
సాక్షి, ముంబై: ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ చెక్కిన చారిత్రక దృశ్య కావ్యం ‘పద్మావతి’ సినిమా వివాదాలతోనే కాదు రోజుకో విశేషంతోనూ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల విడుదలైన పద్మావతి తొలిసాంగ్ గూమర్‌లో దీపిక పదుకోన్ సంప్రదాయ రాజ్‌పుటానా డ్యాన్స్‌తో ఆకట్టుకోగా, అందరి చూపూ ఆమె ధరించిన 30 కిలోల బరువున్న లెహెంగాపై నిలిచింది. ఇంత బరువున్న లెహెంగాను మోస్తూ ఆమె 66 సార్లు గుండ్రంగా తిరిగినట్టు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక రింపుల్ అండ్ హర్‌ప్రీత్ నరులా డిజైన్ చేసిన ఈ కళ్లుచెదిరే లెహెంగా ధర రూ. 30 లక్షల పైనే ఉంటుందని పింక్‌విల్లా నివేదిక పేర్కొంది.
ఈ పాట చిత్రీకరణలో తన అనుభవాలను దీపికా ట్వీట్ చేస్తూ గూమర్ పాట చాలా సంక్లిష్టమైనదే అయినా తానిప్పటివరకూ చేసిన పాటల్లో పూర్తి సంతృప్తినిచ్చిన పాటగా చెప్పుకొచ్చారు. సంప్రదాయ నృత్యంతో రాణి పద్మినీ వెండితెరపై చేసే విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయని బాలీవుడ్ భామ దీపిక మూవీపై ఆసక్తిని పెంచారు.
ఈ పాటతోనే సినిమా షూటింగ్ మొదలైందని, ఆ రోజును తానెప్పటికీ మరువలేనని అప్పటి సంగతులను గుర్తుచేసుకున్నారు. ఆ దుస్తులు వేసుకోగానే తనలోకి పద్మావతి ప్రవేశించిన అనుభూతి కలిగిందని, దాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. పద్మావతి డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment