18 అక్టోబర్ 1989 ఎరిక్‌ను ఇంటికి పంపించారు!
ఆ నేడు
ఎరిక్ హోనేకర్ (1912-1994) తూర్పు జర్మనీ కమ్యూనిస్టు నాయకుడు. ‘సోషలిస్టు యూనిటీ పార్టీ’ ప్రధాన కార్యదర్శి. 1971 నుండి 1989 వరకు ఆయన 18 ఏళ్ల పాటు జర్మన్ డె మొక్రటిక్ రిపబ్లిక్‌కి నాయకుడిగా ఉన్నారు. ఎరిక్ రాజకీయ విధానాల వల్ల తూర్పు జర్మనీ పౌరుల్లో అసంతృప్తి వెల్లువెత్తి ఆయన పదవికి ఎసరు తెచ్చింది. లక్షా 20 వేల మంది నిరసనకారులు తూర్పు జర్మనీలోని కీలక పట్టణమైన లీప్జింగ్‌లో పెద్ద ఎత్తున ప్రదర్శన జరిపారు.
ఎరిక్ అవకతవకలపై ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. అప్పటికే వేలాది మంది ఉద్యోగ అవకాశాల కోసం పొరుగు దేశాలకు తరలివెళ్లారు. ఈ పరిణామాల పర్యవసానంగా ఎరిక్ 1989 అక్టోబర్ 18న పదవీచ్యుతులయ్యారు. అయితే ఆయన ‘ఆరోగ్య కారణాలతో’ పదివి నుంచి వైదొలగవలసి వచ్చింద ని అధికారిక ప్రకటన వెలువడింది. అంతకుముందు సోవియెట్ యూనియన్ అధ్యక్షుడు మిఖాయెల్ గోర్బచెవ్ తూర్పు జర్మనీలో పర్యటించి, ఎరిక్‌కు వ్యతిరేకంగా స్థానిక పౌరులను ఉద్దేశించి ప్రసంగించడం కూడా ఎరిక్ రాజకీయ పతనానికి ఒక కారణమని చెబుతారు.