
తిరుక్కురళ్... ఎప్పటి గ్రంథం? తమిళ కవి తిరవళ్లువార్ ఐదు వేల ఏళ్ల కిందట రాసిన పుస్తకం. అది మానవుని ప్రవర్తన గురించిన విషయాలున్న పురాతన కాలం నాటి శాస్త్రం. ఇందులో తిరువళ్లువార్ చెప్పిన విషయాలు... ఇన్నేళ్ల తర్వాత కూడా ఆధునిక విద్యావిధానం కూడా అంగీకరించి తీరాల్సిన అంశాలు.
►మీ పిల్లలు మీతో ఎప్పుడూ అబద్ధాలు చెబుతుంటే ఏమనుకుంటారు? పిల్లలు అబద్ధాల కోరులయ్యారని ఆందోళనపడి వారిని దారిలో పెట్టడానికి కఠినంగా వ్యవహరించాలనుకుంటారు. నిజానికి మీ కఠినమైన ప్రవర్తన కారణంగానే వాళ్లు మీతో నిజం చెప్పడానికి భయపడుతూ ఉండి ఉంటారు. వాళ్లు పొరపాటు చేసినప్పుడు మీ రియాక్షన్ తీవ్రంగా ఉంటుంటే, మీతో నిజం చెప్పడానికి భయపడుతూ అబద్ధం చెప్పి అయినా, గండం గట్టెక్కాలనుకుంటారు పిల్లలు.
►పిల్లలు తమ తప్పుల్ని మీ దగ్గర ఒప్పుకోలేకపోతున్నారా? మీరు పిల్లల పట్ల అంతటి విశ్వాసాన్ని చూరగొనలేకపోయారంటే, మీకు– వారికి దూరం ఉన్నట్లు. ఇలాంటి పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో మీతో వారికి దూరం మరింతగా పెరగవచ్చు.
►మీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం కొరవడితే కారణం ఏమై ఉంటుంది? మీరు పిల్లలను ప్రోత్సహించడానికి బదులు ప్రతి విషయంలోనూ గైడ్ చేస్తూ ఉండి ఉంటారు. అన్నింటికీ గైడ్ చేయడం మాని కొన్ని నిర్ణయాలను వాళ్లకే వదిలేస్తే సొంతంగా ఆలోచించడం, తమ కాళ్ల మీద తాము నిలబడడం అలవాటవుతుంది.
►పిల్లలు మీ ముందు నిలబడడానికి కూడా భయపడుతున్నారా? నలుగురిలో మీకు ఎదుట పడకుండా తప్పించుకుంటున్నారా? అందుకు కారణం... పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడం కోసం పదిమందిలో కూడా వారిని అనుక్షణం గుడ్లురుముతూ ఉండడమే అయి ఉంటుంది. దాంతో బయటి వ్యక్తుల ముందు మీకు కనిపించకుండా ఉండడానికే ప్రయత్నిస్తారు. అనవసరంగా ఎదురుపడడం ఎందుకు అన్నట్లు మిమ్మల్ని అవాయిడ్ చేస్తారు.
►పిల్లలు తమవి కాని వస్తువులను తస్కరించడానికి వెనుకాడడం లేదా? ఈ లక్షణానికి దొంగతనం కారణం కాకపోవచ్చు. మీరు వాళ్ల కోసం ఏమైనా వస్తువులు కొనేటప్పుడు వారి ఇష్టాలను కూడా పరిగణనలోకి తీసుకోండి. పెద్దరికం అనే హోదాతో మీకు నచ్చిన బొమ్మ కొనేసి దాంతోనే ఆడుకోండి– అని ఆదేశిస్తే... ఇష్టం లేని బొమ్మతో ఆడుకోవడానికి అలవాటు పడతారేమో కానీ, ఇష్టమైన బొమ్మ కనిపించినప్పుడు దానికి దూరంగా ఉండడం వారికి చేతకాదు.
►పిల్లలు పిరికివాళ్లయిపోయారా? పిరికితనం ఉన్నది వాళ్ల ఒంట్లో కాదు. మీ పెంపకంలో. వాళ్లకు ఏ అవసరం వచ్చినా ఆ పనిని వాళ్లు ఎంతవరకు సొంతంగా చేసుకోగలరో చేసుకోనిచ్చి, వాళ్లకు సాధ్యం కాని దశను మీ భుజాలకెత్తుకోవాలి. అంతే కానీ, వాళ్లకు అలా అవసరం ఏర్పడిందో లేదో మీరే ఆ పనులన్నీ చేసి పెడుతుంటే... ఎన్నాళ్లయినా, ఎన్నేళ్లయినా సొంతంగా చేసుకోలేరు. తొందరలోనే వాళ్లు చీకట్లో వీథి గేటు వేయడానికి కూడా భయపడేటంత పిరికి వాళ్లయిపోవడం సహజమే.
►మీ పిల్లలు... ఇతరుల మనోభావాలను గౌరవించడం లేదు... అంటే, మీరు వాళ్ల అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడం, మాటలకు అడ్డుపడడం, ప్రతి దానికీ ఆదేశించినట్లు చెప్పడం, నియంత్రించడం వంటివి చేస్తున్నట్లు అర్థం చేసుకోవాలి.
►త్వరగా కోపం తెచ్చుకుంటున్నారంటే ... మీరు వాళ్లని మరీ ఎక్కువగా పట్టించుకుంటూ (అతి శ్రద్ధ) ఉండి ఉండాలి. పిల్లల కదలికల మీద అతిగా దృష్టి పెట్టకుండా కొంత పట్టు విడుపు ధోరణిలో ఉండాలి.
►పిల్లల్లో అసూయ కనిపిస్తుంటే... మీరు వాళ్లు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత మాత్రమే అభినందిస్తున్నారని అర్థం. అలా కాకుండా, పనిలో కొంతమేరకు మాత్రమే ఫలితం సాధించినప్పుడు, విజయవంతం కానప్పుడు కూడా వారి పట్ల సానుకూలంగా స్పందించాలి.
►పిల్లలు ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటే... మీరు వాళ్లతో సన్నిహితంగా ఉండడం లేదని, వాళ్లతో సమయాన్ని గడపడం, దగ్గరకు తీసుకోవడం వంటివి చేయడం లేదని అర్థం. పిల్లలతో క్వాలిటీ టైమ్‌ను గడపడం అలవాటు చేసుకోవాలి.
►మీ పిల్లలు మీ మాటను ధిక్కరిస్తున్నారంటే... మీరు వాళ్లను బహిరంగంగా బెదిరిస్తూ ఉండి ఉండాలి. ఈ అలవాటును తక్షణం మానెయ్యాలి. పిల్లల్ని బెదిరించడం దేనికీ సమాధానం కాదు. బెదిరించి దారిలో పెట్టడం సాధ్యం కానేకాదు.
►మీ దగ్గర సొంత విషయాలు చెప్పుకోకుండా రహస్యాలు పాటిస్తున్నారా? అయితే మీరు వాళ్ల విశ్వాసాన్ని చూరగొనడంలో విఫలమయ్యారని అర్థం. తమ ఇబ్బందులు కానీ సంతోషాలు కానీ మరెవరితోనూ చెప్పుకోవడానికి ఇష్టపడని విషయాలను మీతో చెప్పుకున్నప్పుడు మీరు వాటిని అంతే గోప్యంగా ఉంచాలి. మీకు చెప్పిన విషయాన్ని మీరు అందరికీ బహిర్గతం చేస్తారనే సందేహం కలిగిందంటే ఇక మీ దగ్గర ఏ విషయాన్నీ పంచుకోరు పిల్లలు.
►ముందొక మాట వెనుక ఒక మాట చెప్తున్నారంటే... మీరు ఇతరుల విషయంలో అలా ప్రవర్తిస్తూ ఉండి ఉండాలి. దానిని పిల్లలు గమనించి ఉంటారు. పైగా అదే సరైన పద్ధతి అని కూడా అనుకుంటూ ఉండవచ్చు. ముందు మీ ధోరణిని మార్చుకుంటే పిల్లలు మిమ్మల్ని అనుసరిస్తారు.
►మీ పిల్లలు మీ మాటను పెడచెవిన పెడుతూ, ఇతరులు చెప్పిన మాటను శ్రద్ధగా వింటున్నారా? ఇందుకు కారణం... మీతో ఏదైనా విషయం చెప్పీ చెప్పగానే ఫలితం కోసం తొందరపెడుతుండడం కావచ్చు.
►మీ పిల్లల్లో తిరుగుబాటు ధోరణి కనిపిస్తోందా? మీరు అవసరమైన దానికంటే ఎక్కువ జాగ్రత్తలు చెబుతూ ఉండి ఉండవచ్చు. ఇతరులకు కూడా మీరు అతిగా జాగ్రత్తలు తీసుకుంటారనే అభిప్రాయం ఉండవచ్చు. దానిని సహించడం పిల్లలకు కొంచెం కష్టమే.
Comments
Please login to add a commentAdd a comment