ఆధ్యాత్మిక ఆనందం... అమ్మపల్లి ఆలయం | Ammapalli Temple of spiritual bliss | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక ఆనందం... అమ్మపల్లి ఆలయం

Published Thu, Mar 12 2015 11:12 PM | Last Updated on Sat, Sep 2 2017 10:43 PM

ఆధ్యాత్మిక ఆనందం...  అమ్మపల్లి ఆలయం

ఆధ్యాత్మిక ఆనందం... అమ్మపల్లి ఆలయం

-  బూరుగు ప్రభాకరరెడ్డి, సాక్షి, శంషాబాద్

హైదరాబాద్‌కు అతిచేరువలో.. శ్రీ సీతారామచంద్రస్వామి కొలువుదీరిన ఈ ఆలయం... రాష్ట్రంలోనే అతి పురాతన దేవాలయంగా ప్రసిద్ధికెక్కింది.ఆలయానికున్న రాజగోపురం అలనాటి కళానైపుణ్యానికి, శిల్పసంపదకు తార్కాణంగా నిలిచింది. ఆలయ దైవమైన కోదండరాముడు కల్యాణరాముడుగా... అమ్మవారు సీతాదేవి సంతాన ప్రదాయినిగా, ఆలయ పరిసరాలు విజయ సోపానాలుగా భక్తుల మనస్సులో గుడికట్టుకున్నాయి.

చూడముచ్చట గొలిపే ఎత్తై గోపురం.. నాటి కళావైభవానికి ప్రతీకగా నిలిచే ఆలయ ప్రాకారాలు... పక్షుల కిలకిలా రావాలు.. చుట్టూ పచ్చని పంట పొలాలు.. ఆధ్యాత్మికతను కలబోసుకున్న ఆహ్లాదకర వాతావరణం..  రాష్ట్రంలోనే అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటిగా నిలిచిన ‘అమ్మపల్లి’ దేవాలయ ప్రత్యేకతను చాటుతోంది.. శ్రీ సీతారామచంద్రస్వామి కొలువుదీరిన ఈ ఆలయం సుమారు 400 ఏళ్ల కిందటిదని చరిత్ర చెబుతోంది. చారిత్రక సంపదగా వెలుగొందుతోంది.

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో ప్రపంచ పటంలో గుర్తింపు పొందిన శంషాబాద్ మండలంలోని నర్కూడ సమీపంలో అమ్మపల్లి దేవాలయం నెలకొంది. శంషాబాద్‌కు దక్షిణ వైపు షాబాద్ రోడ్డులో నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఆలయానికి చేరుకోవచ్చు. రోడ్డుపక్కన ముఖతోరణం (కమాన్) భక్తులకు స్వాగతం పలుకుతుంది. సుమారు 90 అడుగుల ఎత్తులో ఉండే రాజగోపురం.. ప్రధాన ద్వారంపై సేదతీరుతూ దర్శనమిచ్చే అనంత పద్మనాభస్వామి.. లోపలికి వెళ్లగానే విశాలమైన మహా మంటపం కనిపిస్తాయి. గర్భగుడిలో ఏకశిలా రాతి విగ్రహంపై శ్రీ లక్ష్మణ సమేతా సీతారామచంద్రస్వామి కొలువుదీరడం ఇక్కడి ప్రత్యేకత. విగ్రహాలపై దశావతారాల్లో మకర తోరణం కనిపిస్తుంటుంది. గర్భగుడి పైభాగంలో దశావతారాలు కళ్లకు కట్టినట్లు కళారూపాలుగా దర్శనమిస్తాయి. గర్భగుడికి ఎదురుగా శ్రీ ఆంజనేయస్వామి కొలువుదీరాడు.

రెండు ఎకరాల విస్తీర్ణంలో ఆలయ ప్రాకారాలు ఉండగా దేవాలయానికి ఈశాన్యంలో కోనేరు, ఎదురుగా కళ్యాణమండపం, ఆ పక్కన వంటశాల, రథశాల ఉన్నాయి. వీటితోబాటు శివాలయం, హనుమాన్ దేవాలయం ఇక్కడ దర్శనమిస్తాయి. రాజగోపురంపై భిన్న సంస్కృతులకు చిహ్నంగా నాటి కళా నైపుణ్యాన్ని చాటిచెప్పే కళారూపాలు అబ్బురపరుస్తుంటాయి. రాజగోపురం మొత్తం ఏడు అంతస్థులు ఉండగా లోపలి నుంచి పైకి ఎక్కడానికి చెక్కతో చేసిన మెట్లు ఏర్పాటు చేశారు. ఆలయం పరిసరాలు మానసిక ప్రశాంతతను చేకూర్చుతాయి. దైవసన్నిధిలో ఎంత సమయం గడిపినా తనివి తీరదు.
 
స్థలపురాణం


అరణ్య వాస సమయంలో శ్రీరాముడు ఈ ప్రాంతంలో నడయాడినట్లు చరిత్రకారులు చెబుతుంటారు.  (అయోధ్య కాండ సమయంలో భద్రాచలం నుంచి జీడికల్లు, అలేరు మీదుగా శ్రీరాముడు అమ్మపల్లి వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకుని వంటిమిట్టకు వెళ్లినట్లు స్థానిక పెద్దలు పేర్కొంటున్నారు). 13వ శతాబ్దంలో ఇక్కడ శ్రీ కోదండరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనజరిగింది. ఆ తర్వాత సుమారు రెండు శతాబ్దాలకు అప్పటి పాలకులైన వేంగి రాజులు ఆలయ నిర్మాణం చేపట్టారు. శ్రీరాముడి కుడిచేతిలో విల్లు ధరించి ఉండడంతో శ్రీ కోదండరాముడుగా పిలవబడుతున్నాడు. సప్త ప్రాకార మంటపం, ఏకాదశ కలశ స్థాపన, సింహద్వారం, మండపంలో శ్రీ కూర్మ క్షేత్రం నిర్మాణం ఇక్కడి ప్రత్యేకతలు. విమాన గోపురంపై సప్త క్షేత్ర దర్శనాలతో నిర్మాణం చేపట్టారు. శ్రీరంగం, భద్రాచలం, అహోబిలం, వటపత్రశాల, కలియుగ వైకుంఠ, ద్వారక, క్షీరసాగర క్షేత్రాలతో విమాన గోపురాన్ని తీర్చిదిద్దారు.

కల్యాణ రాముడంట కొమ్మలాలో..!

అమ్మపల్లిలో కొలువుదీరిన శ్రీ కోదండరాముడు కల్యాణ రాముడుగా ప్రసిద్ధి చెందాడు. కల్యాణం, సంతానం వంటి కోర్కెలను నెరవేర్చుతూ భక్తుల గుండెల్లో కొలువై ఉన్నాడు.
 
అంగరంగ వైభవం... ఆ కల్యాణం..
 
అమ్మపల్లిలో ప్రతి ఏటా శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ మూర్తులను నర్కూడ నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొస్తారు. ఆలయం ఎదురుగా ఉన్న మండపంలో శ్రీ సీతారాముల కల్యాణం జరుపుతారు. కల్యాణానికి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. నిత్యం పూజాకార్యక్రమాలు, మాసకల్యాణం నిర్వహిస్తుంటారు.

ఆలయం వద్ద ఎత్తై రాజగోపురం, విశాలమైన ప్రాంతం షూటింగ్‌లకు అనువుగా ఉండడంతో నాటితరం మేటి కథానాయకుడు నందమూరి తారక రామారావు నుంచి నేటి తరం వర్థమాన కథానాయికా నాయకుల చిత్రాల వరకు  ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. ఇక్కడ తీసిన చిత్రాలకు విజయం తథ్యమనే విశ్వాసం దర్శకనిర్మాతల్లో వేళ్లూనుకోవడంతో ఆలయం వద్ద ఎక్కువగా జాతర సన్నివేశాలు, పతాక సన్నివేశాలు, పాటల దృశ్యాలను చిత్రీకరిస్తుంటారు.  అయితే దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయం సరిపడా ఆదాయం లేక అరకొర సౌకర్యాలతో అంతంతమాత్రంగా ఉండటం శోచనీయం. ఎంతో ఆహ్లాదకరమైన పరిసరాలు గల ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే ఆలయం మరింత అభివృద్ధి చెందుతుంది.
 
 లోక కల్యాణం కోసం..
 
ఇక్కడ శ్రీరాముడు లోక కల్యాణం కోసం కొలువు దీరినట్లు భక్తులు విశ్వసిస్తారు. సొంత కోర్కెల కంటే సమాజం బాగుకోసం కోరే మొక్కులను స్వామి తీర్చుతాడని భక్తుల నమ్మకం. శ్రీరామనవమి సందర్భంగా స్వామి కల్యాణంలో అందరూ పాల్గొనే అవకాశం ఉండదు. కావున ప్రతినెలా పునర్వసు నక్షత్రం సందర్భంగా ఆలయంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తున్నాం. భక్తులు కల్యాణంలో పాల్గొని స్వామి కృపను పొందుతున్నారు.
 - చేగొమ్మ సత్యనారాయణ మూర్తి
 ఆలయ పూజారి,
  అమ్మపల్లి
 
 
‘ఇన్‌టెక్’ అవార్డు

 అమ్మపల్లి దేవాలయం విశిష్టత, చారిత్రక సంపదను గుర్తించి ఇన్‌టెక్ (ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్) వారు 2010లో హెరిటేజ్ అవార్డు ప్రకటించారు. సుమారు ఆరు ఎకరాల విస్తీర్ణంలోని ఈ ఆలయానికి వందల ఎకరాలు ఆస్తులు ఉన్నాయి. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయ ప్రాకారాలు నేడు శిథిలావస్థకు చేరుకోవడం శోచనీయం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement