
నవ్వులో కూడా ఏడుపు వినిపిస్తుంది!
లైఫ్‌బుక్
‘ఎం’ టీవి ఇండియా రియాల్టీ షో ‘టీన్ దివా’తో బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన రియా చక్రవర్తి ‘తూనీగ... తూనీగ’ తెలుగు సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. ‘మేరే డాడ్ కీ మారుతి’, ‘సోనాలీ కేబుల్’ సినిమాలలో తన నటనతో ఆకట్టుకున్నారు. ఆమె మనసులోని మాటలు...
ఇటీవల మహిళా ప్రధానమైన సినిమాలు కొన్ని రావడం హర్షించదగిన పరిణామం. ‘క్వీన్’, ‘మర్దానీ’, ‘ఖూబ్‌సూరత్’ లాంటి సినిమాలు మరిన్ని రావాలి. నేను నటించిన ‘సోనాలీ కేబుల్’ కూడా అలాంటి సినిమానే!
దర్శకులకు మించిన పెద్ద పుస్తకాలు ఏముంటాయి? వారు చెప్పింది చెప్పినట్లు చేస్తే ఎన్నో వర్క్‌షాప్‌లలో పాల్గొన్న అనుభవం నటనలో తొంగిచూస్తుంది. రమేష్ సిప్పీతో పనిచేస్తున్నప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. ఆయన చెప్పినదాంట్లో కొంత చేసినా కూడా నటిగా ఎంతో పేరు వస్తుంది. అలా అని భారమంతా దర్శకుడి మీదే వదిలేయకుండా నాదైన కోణాన్ని నటనకు జోడిస్తాను.
షూటింగ్ రోజున చాలా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ ఏదైనా సమస్య ఉన్నా, పొరపాటున కూడా దాన్ని మనసులోకి రానివ్వను. మానసిక ప్రశాంతత లేనప్పుడు ఆ ప్రభావం కచ్చితంగా నటనలో కనిపిస్తుంది. చివరికి నవ్వే సన్నివేశాల్లో కూడా ఏడుపు వినిపిస్తుంది! కొన్ని పాత్రల గురించి విన్నప్పుడు ‘నేను చేయగలనా?’ అనిపిస్తుంది. ‘చేయాలా? వద్దా’ అనే ఆలోచనలో, ‘చేయాలి’ అనే నిర్ణయమే నెగ్గుతుంది.
‘చిన్న సినిమాల్లో నటించడమేమిటి?’ అనే భావన నాలో ఎప్పుడూ లేదు. నిజానికి పెద్ద సినిమాల్లో నటించడానికి ఇవే సోపానాలు. ‘బాగా నటించిందా లేదా’ అనేది చూస్తారు తప్ప ‘చిన్న సినిమాల్లో నటించే నటికి పెద్ద సినిమాలో ఎవరూ అవకాశం ఇవ్వరు’ అని ఎవరూ ఆలోచించరు. చిన్న సినిమాల్లో నటించిన ఎందరో నటులు ఆ తరువాత పెద్ద సినిమాల్లో కూడా నటించి తమ సత్తా చాటుకున్నారు.