
మగాడు ఎదుర్కొన్న తొలి పరీక్ష
పరీక్షలు ఆది నుంచి ఉన్నాయి. ఇవాళ స్కూలు పరీక్షలు కాలేజీ పరీక్షలు పరీక్షలుగా చలామణి అవుతున్నాయి.
పరీక్షలు ఆది నుంచి ఉన్నాయి. ఇవాళ స్కూలు పరీక్షలు కాలేజీ పరీక్షలు పరీక్షలుగా చలామణి అవుతున్నాయి గానీ వేల సంవత్సరాలుగా ఇవి మనిషిని శోధిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇవి మగాడికి పరీక్ష పెడుతూనే ఉన్నాయి.
ఆడమ్ మొదటి పరీక్షను ఎదుర్కొన్నాడు. మాయాసర్పం ఫలాన్ని తినమని ఈవ్‌ను ఉసిగొల్పింది. ఈవ్ ఆ ఫలాన్ని పంచుకోమని ఆడమ్‌ని కోరింది. పెద్ద పరీక్ష అది. దేవుడు అప్పటికే కొన్ని నిషేధాజ్ఞలు ఇచ్చి ఉన్నాడని, వాటిని శిరసావహించాలని ఆడమ్‌కు తెలుసు. కాని తెలిసి తెలిసి తప్పు చేశాడు. స్వర్గలోకం నుంచి భూలోకానికి పతనమయ్యాడు. గమనించండి. అది ‘ఫాల్ ఆఫ్ మేన్’ అయ్యింది తప్ప ‘ఫాల్ ఆఫ్ ఉమన్’ కాలేదు. మగాడు ఎదుర్కొన్న తొలి పరీక్ష ఫలితం అది. దానిని ఇప్పటి వరకూ అనుభవిస్తూనే ఉన్నాడు.
ఇచ్చినమాటకు కట్టుబడాల్సి రావడం దశరథుడు ఎదుర్కొన్న అతి పెద్ద పరీక్ష. కన్నకొడుకును వనవాసం పంపడమా? కాని పంపే తీరాల్సి వచ్చింది. పితృవాక్య పరిపాలన అనే పరీక్షకు రాముడు నిలబడాల్సి వచ్చింది. ‘నేను వెళ్లను... నాకు రాజ్యం ఇవ్వండి’ అనంటే చేయగలిగింది ఏముంది? కాని జగత్తంతా చూస్తోంది శ్రీరామచంద్ర ప్రభువును. తండ్రి మాటను శిరసా వహిస్తాడా... లేదంటే భంగం కలిగిస్తాడా? శిరసావహించాడు. అందుకే ఒకే మాట.. ఒకే బాణం అనే పేరు గడించాడు. ఆ వంశంవాడే సత్యహరిశ్చంద్రుడు. మాట ఇచ్చాడు. పరీక్షకు నిలబడ్డాడు. రాజ్యం, భోగం, భార్యా పిల్లలు అన్నీ పోయినా సరే పరీక్ష తప్ప లేదు. పాసయ్యాడు. మామూలు పాస్ కాదు వేల సంవత్సరాలు నిలబడే ఉత్తీర్ణత.
‘తండ్రీ... నీవే దైవం’ అని హిరణ్యకశిపుడితో ఒక్క మాట చెప్పాలి. కాని తాను నమ్మిందానికే కట్టుబడ్డాడు ప్రహ్లాదుడు. నారాయణుడినే తన గుండెల్లో అభీష్టించుకున్నాడు. ఫలితం? అన్నీ చావు పరీక్షలే. తండ్రి పెట్టిన ఆ పరీక్షలన్నీ భరించాడు. సహించాడు. చివరకు జవాబుగా నరసింహుడినే సాక్షాత్కరింపజేశాడు.
సత్యం పలికిన ప్రతి ప్రవక్తా లోకం పెట్టి కఠిన పరీక్షలన్నింటికీ నిలబడ్డారు. దైవకుమారుడు జీసెస్ కూడా అనేక పరీక్షలను ఎదుర్కొన్నాడు. దేశద్రోహి, మతద్రోహి అనే నిందలను మోశాడు. తను నమ్మిన సిద్ధాంతం కోసం శిలువను మోశాడు. మానవాళిని పాపవిముక్తులను చేయడం కోసం తన పవిత్ర రక్తాన్ని కూడా చిందించాడు. ఇబ్రాహీమ్ ప్రవక్త, ఇస్మాయీల్, ముహమ్మద్ ప్రవక్త వంటి వారు సైతం దైవం విధించిన రకరకాల పరీక్షలకు అత్యంత విధేయంగా తలవంచారు. భక్త కన్నప్ప, భక్త సిరియాళుడు, మంజునాథుడు, చిరుతొండనంబి వంటి సామాన్యభక్తుల నుంచి రంతిదేవుడు, శిబిచక్రవర్తి, నలమహారాజు, విక్రమార్కుడు, బలి, ధర్మరాజు వంటి చక్రవర్తులు కూడా కాలం, దైవం పెట్టిన ఎన్నో విషమ పరీక్షలని ఎదుర్కొనవలసి వచ్చింది.
గాంధీ మహాత్ముడైతే తనను పరీక్షించే అవకాశం ఎవరికీ ఇవ్వలేదు. తనను తానే పరీక్షించుకున్నాడు. అందులో నెగ్గాడు కూడా.
విశ్వామిత్రుడు, పరశురాముడు, దూర్వాసుడు, వాల్మీకి, అష్టావక్రుడు, నారదుడు వంటి మహామునులకూ పరీక్షలు తప్పలేదు.
వీరిదేముంది సాక్షాత్తూ మృత్యుదేవుడైన యముడు కూడా పరీక్షలను ఎదుర్కొన్నాడు... అదీ సావిత్రి వంటి సామాన్య స్త్రీల నుంచి... మార్కండేయుడి వంటి మునిబాలకుల నుంచి! చివరాఖరుకు ఆంజనేయస్వామి, వినాయకుడు, కుమారస్వామి వంటి వారికీ మినహాయింపు దొరకలేదు.
కాని వాళ్లు ప్రలోభాలకు లొంగలేదు. బెదిరింపులకు చెదరలేదు. నిలబడ్డారు. వీరంతా ఎందుకు... విష్ణుమూర్తి అంతటివాడికీ పరీక్ష తప్పలేదు. భృగుమహర్షి ఈడ్చి పెట్టి తన ఎడమ కాలితో వక్షస్థలం మీద తంతే, నవ్వుతూ భరించాడు. అదేమని అడగలేదని ప్రియసతి అలిగి తనని విడిచి వెళ్లిపోతే వెదుక్కుంటూ భూలోకానికి వచ్చి కఠోర తపస్సు చేశాడు. అప్పటికీ కూడా ఆ మహాతల్లి ఆయన మీద జాలిచూపలేదు. తన అంశే అయిన పద్మావతమ్మని కట్టుకున్నా కానీ, శిలవైపొమ్మని శపించేసరికి చేసేది లేక ఏడుకొండల మీద వెంకటేశ్వరుడిగా వెలిశాడు.
భూమి గుండ్రంగా ఉంది అన్నవాడు మగాడే. వాణ్ణి లోకం చంపాలనుకుంటుంది. అయినా నిలబడతాడు. గ్రహాల ఉనికిని చెప్పిన వాడు మగాడే. వాణ్ణీ లోకం తరిమికొట్టాలనుకుంటుంది. అయినా నిలబడ్డాడు. సముద్రానికి చివర అగాథం లేదని, అందమైన భూభాగం ఉందని చెప్పినవాడు మగాడే. అతణ్ణి లోకం ఏమిటి సొంత నావికులే నమ్మలేదు. అయినా నిలబడ్డాడు. కులం ఒక మూఢత్వం అన్న పూలే పరీక్షలకు నిలబడ్డాడు. దళితులూ మనుషులే అన్న అంబేద్కరూ పరీక్షలకు నిలబడ్డాడు. పరీక్షలు ఎదుర్కొనాల్సింది మగవాళ్లే. వాళ్లు నిలబడక తప్పదు.
ఇప్పుడు కూడా మగపిల్లవాడికి పుట్టినప్పటి నుంచీ పరీక్షలే. తొందరగా మాటలు వచ్చేయాలి. తొందరగా స్కూల్లో చేరిపోవాలి. తొందరగా పాసైపోవాలి. తొందరగా బీటెక్ చేసేయాలి. తొందరగా ఎం.ఎస్ చేయడానికి అమెరికా వెళ్లిపోవాలి. తొందరగా పెళ్లి చేసుకోవాలి. తొందరగా పిల్లల్ని కనాలి. తొందరగా వాళ్లను సరిగ్గా పెంచి చదివించి పెళ్లి చేసి తిరిగి మనవలని కూడా దారి పెట్టి... ఇందులో ఏ పరీక్ష తప్పినా సంఘం ఊరుకోదు. నింద వేస్తుంది. చేతగానివాడు అంటుంది. ఈ పరీక్షలకు నిలబడకపోతే అనుమానంగా చూస్తుంది.
- సాక్షి ఫ్యామిలీ