
‘హమే తుమ్‌సే ప్యార్ కిత్‌నా, యే హమ్ నహీ జాన్ తే’ అని పర్వీన్ సుల్తానా గొంతు పంచిన పాట దుఃఖంలా నాకు తాకడానికి సెప్టెంబర్ 22, 2017 వరకు రావాల్సి వచ్చింది. మీ మీద ప్రేమ ఎప్పుడూ ఉంది, అయితే అది అంతగా ఉందని మాత్రం తెలీక ఉండింది. మీరు మాకు కలిగి ఉన్నంత కాలం మీ పెద్ద పొగరుతో నా చిన్న భేషజం తలపడ్డానికే సరిపోయింది. ప్రేమని చాటుకోవాలని నాకు తెలీదు, అలా చాటాలని మీరూ చెప్పలేదు కూడా. నా ప్రేమాభిమానం వంటి అక్కర మీకు ఎప్పుడూ లేదు.
వట్టి పుణ్యానికి మీరు నాకు దారి వెంట తగిలిన తీగ కాదు, నా జీవితంలో యాక్సిడెంటూ కాదు మీ కలయిక. ఒక ఇరవై రెండు ఏళ్ళ నేను తెల్లవారు జామున నాలుగు గంటలకు మెడార్సి బిల్డింగ్ బయట భుజాన సంచి తగిలించుకుని మోకాళ్ళ మీద బిక్కు బిక్కున కూచున్నట్టుగా ఇప్పటికీ ఆ బొమ్మ నా కళ్ళ ముందు ఉన్నాడు. మీకు ఎప్పటికీ తెలీలేదు నేనెవరో! మీరు వేసిన అన్ని బొమ్మలూ మీ అన్ని రాతలూ మీకు గుర్తుండకపోవచ్చు. కానీ ఆ ఖలీల్ సిద్ధికి హైస్కూల్ పిల్లవాడికి, ఆ బాలాజి కాలేజ్ కుర్రవాడికి ఆ అన్నీ గుర్తే. మీ సన్నని గీత, మీ లావు రాత, మీ చమత్కార రచనా వచనం.
మహా అంటే మిమ్మల్ని ఎవరు గుర్తుంచుకుంటారు? మీ భార్యా పిల్లలు, మీ తమ్ముడు చెల్లాయిలు, మీ బంధుమిత్రులు, మీ సహోద్యోగులు, మీ తోటి చిత్రకారులు, ఇంకా మీ అనుకునే మీ కామ్రేడ్లు. అంతకు మించి ఇంకెవరని మీకు ఎప్పటికి అందేను? నా అనగనగా ఆ రోజులనుంచి మీరు ఎన్నడూ పేరు విని ఉండని నూనెపల్లె అనే గ్రామంలో పొద్దంతా తెల్ల అంగి, ఖాకీ నిక్కరు తొడుక్కునే పిల్లవాడు ఒకడు మిమ్మల్ని తన వయసుతో పాటు మనసుతో పాటు పెంచుకుంటున్నాడని మీకు ఎప్పటికి తెలిసేను? నేను ఆ నంద్యాలలో ఆ నూనెపల్లెలో 22 ఏళ్ళు గడిపాను. నా బాల్యం నుంచి యవ్వనం వరకు మోహన్ బొమ్మని మోహన్ రాతని నేను తప్ప ప్రేమించిన మరో వాడు నాకు నా బడిలో, నా కాలేజిలో, నా నడకలో ఎవరూ తగల్లేదు.
ఎవరైనా ఎట్లా ఊహించగలరు ఒక తాలూకా టవునులో ఒక చిన్నవాడు తన బాల్యంలో, యవ్వనంలో తెలియని మిమ్ముల, ఏనాటికయినా తెలుసుకుంటానో లేదో తెలీకపోయినా మిమ్మల్ని ప్రేమిస్తూనే వచ్చాడు. మీ రాత మీ గీత మీద ఉన్న ప్రేమ పంచుకోడానికి మరెవరి తోడూ లేకపోయినా ఆరాధన సాగిస్తూనే వచ్చాడు. ఈ ఇంటర్ మీడియట్ చదువరి ఆ సమయంలో సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, భాగ్యశ్రీ, అనూ అగర్వాల్, దీపక్ తిజోరి, దివ్య భారతి ప్రేమలో మునగాల్సిన అద్భుతమైన ఆ వయస్సునంతా మీరు గీసిన ఎర్ర పిడికిళ్ళ వంక, ఆంధ్రప్రభ ముఖ చిత్రాల వంక, కామ్రేడ్ దిమిత్రొవ్ లైన్ డ్రాయింగ్ వంక, ప్రపంచ పదుల చివర తటిల్లతలైన మీ లలిత కోమల రేఖల వంక ... అగాథమయిన ప్రేమలో మరి తేలలేక ఉన్నాడని పదే పదే ఆ బొమ్మలని పట్టి పట్టి బట్టీ పడుతున్నాడని మీకు తెలీదు. తెలిసినా తృణీకరించబడినది నా బీద ప్రేమ మీ చెంత.
మీరు ఉన్నంత కాలం మీకు అందలేకపోయాను నేను. ప్రేమ విలువ ఇచ్చేవాడికే తెలుస్తుంది. మీకు గాలి విలువ, నావంటి గాలిగాడి విలువ తెలువనవసరం లేదనుకున్నారు. పైగా మీరు మేధావి. అవసరం లేని విషయాలు అనేకం మీ బుర్రలోంచి మీ బుర్రపై వంకీలు తిరిగిన జుట్టుకు మల్లే మెలికలు తిరిగి అల్లుకు పోయాయి. మీరు కోపర్నికస్ హెలియో సెంట్రిజం గురించి, ఎట్చియన్ లెనొయిర్ కనిపెట్టిన ఇన్ టర్నల్ కంబస్చన్ ఇంజన్ గురించి, డాంగే గురించి, మొహిత్ సేన్ గురించి, అజయ్ ఘోష్, పూరన్ చంద్ జోషిల గురించి, బొలీవియన్ జంగిల్ వార్, టెట్ అఫెన్సివ్ గురించి, లుముంబా, చే గువేరా, మార్టిన్ లూథర్ కింగ్‌ల హత్యల గురించి, కార్లో తుజ్జి రచన ‘బాన్దియేరా రొస్సా అవన్తి పాపొలో అల్ రిస్ కొసా’ గురించి గుక్క తిప్పుకోకుండా ఉపన్యాసాలు ఇవ్వడం మాత్రమే తెలుసు. మెసపుటేమియన్, సుమేరియన్, బాబిలాన్, పెర్సియన్, గ్రీక్, చీనా జపాన్ కళా రీతుల గురించి కబుర్లు దంచి కొట్టడం మాత్రమే తెలుసు. మీరు శిఖరం. నావంటి గులకరాయి లోపలి మనసు మీకు అందింది కాదు, మేఘాల్ని తగిలించుకున్నారు, అంది పుచ్చుకున్నారు. అదే పోయారు.
మీరు ఉన్నా, ఉండలేక పోయినా మిమ్ముల వదల్లేకపోవడం నాకు తప్పింది కాదు. పుస్తకం మధ్యన, పాట పిలుపున, ఒక కొత్త బొమ్మ రంగు చెంతన మిమ్ము తలుచుకుంటూనే ఉన్నాం, మీరు కాక మరిక ఎవరున్నారని? ఏ దిక్కు చూసినా దిక్కు తోచిన వాడు ఎవడూ కనపడ్డం లేదు. మీరు లేకపోవడం ఏమీ బాగా లేదు. మార్టిన్ కాంపొస్, డెన్నిస్ షారజిన్, రామోన్ న్యూనెజ్ , కెవిన్ యూట్స్ బొమ్మలు కనబడుతుంటే పరిగెత్తుకు వచ్చి మీకు చూపించలేం. అతిఫ్ అస్లమ్ ఎంత బాగా పాడుతాడో తెలుసా మీకు? తెలుసుకోకుండానే శెలవన్నారు. డోమ్నిక్ ‘హార్ట్ బ్రేక్ ఎట్ హోమ్ కమింగ్’ వినాల్సింది మీరు దెబ్బకు అట్లా పడిపోయే వాళ్ళు. లాహోర్ ముసిలాయన యాకూబ్ అతిఫ్ పానీకా బుల్బులా పాట వినకుండానే జీవితం నీటి బుడగ అని ఎలా డిసైడ్ చేశారు?
ఈ సంవత్సరం మీరు లేకుండానే మేడే ప్రదర్శన సాగి పోయింది, పెరిగిన డీజిల్ పెట్రోలు ధరలకు నిరసనగా మీ కుంచెత్తిన పిడికిలి ఆలంబన కాలేదు, ఈ సంవత్సరం ఏ కవితా పుస్తకం చెట్టు కింద లచ్చుమమ్మ వచ్చి సిరిమల్లెలు ఏరలేదు. ఏ ఎర్ర పోస్టర్ పై ఒక్క రైతూ పొలికేక పెట్టింది లేదు, మహారాష్ట్ర రైతుల లాంగ్ మార్చ్ వెనుక మీ నల్లని ఇంకు కెరటం కనగవ ఉవ్వెత్తున లేచి నీడ పట్టింది లేదు. చెప్పలేక పోతున్నాం కానీ ఇదేం అంత బాగా లేదు, ఆ పెన్సిలు దూసిన నెమళ్ళు కానరాని కోనలకు ఎగిరి పోవడం, చిట్టి ముక్కు గోధుమరంగు పిట్టగాడు వెలసిపోవడం, తురాయి చెట్టు కింద పరిగెత్తే జవ్వని చీరె చెంగుతో సహా అలా ఆకాశం వైపు అంతర్ధానం కావడం, కొమ్ముల గేదెపై గోచిపాత పసివాడు ఊదుతున్న వెదురు మురళి మరిక పలక్కపోవడం ఏం బాలా, మీరిలా మళ్ళీ మళ్ళీ గుర్తుకు రావడం కూడా బాలా, అయితే గియితే గుర్తులా వద్దు కానీ మీరే మళ్ళీ రారాదూ! ఒక ఫీనిక్స్ లా, ఒక క్వీన్ ఆఫ్ ఆండిస్‌లా కనీసం ఇంకో 32 సంవత్సరాల తరువాతయినా పర్లా, మళ్ళీ ఓసారి రారాదూ! నేనిక్కడ వేచి చూస్తుంటా.
-అన్వర్
Comments
Please login to add a commentAdd a comment