అమ్మమ్మ స్కూల్‌కెళ్తోంది | The Aajibaichi Shala School For Grandmother | Sakshi
Sakshi News home page

అమ్మమ్మ స్కూల్‌కెళ్తోంది

Published Tue, Dec 3 2019 12:21 AM | Last Updated on Tue, Dec 3 2019 12:21 AM

The Aajibaichi Shala School For Grandmother - Sakshi

క్లాస్ రూమ్లో వయోజన స్త్రీలు

డ్వాక్రా గ్రూప్‌లో లోన్‌ తీసుకుంది సుమతి. సంతకం పెట్టడానికి ముందుకు రావట్లేదు. ‘‘ఏంటమ్మా డబ్బు తీసుకుంటావ్‌గానీ సంతకం పెట్టవా?’’ పేపర్‌ను ఆమె ముందు పెడ్తూ విసుక్కున్నాడు బ్యాంక్‌ ఏజెంట్‌. ‘‘అయ్యో .. ఆమెకు  చదువురాదు సర్‌.. వేలిముద్ర వేస్తుంది’’ అనునయిస్తున్నట్టు చెప్పింది ఆ డ్వాక్రా గ్రూప్‌ లీడర్‌. ‘‘ఆ ముక్క ముందే చెప్తే పోయేది కదా.. టేమ్‌వేస్ట్‌ కాకపోతే’’ అంటూ స్టాంప్‌ప్యాడ్‌ సుమతి ముందుకు తోశాడు. అవమానంతో ఆమె మొహం ఎర్రబడింది. సిగ్గుతో తలవంచుకొనే వేలిముద్ర వేసింది సుమతి.

‘‘రాజూ.. నీ క్లాస్‌మెంట్‌ నరేందర్‌ ఉండేవాడు చూడు.. వాళ్లమ్మ కనిపించిందిరా చాన్నాళ్ల తర్వాత’’ ఉత్సాహంగా చెప్పింది కొడుకుతో అమృత. ‘‘క్లాస్‌మెంట్‌ కాదమ్మా.. క్లాస్‌మేట్‌’’ సరిదిద్దాడు కొడుకు. చిన్నబుచ్చుకున్న అమ్మ ‘‘అదేలే. స్వారీ’’ అంది తప్పు పలికినందుకు.  కిసుక్కున నవ్వాడు రాజు. ‘‘మళ్లీ ఏమైంది స్వారీ చెప్పాగా’’ కొపంగా అడిగింది అమ్మ. ‘‘స్వారీ కాదమ్మా.. సారీ’’ సరిదిద్దాడు అబ్బాయి. కొడుకు దగర అమ్మ ఇన్‌సల్ట్‌ అయినట్టు భావించింది అమ్మ.

అరగంట నుంచి టేబుల్‌ సొరుగులోని కాయితాలన్నిటినీ కిందపడేసి వాటిల్లోంచి ఏదో వెదుకుతున్న కోడలిని అడిగింది అత్తగారు ‘‘దేని కోసం వెదుకుతున్నావమ్మా?’’ అంటూ! ‘‘అబ్బా.. మీకేం తెలుసని చెప్పాలి?’’ విసుక్కుంది కోడలు. చివుక్కుమంది అత్తగారి మనసు. వీళ్లే కాదు చాలా ఇళ్లల్లో చాలా మంది పెద్దవాళ్లకు ఈ భంగపాటు పరిపాటే. ‘‘నీకేం తెలీదులే.. నువ్వూరుకో’’ అనే మాటలూ సర్వసాధారణమే! ఇలాంటి మాటలు, అవమానాలు వినదల్చుకోలేదు మహారాష్ట్ర, థాణె జిల్లా, ఫంగాణె గ్రామంలోని అమ్మమ్మలు, నానమ్మలు. నిరక్షరాస్యులుగా, అంగుఠా ఛాప్‌లుగా ఉండదల్చుకోలేదు. వాళ్లకోసమే ప్రారంభమైన బడికి వెళ్లడం మొదలుపెట్టారు.

బ్యాగులతో సూల్‌కెళ్తూ...

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున.. ఆ బడిపేరు ‘‘ఆజిబైచి శాల’’. దేశంలోనే మొట్టమొదటి వయోజన మహిళా పాఠశాల. యాభై ఏళ్లు నిండిన స్త్రీలను అక్షరాస్యులను చేయాలనే ఉద్దేశంతో రిటైర్డ్‌ జిల్లాపరిషత్‌ పాఠశాల ఉపాధ్యాయుడు యోగేందర్‌ బంగర్‌ దీన్ని స్థాపించాడు. స్థానికంగా ఉన్న మోతీరామ్‌ దలాల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సహకారం, భాగస్వామ్యంతో 2016, మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున  స్టార్ట్‌ అయిందీ స్కూల్‌. నేటికి ఆ బడిలో మొత్తం 35 మంది వయోజన విద్యార్థినులు చదువుకుంటున్నారు.

ఈ బడికి సాధారణ స్కూళ్లకున్నట్లే కరిక్యులమ్‌ ఉంది. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బడివేళలు. ప్రార్థనతో బడి మొదలవుతుంది. పాఠ్యపుస్తకాల్లోని పాఠాలు కాక గేమ్స్, గార్డెనింగ్, పెయింటింగ్‌ లాంటివీ పాఠ్యాంశాల్లో భాగాలు. ఇవికాక కాలేజ్‌ పిల్లలు, ఇతర స్కూల్‌పిల్లలు వచ్చి వీళ్లకు కంప్యూటర్స్‌ వంటివీ నేర్పించి వెళ్తూంటారట. ఈ పెద్దవాళ్లూ ఆ పిల్లలకు తమ జీవన పాఠాలు, అనుభవాల గురించి చెప్తూంటారట. వారానికి ఒకసారో.. పదిహేను రోజులకు ఒకసారో.. లేదంటే స్కూళ్లు, కాలేజీలకు సెలవులున్నప్పుడో.. జాతీయ పండగలప్పుడో ఇలాంటి అనుభవ పాఠాలు, వ్యూస్‌ ఎక్స్ఛేంజ్‌ సెషన్స్‌ ఉంటాయట. ‘‘దీనివల్ల ఈ జనరేషన్‌ పోకడలను పెద్దవాళ్లు.. వాళ్ల ఎక్స్‌పీరియెన్స్‌ను చిన్నవాళ్లు తెలుసుకునే వీలుంటోంది.

ఈ సెషన్స్‌తో పెద్దవాళ్ల కన్నా చిన్నవాళ్లకే ఎక్కువ ఉపయోగంగా ఉంది. పెద్దవాళ్లు తాము చదువుకోగలుగుతున్నందుకు కాన్ఫిడెంట్‌గా కనపడుతున్నారు. కాని పిల్లలు వీళ్లతో కలుస్తూ మాట్లాడుతూ.. వాళ్ల కష్టసుఖాలను తెలుసుకుంటూండడం వల్ల వాళ్లలో ఒకరకమైన ధైర్యం, మానసిక స్థయిర్యం పెరుగుతోంది. చాలామంది అమ్మాయిల్లో పిరికితనం, కంగారు పోయి.. స్థిరంగా ఆలోచించడం మొదలైందట. చిన్న విషయాలకే ఆందోళనపడ్డమూ తగ్గిందట’’ అంటారు ఈ స్కూల్‌ వ్యస్థాపకులు యోగేంద్ర బంగర్‌. అరవై ఏళ్ల నుంచి తొంభైఏళ్ల వయస్సున్న అమ్మమ్మలు, నానమ్మలు గులాబీరంగు చీర యూనిఫామ్, బ్యాగ్‌తో చాలా శ్రద్ధగా ఈ బడికి వెళ్తూంటారు. ‘‘సంతకం పెట్టడం వస్తే చాలు అనుకున్న మేము పుస్తకాలు చదవడం, ఫోన్‌ చూసుకోవడం, నంబర్లు ఫీడ్‌ చేసుకోవడం.. వంటివీ నేర్చుకోగలిగాం. కంప్యూటర్‌ గురించీ తెలుసుకున్నాం’’ అంటారు సంతోషంగా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement