మీకు తెలుసా? కొందరిలో కొన్ని పదార్థాలతో వచ్చే అలర్జీలు మనకు చాలా విచిత్రంగా అనిపించవచ్చు. ఇందుకు ఓ ఉదాహరణ అరటి, కీవీ పండ్ల వల్ల వచ్చే అలర్జీ. మనకు చిత్రంగా అనిపించినా ఇది వాస్తవం.
సాధారణంగా కొందరిలో రబ్బర్ ఉత్పాదనలనుంచి అలర్జీ వస్తుంటుంది. ఉదాహరణకు చేతికి వేసుకునే రబ్బర్ గ్లౌవ్స్, షూస్, మాస్కులు, స్లిప్పర్ల వంటి ఎన్నెన్నో వస్తువులతో ఈ తరహా అలర్జీ కనిపిస్తుంది. దీని కారణంగా చర్మం ఎర్రబారడం, మేనిపై చిన్న చిన్న గుల్లలు, దద్దుర్లు, ర్యాష్ రావడం మొదలుకొని, అవి చాలా తీవ్రంగానూ చర్మంపై పగుళ్ల రూపంలో కనిపించేలా ఈ అలర్జిక్ రియాక్షన్ తీవ్రత ఉంటుంది. మరికొందరిలో రబ్బర్‌తో వచ్చే అలర్జీ రియాక్షన్ కనిపించగానే చేతులు లేదా కాళ్లు నల్లబారడం లేదా రంగుమారడం జరుగుతుంది. ఈ రియాక్షన్‌ను అది వచ్చిన ప్రాంతాన్ని బట్టి దాన్ని ‘బ్లాక్ రబ్బర్ హ్యాండ్’ లేదా ‘బ్లాక్ రబ్బర్ ఫీట్’ అని అంటుంటారు.
ఇలా రబ్బర్‌తో అలర్జీ ఉన్న కొంతమందిలో కాస్తంత అరుదుగానైనా అరటి, కీవీ పండ్ల వల్ల కూడా అలర్జీ కనిపించవచ్చు. అరటి, కివీ పండ్ల చెట్లు కూడా ఇంచుమించుగా రబ్బర్ మొక్క కుటుంబానికి చాలా దగ్గరి జాతివి కావడమే ఇందుకు కారణం. ఇలా అటు రబ్బర్‌కూ... ఇటు ఈ అరటి, కీవీ పండ్లకూ అలర్జీ కలిగి ఉండటాన్ని ‘లాటెక్స్–ఫ్రూట్ సిండ్రోమ్’ అని వ్యవహరిస్తారు. కేవలం ఆ కుటుంబానికి చెందిన పండ్లకు మాత్రమే కాకుండా... మరికొందరికి అవకాడో, చెస్ట్‌నట్, పీచ్, టొమాటో, ఆలూ, బెల్‌పెప్పర్, మామిడి, స్ట్రాబెర్రీ వంటి పండ్లూ కూరగాయలతో కూడా అలర్జీ వస్తుంటుంది. వీటిల్లో లాటెక్స్ పాళ్లు లేనప్పటికీ కనిపించే ఈ రుగ్మతను కూడా ‘లాటెక్స్–ఫ్రూట్ సిండ్రోమ్’ అనే వ్యవహరిస్తారు. ఆయా పదార్థాలు వారికి సరిపడకపోవడమే ఇందుకు కారణం.
Comments
Please login to add a commentAdd a comment