replica
-
పోస్ట్‌మాస్టర్ అమర ప్రేమ
లక్నో: భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఆగ్రాలో చారిత్రాత్మక తాజ్ మహల్‌ను నిర్మిస్తే యూపీలో ఓ ప్రేమ చక్రవర్తి తన హృదయరాణి కోసం మరో తాజ్‌మహల్ నిర్మాణానికి పూనుకున్నాడు. తల తాకట్టు పెట్టయినా సరే తన ప్రేమమందిరాన్ని పూర్తి చేస్తానంటున్నాడు. నిర్మాణ దశలో ఉన్న ఈ కట్టడం చుట్టుపక్కల గ్రామస్తులనే కాదు, సాక్షాత్తూ యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను కూడా ఆకర్షించింది. వివరాల్లోకి వెళితే యూపీలో బులంద్‌శహర్‌లో నివసించే ఫైజల్ హసన్ ఖ్రాది (80) పోస్ట్ మాస్టర్ గా పనిచేసి రిటైరయ్యాడు. 58 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత అతని భార్య తాజాముల్లి బేగం క్యాన్సర్‌తో 2011లో కన్నుమూసింది. దీంతో పవిత్రమైన తమ ప్రేమకు గుర్తుగా ఓ మినీ తాజ్‌మహల్ రూపొందించాలని హసన్ ఖ్రాది నిర్ణయించాడు. అలాగే తన భార్య సమాధి పక్కనే తన శాశ్వత నిద్రకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాడు. అయితే వృద్ధాప్యంలో అతని అంతులేని ప్రేమను, పడుతున్న కష్టాన్ని చూసిన కొంతమంది సహాయం చేయడానికి ముందుకొచ్చారు. కానీ హసన్ ఖ్రాది దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. అంతేకాదు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, స్థానిక అధికారులు ఆర్థిక సహకారం అందిస్తామన్నా అంగీకరించలేదు. తన సొంత డబ్బుతోనే ఆ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నాడు. దీనికోసం తన వ్యవసాయ భూమిని, భార్య నగల్ని అమ్మేశాడు. ఇప్పటివరకు మొత్తం పదకొండు లక్షలు వెచ్చించాడు. మార్బుల్స్ తదితర పనుల కోసం మరో ఆరేడు లక్షలకు పైగా ఖర్చుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. 'గొంతు క్యాన్సర్‌తో నా భార్య చనిపోయిన తరువాత నాకంతా శూన్యంలా అనిపించింది. నేనూ పోతాను..ఈ భవనం కూడా కూలి పోతుంది. కానీ నేను చనిపోయే ముందు ఈ ప్రేమమందిరాన్ని పూర్తిచేయాలి, దాన్ని కళ్లారా చూడాలనేదే నా కోరిక. అలాగే నేను పోయిన తరువాత నా అంత్యక్రియలు కూడా ఇక్కడే జరగాలి. ఈ విషయాన్ని తమ్ముడికి చెప్పాను. ఇందుకు అవసరమైన డబ్బులు కూడా డిపాజిట్ చేశా'నంటూ తన మనసులోని మాటను వెల్లడించాడు. మరోవైపు తనకు చేస్తానన్న ధన సహాయంతో గ్రామంలో పాఠశాల భవనాన్ని నిర్మించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరనున్నానని ఖాద్రి తెలిపాడు. -
ఉద్విగ్న భరిణెం
జనం చేరిన అమ్మ ప్రతిరూపం పులకించిన మేడారం.. ఉప్పొంగిన భక్తిభావం ఉదయం నుంచే.. సమ్మక్క రాక సందర్భంగా సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య, పూజారులు దోబె పగడయ్య, సిద్దబోయిన సమ్మయ్య(తండ్రి పొట్టయ్య), సిద్దబోయిన సమ్మయ్య (తండ్రి దానయ్య), మాదిరి పుల్లయ్య, మాదిరి నారాయణ గురువారం మేడారంలోని సమ్మక్క గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. వేకువజామునే అడవికి వెళ్లి వనం(వెదురు) తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. మధ్యాహ్నం 3.50 గంటలకు చిలకలగుట్టపైకి వెళ్లి పూజలు చేసి తల్లిని గద్దెలపైకి చేర్చారు. అడుగడుగునా నీరాజనాలు తల్లి సమ్మక్క గద్దెకు చేరుతుండగా భక్తులు అడుగడుగునా ఎదురుకోళ్లతో ఘనస్వాగతం పలికారు. గాలిలోకి కోళ్లు ఎగురవేస్తూ ఆహ్వానించారు. తల్లిపై ఒడి బియ్యం చల్లుతూ మొక్కులు చెల్లించుకున్నారు. దారిపొడవునా బారులుదీరి న భక్తులు తల్లిని ప్రత్యక్షంగా చూసేందుకు ఆ రాటపడ్డారు. అమ్మను కళ్లారా చూసి తరించా రు. యాటపోతులు, కోళ్లతో ఎదురెళ్లి బలిచ్చా రు. భక్తులు, శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. తల్లి నామస్మరణతో మేడారం హోరెత్తింది. థింసా నృత్యాలు అలరించాయి. పోలీసుల భారీ బందోబస్తు పోలీసుల భారీ బందోబస్తు మధ్య సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి మేడారం గద్దెకు చేర్చారు. సమ్మక్కను పూజారులు తీసుకుని వస్తుండగా రెండు రోప్‌పార్టీలు రక్షణ ఇచ్చాయి. రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు ఆధ్వర్యంలో డీఎస్పీ దక్షిణామూర్తి, సీఐలు దేవేందర్‌రెడ్డి, కిరణ్‌కుమార్, ఇతర బలగాలు భద్రత చేపట్టాయి. అధికారుల ఘనస్వాగతం కలెక్టర్ కిషన్, రూరల్ ఎస్పీ కాళిదాసు, ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క, ఊరట్టం సర్పంచ్ గడ్డం సంధ్యారాణి, మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఈఓ దూస రాజేశ్వర్‌రావు తల్లికి ఘనస్వాగతం పలికారు. సాయంత్రం 5.39కు ఏకే-47తో రూరల్ ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపారు. గుట్ట దిగగానే 5.42 గంటలకు, గద్దెల ప్రాంగణానికి వస్తుండగా చిలకలగుట్ట రోడ్డుకు చేరిన సమయంలో, సాయంత్రం 5.55 గంటలకు మరోసారి కాల్పులు జరిపారు. గుట్టెక్కిన భక్తులు చిలకలగుట్ట నుంచి తల్లిని గద్దెలకు తీసుకెళ్లిన తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు చిలకలగుట్ట ఎక్కారు. పూజారుల పూజా విధానంపై ఆసక్తితో వారు గుట్ట ఎక్కినా అక్కడ ఎటువంటి ఆనవాళ్లు కనిపించకపోవడంతో కిందికి దిగారు. ఇక తల్లిపై వేసిన బియ్యాన్ని ఆమె వెళ్లిపోయిన తర్వాత భక్తులు సేకరించారు. అలాగే గుట్ట సమీపంలోని చెట్ల బెరడును కూడా తీసుకెళ్లారు. దేవతలను దర్శించుకున్న 30 లక్షల మంది తల్లీబిడ్డలు గద్దెలపై కొలువుదీరగానే సుమారు 30 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు గద్దెల వద్ద భక్తజన ప్రవాహం కొనసాగింది. అమ్మలకు ఇష్టమైన నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించుకుని మొక్కులు చెల్లించారు. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్నవాగు కిక్కిరిసింది. మొత్తంగా ఇప్పటివరకు సుమారు 70లక్షలమంది అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. -
కళాత్మకం : అచ్చు... అలాగే!
ప్రతి ఒక్కరిలో కళాకారుడు ఉంటాడు. కళాకారుడిలో ఎవరుంటారు? ఊహకందని మరో కళాకారుడు ఉంటాడని నిరూపించారు దార్ల నాగేశ్వరరావు. ఈయనెవరంటారా? మొన్నటివరకూ గవర్నమెంట్ సెంట్రల్ ప్రెస్‌లో చిరుద్యోగి. ఇప్పుడు రెప్లికా ఆర్ట్‌లో రికార్డుల మీద రికార్డులు సాధించిన కళాకారుడు కూడా. పద్నాలుగు భాషల వార్తాపత్రికలను పునఃసృష్టి (రెప్లికా) చేసిన ఈ కళాకారుడి గురించి వివరాలే ఈరోజు కళాత్మకం... రెప్లికా అంటే అచ్చయిన పేపర్ని చూసి మరో పేపర్లో ఉన్నదున్నట్లు చిత్రించడం. చిత్రాలయితే ఫరవాలేదు. అదే అక్షరాలయితే అంత చిన్నసైజులో రాయడం చాలా కష్టం. నాగేశ్వరరావు చేసిన నిరంతర సాధన ఫలితంగా అతి తక్కువ సమయంలోనే రెప్లికా ఆర్ట్ ఆయన సొంతమైంది. ‘‘నేను మొదటిసారి రెప్లికా ఆర్ట్ వేసింది 2004లో. ఆరో తరగతి చదువుతున్నప్పటి నుంచే నాకు ఆర్ట్ అంటే ఇష్టం. ముఖ్యంగా పెయింటింగ్ అంటే ప్రాణం. ఎక్కడైనా కొత్త చిత్రం కనిపిస్తే ఉన్నదున్నట్టుగా దించేసేవాడ్ని. రెప్లికా ఆర్ట్ ఆలోచన అలా వచ్చిందే. రెప్లికాకు ఐగ్లాస్ కావాలి. అంటే భూతద్దం అన్నమాట. అలాగే సన్నగా రాసే ఇంకుపెన్నులు ఉంటే చాలు. ఈ రెంటితోపాటు చాలా ఓపిక కావాలి. ఒక పేపర్ రెప్లికా చేయడానికి నెలరోజుల సమయం పడుతుంది. అనుభవం పెరిగేకొద్దీ రోజుల సంఖ్య తగ్గుతుంది. ఏకధాటిగా పనిచేయకూడదు. అందుకే నేను తీరికవేళల్లో దీనిమీద దృష్టి పెడతాను. ముందు తెలుగు దినపత్రికతోనే మొదలుపెట్టినా తర్వాత ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, తమిళం, కన్నడం...వంటి పత్రికలకు రెప్లికా తయారుచేశాను. గవర్నమెంట్ సెంట్రల్ ప్రెస్‌లో ఆర్టిస్టుగా పనిచేస్తూ మరోపక్క తీరికసమయంలో రెప్లికా ఆర్ట్‌లో ప్రయోగాలు చేయడం నా హాబీ. దార్ల మా ఇంటిపేరు. నా రెప్లికా ఆర్ట్‌ని దృష్టిలో పెట్టుకుని ‘డిఫరెంట్ ఆర్ట్ ఆఫ్ రెప్లికా ఇన్ లెటర్ ఆర్ట్’ అని దార్లకి కొత్త అర్థాన్ని ఇచ్చాను. ’’ అని చెబుతున్న నాగేశ్వరరావు కళకు మంచి గుర్తింపు వచ్చింది. రికార్డులు ఏ కళాకారుడికైనా రికార్డులు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. నాగేశ్వరరావు రెప్లికా ఆర్ట్‌కి బోలెడన్ని బిరుదులు వచ్చాయి. అలాగే రికార్డులు కూడా. ‘రెప్లికా కళా ప్రవీణ’, ‘రెప్లికా రత్న’ వంటి బిరుదులతో పాటు ఏడుసార్లు వరసగా లిమ్కా బుక్ రికార్డులో స్థానం సంపాదించారు. ఇండియన్ బుక్రికార్డ్లో నాలుగుసార్లు స్థానం దక్కించుకున్నారు.‘‘ఇలాంటి గుర్తింపులన్నింటికంటే నేను ఏర్పాటు చేసిన రెప్లికా ఆర్ట్ ప్రదర్శనను చూసినవారు నా ఆర్ట్‌ని అభినందించిన సంఘటనలు నా కడుపు నింపేసేవి. నేను చేసిన రెప్లికాలన్నింటికోసం మా ఇంట్లోనూ మినీ ఆర్ట్ గ్యాలరీ షో ఏర్పాటు చేశాను’’ అని ముగించారు నాగేశ్వరరావు. రెప్లికా కళలో ఆరితేరిన దార్లకు కంగ్రాట్స్ చెబుదాం. ఈ కళలో మరిన్ని రికార్డులు సృష్టించాలని కోరుకుందాం. - భువనేశ్వరి