వారు మనసులోనే బాధపడుతున్నారు.