మిస్టర్ రవి... దిసీజ్ టూ ఎర్లీ యూ నో.. | A troubled summer | Sakshi
Sakshi News home page

మిస్టర్ రవి... దిసీజ్ టూ ఎర్లీ యూ నో..

Published Tue, Feb 23 2016 4:55 PM | Last Updated on Sun, Sep 3 2017 6:11 PM

మిస్టర్ రవి... దిసీజ్ టూ ఎర్లీ యూ నో..

మిస్టర్ రవి... దిసీజ్ టూ ఎర్లీ యూ నో..

కొన్న రగ్గులను సరిగ్గా వాడనే లేదు. పెట్టెల నుంచి దించిన స్వెటర్లను సరిగా తొడగనే లేదు. తెల్లవారుజాము చలిగాలులలో పూర్తిగా తడవనే లేదు. శీతలం వల్ల ముసుగు తన్ని చెప్పాపెట్టకుండా ఆఫీసుకు ఒక రోజు ఎగనామం పెట్టనేలేదు... ఇన్నేల... తొందరపడి ఒక కోయిలేదీ ముందే కూయనేలేదు గానీ అప్పుడే శిశిరం ముగిసిపోయింది. వేసవి దూసుకొచ్చింది. ‘శీతవేళ రానీయకు... శిశిరానికి చోటీయకు...’ అన్న కవి మాటలు ఈ సీజన్‌లో నిజమయ్యేలా ఉన్నాయి. నిన్న మొన్న వేసుకున్న చలిమంటలు చల్లారక ముందే ముచ్చెమటలు పోసేస్తున్నాయి. ఎన్నడూ లేనిది- కని విని ఎరుగనిది- మంచు కురవాల్సిన మాఘమాసం మండిపడుతోంది.
    
శివరాత్రి నాటితో చలి ‘శివ శివా’ అంటూ పారిపోతుందట. ఈసారి మాత్రం పక్షం రోజుల ముందే పరారైపోవడంతో ఎండలకు అందరూ ‘హర హరా’ అనాల్సి వస్తోంది. అయినా హరుడికి ఈ ఎండ బాధ లేదు. హాయిగా హిమగిరులలో వసిస్తాడు. పార్వతీ దేవితో ప్రణయోల్లాసంతో విహరిస్తాడు. కాని ఇక్కడ మాత్రం అప్పుడే కొత్త బాటిళ్లు కొనుక్కుని నీళ్లు నింపి ఫ్రిజ్జుల్లో పెట్టాల్సి వస్తోంది. నల్ల కుండల కోసం పరిగెత్తాల్సి వస్తోంది. ఎర్ర కూజాలకు క్యూ... అదిగో. మిస్టర్ రవికుమార్... దిసీజ్ టూ ఎర్లీ యూ నో.
    
అసలు మాఘమాసం అంటే ఏంటి? మాఘమాసమే. చలిలో పెళ్లి. పెళ్లిలో చలి. చలిచలి పెళ్లిళ్లలో కొత్త పెళ్లికొడుకూ పెళ్లికూతుళ్ల గిలిగిలి. ఒక సినీ జ్ఞాపకం గుర్తుకొస్తోంది. చాలా ఏళ్ల కిందట ‘అమ్మ మాట’ సినిమాకు పాటల రికార్డింగ్ జరుగుతోంది. ఐటమ్ సాంగ్ ఒకటి తయారు చేయాలి. రాయాల్సింది సి.నారాయణ రెడ్డి. బాణీ కట్టాల్సింది రమేశ్‌నాయుడు. ఇద్దరూ సిట్టింగ్‌లో కూచున్నారు. ఎంతకీ పాట రెడీ కావడం లేదు. సరే... మీరు పల్లవి రాయండి అని రమేశ్ నాయుడు అలా గాలి పీల్చుకోవడానికి వెళ్లారు. సినారెకు పల్లవి తట్టలేదు. కాని పల్లవిలో ఏ యే విషయాలు ఉండాలో వాటినే ఒక రఫ్ నోట్స్‌గా రాసుకున్నారు. భోజనానికి టైమ్ అయితే ఆ పేపరూ ప్యాడ్ అక్కడే పడేసి వెళ్లిపోయారు. తిరిగి వచ్చేసరికి రమేశ్ నాయుడు హుషారుగా ఉన్నారు. రండి... పాట రెడీ అన్నారు. వెంటనే వినిపించారు కూడా- మాయదారి సిన్నోడు... నా మనసే లాగేసిండు... లగ్గమెప్పుడ్రా మావా అంటే మాఘమాసం వెళ్లే దాకా మంచి రోజు లేదన్నాడే
 
ఆగేదెట్టాగా... అందాక యేగేదెట్టాగా...
 సినారె ఆశ్చర్యపోయారు. అయ్యో... ఇది పల్లవి కాదండి రఫ్ నోట్స్ అన్నారు. కాని రమేశ్ నాయుడు దానినే పల్లవి కట్టిన తీరు చూసి మురిసిపోయారు. అదే వరుసలో పాట రాసేశారు. ఎల్ ఆర్ ఈశ్వరి పాడేసింది. పాట సూపర్ హిట్టయ్యింది. మాఘమాసం మహిమ అది. దక్షిణాది వారికి మంచి సీజను. కనుకనే పెళ్లిళ్లకు ఇది రీజను. బంధువులంతా తరలి వస్తారు. నిలిచే బట్టలతో కుదురుగా నిలబడతారు. వంటలకు సౌకర్యం. సహబంతి భోజనాలలో ఆహ్లాదం. ఈ తాజామార్పు... ఈ ఎండల రాకడ... ఇటు ఇష్షు అటు ఉష్షు... చెమట కారే పెళ్లి జంటల ఫొటోకు ఫొటోషాప్ రిపేర్లు తప్పవు. తండ్రీ... సూర్య నారాయణ్... రథసప్తమి వెళ్లి వారం రోజులైనా కాలేదే? అప్పుడే ఏమిటి నీ స్పీడు? ఏమిటీ ఈ ఎండల ఫీడు. కొత్త రాజధాని అమరావతిని చూసి కాస్త నేర్చుకోవయ్యా. జస్ట్ కూల్ డౌన్. ప్లీజ్ స్లో డౌన్.
    
శాస్త్రవేత్తలు ముందే చెప్పారు. ట్వంటీ ట్వంటీ మేచ్‌లా సూర్యుడు స్పీడుగా రన్లు కొడతాడని ముందే హెచ్చరించారు. అల్లంత ఎత్తున ఆకాశంలో ఓజోన్ పొరకు చిల్లు పడిందట. అది నానాటికీ విస్తరిస్తోందట. దాని ప్రభావం వల్లే సూర్యకిరణాలు నేలపైకి చురకత్తుల్లా దూసుకొస్తున్నాయట. ఇదొక్కటే కాదు. ఈసారి ఎల్ నినో పరిస్థితులూ ఉంటాయట. దీని దెబ్బకు సముద్రాలు సైతం వేడెక్కడం... వాణిజ్య పవనాలు బలహీనపడి దారి మళ్లడం... ఎడారుల్లో వడగాలులు చెలరేగడం... సామాన్యుడు మలమలా మాడటం... ఈ పరిస్థితి నెలల తరబడి కొనసాగుతుందట. ఇప్పుడే హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు నలభైకి చేరువగా నమోదవుతున్నాయి. పార్కుల్లో లాన్లు మనిషి కాలు పడితే భగ్గుమంటున్నాయి. ఇది ఫిబ్రవరి స్పెషల్. ఇదే ఇలా ఉంటే మే నెల ఇచ్చే లస్సీ ఎంత వెచ్చగా ఉంటుందో... రోహిణీ కార్తె ఎంత రఫ్పాడిస్తుందో. మనుషులే కాదు దెయ్యాలు కూడా పరార్. మరి హారర్ సినిమాలు ఎవరిని పెట్టి తీస్తారో.
    
అసలు మనం చదివింది ఏమిటి? ఏడాదికి పన్నెండు నెలలుండును... ఆరు రుతువులుండును... మూడు కాలములుండును... కాని సీజన్ గమనిస్తే అంతా కన్ఫ్యూజను. వసంతం, గ్రీష్మం, వర్షం, శరత్తు, హేమంతం, శిశిరం...  జామ్ అయిపోయాయి. పోనీ ఇంగ్లిష్‌వాడి లెక్కలో చూద్దామంటే స్ప్రింగ్, సమ్మర్, ఆటమ్, వింటర్... అవి కిచ్‌డీ అయిపోయాయి. ప్రకృతి విడియో ప్లేయర్ ఖరాబైపోయింది. ఒక సీడీకి బదులు మరో సీడీ ప్లే అవుతోంది. అసలే ఈసారి వానలు అంతంతమాత్రం. చెరువుల కడుపుల్లో నీళ్లు అంతంత మాత్రం. నీళ్ల బెడద ఎలా అనుకుంటూ ఉంటే మావయ్యా... వచ్చేశా... అన్నట్టు సూరిబాబు కూడా ఇప్పుడే తయారైపోవాలా? ఇప్పుడే మార్కెట్లో మామిడి కాయలూ మల్లెపూలూ ప్రత్యక్షమైతే ఇది వరమా... శాపమా.. చెప్పండి మిలార్డ్.
    
చూడగా చూడగా భవిష్యత్తులో రెండు రుతువులే మిగులుతాయేమో అనిపిస్తోంది. సమ్మర్, సివియర్ సమ్మర్... అనగా గ్రీష్మము, తీవ్ర గ్రీష్మము. ధర్మం నాలుగు పాదాలా నడిచే సత్తెకాలంలో నెలకు మూడు వానలు క్రమం తప్పకుండా పడేవట! ఈ ఎండలని చూస్తోంటే ఇప్పుడు ధర్మం ఒంటిపాదంతోనైనా నడుస్తోందా అనే సందేహం చాలామందికి వస్తోంది. కాలం కలిసొచ్చే పరిస్థితులే కనిపించడం లేదు. కర్మకాలితే కాలం ఇలాగే తగలడుతుందని ఆధ్యాత్మికవాదులు నెత్తికొట్టుకుని కర్మసిద్ధాంతాన్ని నిట్టూరుస్తారు. కర్మ ఎందుకు కాలింది..? ఎలా కాలింది..? అంటే రోజువారీ వార్తల నుంచి శతకోటి ఉదాహరణలను చూపిస్తారు.


 ఇక కొత్త రైమ్‌కు ట్యూన్ కట్టాల్సిందే.
 సన్... సన్... ప్లీజ్ గో అవే.

 - కిశోర్ - దాసు
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement