కళాత్మకం : అచ్చు... అలాగే! | as is is ..same to same | Sakshi
Sakshi News home page

కళాత్మకం : అచ్చు... అలాగే!

Published Wed, Oct 30 2013 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM

కళాత్మకం :  అచ్చు... అలాగే!

కళాత్మకం : అచ్చు... అలాగే!

ప్రతి ఒక్కరిలో కళాకారుడు ఉంటాడు. కళాకారుడిలో ఎవరుంటారు? ఊహకందని మరో కళాకారుడు ఉంటాడని నిరూపించారు దార్ల నాగేశ్వరరావు.

 ప్రతి ఒక్కరిలో కళాకారుడు ఉంటాడు. కళాకారుడిలో ఎవరుంటారు? ఊహకందని మరో కళాకారుడు ఉంటాడని నిరూపించారు దార్ల నాగేశ్వరరావు. ఈయనెవరంటారా? మొన్నటివరకూ గవర్నమెంట్ సెంట్రల్ ప్రెస్‌లో చిరుద్యోగి. ఇప్పుడు రెప్లికా ఆర్ట్‌లో రికార్డుల మీద రికార్డులు సాధించిన కళాకారుడు కూడా. పద్నాలుగు భాషల వార్తాపత్రికలను పునఃసృష్టి (రెప్లికా) చేసిన ఈ కళాకారుడి గురించి వివరాలే ఈరోజు కళాత్మకం...
 
 రెప్లికా అంటే అచ్చయిన పేపర్‌ని చూసి మరో పేపర్లో ఉన్నదున్నట్లు చిత్రించడం. చిత్రాలయితే ఫరవాలేదు. అదే అక్షరాలయితే అంత చిన్నసైజులో రాయడం చాలా కష్టం. నాగేశ్వరరావు చేసిన నిరంతర సాధన ఫలితంగా అతి తక్కువ సమయంలోనే రెప్లికా ఆర్ట్ ఆయన సొంతమైంది. ‘‘నేను మొదటిసారి రెప్లికా ఆర్ట్ వేసింది 2004లో. ఆరో తరగతి చదువుతున్నప్పటి నుంచే నాకు ఆర్ట్ అంటే ఇష్టం. ముఖ్యంగా పెయింటింగ్ అంటే ప్రాణం. ఎక్కడైనా కొత్త చిత్రం కనిపిస్తే ఉన్నదున్నట్టుగా దించేసేవాడ్ని. రెప్లికా ఆర్ట్ ఆలోచన అలా వచ్చిందే. రెప్లికాకు ఐగ్లాస్ కావాలి. అంటే భూతద్దం అన్నమాట. అలాగే సన్నగా రాసే ఇంకుపెన్నులు ఉంటే చాలు. ఈ రెంటితోపాటు చాలా ఓపిక కావాలి. ఒక పేపర్ రెప్లికా చేయడానికి నెలరోజుల సమయం పడుతుంది. అనుభవం పెరిగేకొద్దీ రోజుల సంఖ్య తగ్గుతుంది. ఏకధాటిగా పనిచేయకూడదు. అందుకే నేను తీరికవేళల్లో దీనిమీద దృష్టి పెడతాను. ముందు తెలుగు దినపత్రికతోనే మొదలుపెట్టినా తర్వాత ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, తమిళం, కన్నడం...వంటి పత్రికలకు రెప్లికా తయారుచేశాను.
 
  గవర్నమెంట్ సెంట్రల్ ప్రెస్‌లో ఆర్టిస్టుగా పనిచేస్తూ మరోపక్క తీరికసమయంలో రెప్లికా ఆర్ట్‌లో ప్రయోగాలు చేయడం నా హాబీ. దార్ల మా ఇంటిపేరు. నా రెప్లికా ఆర్ట్‌ని దృష్టిలో పెట్టుకుని ‘డిఫరెంట్ ఆర్ట్ ఆఫ్ రెప్లికా ఇన్ లెటర్ ఆర్ట్’ అని దార్లకి కొత్త అర్థాన్ని ఇచ్చాను. ’’ అని చెబుతున్న నాగేశ్వరరావు కళకు మంచి గుర్తింపు వచ్చింది.
 
 రికార్డులు
 ఏ కళాకారుడికైనా రికార్డులు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. నాగేశ్వరరావు రెప్లికా ఆర్ట్‌కి బోలెడన్ని బిరుదులు వచ్చాయి. అలాగే రికార్డులు కూడా. ‘రెప్లికా కళా ప్రవీణ’, ‘రెప్లికా రత్న’ వంటి బిరుదులతో పాటు ఏడుసార్లు వరసగా లిమ్కా బుక్ రికార్డులో స్థానం సంపాదించారు. ఇండియన్ బుక్‌రికార్డ్‌లో నాలుగుసార్లు స్థానం దక్కించుకున్నారు.‘‘ఇలాంటి గుర్తింపులన్నింటికంటే నేను ఏర్పాటు చేసిన రెప్లికా ఆర్ట్ ప్రదర్శనను చూసినవారు నా ఆర్ట్‌ని అభినందించిన సంఘటనలు నా కడుపు నింపేసేవి. నేను చేసిన రెప్లికాలన్నింటికోసం మా ఇంట్లోనూ మినీ ఆర్ట్ గ్యాలరీ షో ఏర్పాటు చేశాను’’ అని ముగించారు నాగేశ్వరరావు. రెప్లికా కళలో ఆరితేరిన దార్లకు కంగ్రాట్స్ చెబుదాం. ఈ కళలో మరిన్ని రికార్డులు సృష్టించాలని కోరుకుందాం.
 - భువనేశ్వరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement