అన్ని అవయవాలకు అందినట్లే గుండెకూ రక్త సరఫరా అందాలి. అప్పుడే గుండె సరిగ్గా పనిచేస్తుంటుంది. ఏవైనా కారణాల వల్ల గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడితే అది ‘గుండెపోటు’కు దారితీసి ప్రాణాపాయ పరిస్థితిని ఏర్పరుస్తుంది. అలాంటప్పుడు ప్రాణరక్షణకు ఉపయోగపడేదే అత్యవసర యాంజియోప్లాస్టీ. దీన్నే ‘ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ’గా పేర్కొంటారు. ఈ ప్రక్రియ వల్ల మూసుకుపోయిన రక్తనాళాన్ని వెంటనే తెరిచేలా చేసి గుండెకండరానికి అగినంత రక్తం, ఆక్సిజన్ అందేలా చేయవచ్చు. ఇలా చేసే క్రమంలో ఆపరేషన్‌గాని, శరీరానికి గాటుగాని పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ఈ ప్రక్రియను అనుసరించడానికి రక్తనాళంలో మూసుకుపోయిన ప్రాంతాన్ని తక్షణం గుర్తించి దాన్ని వెంటనే వెడల్పు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల గుండెకండరం దెబ్బతినకుండా రక్షించడంతో పాటు భవిష్యత్తులోనూ ఆ భాగం సమర్థంగా పనిచేసేలా చూడవచ్చు.
డోర్ టు బెలూన్ టైమ్ అంటే...
గుండెపోటు వచ్చినప్పుడు... అది వచ్చిన సమయానికీ... చికిత్స అందే సమయానికి ఉన్న వ్యవధి ఎంత తక్కువగా ఉంటే ఫలితాలు అంత బాగా ఉంటాయి. అయితే గుండెపోటు వచ్చిన పేషెంట్ ఆసుపత్రికి రాగానే వెంటనే చికిత్స అందదు కదా. ముందుగా ఈసీజీ వంటి పరీక్షలు చేయాలి. ఆ తర్వాత అది గుండెపోటే అన్న నిర్ధారణ కావాలి. ఆ తర్వాతే యాంజియోప్లాస్టీ చేస్తారు. గుండెపోటు రాగానే వీలైనంత వేగంగా వెన్వెంటనే ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ అందించాలి. ఒక్కోసారి రోగి హాస్పిటల్‌కు వచ్చాక కూడా కార్డియాలజిస్టులు రోగికి యాంజియోప్లాస్టీ అందించేందుకు కొంత వ్యవధి పడుతుంది. దీన్నే ‘డోర్ టు బెలూన్ టైమ్స్’ అంటారు. ఈ వ్యవధి ఎంత తక్కువగా ఉంటే ఫలితాలు అంత అద్భుతంగా ఉంటాయి.
గుండెపోటు రాగానే అతడి ‘ఈసీజీ’ కాపీని కార్డియాలజీ విభాగానికి చేరవేసి, అక్కడి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు, క్రిటికల్ కేర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ ప్రొసిజర్‌ను చేపడితే పేషెంట్ ప్రాణాలు దక్కేందుకు అవకాశాలు చాలా ఎక్కువ. గుండెపోటు వచ్చాక ఈ ‘డోర్ టు బెలూన్ టైమ్’ గరిష్ట వ్యవధి 90 నిమిషాలకు మించకూడదు. అలా అని అన్ని కేసుల్లోనూ అంతే వ్యవధి పడుతుందనుకుంటే అది పొరబాటే. ఒక్కోసారి 50 నిమిషాల్లోనూ జరగాల్సిన ప్రమాదం జరిగిపోవచ్చు. అందుకే రోగి ఆసుపత్రికి వచ్చాక ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా యాంజియో చికిత్స అందాలి.
ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ అనే ప్రక్రియ కార్డియాక్ కాథరైజేషన్ ల్యాబ్‌లో అత్యుతన్న సాంకేతిక ఉపకరణాల సహాయంతో మూసుకుపోయిన రక్తనాళాలను వెడల్పు చేసి గుండె కండరానికి రక్తప్రవాహాన్ని మళ్లీ కొనసాగేలా చేసే ప్రక్రియ. రక్తనాళంలోని ఏ ప్రాంతంలో అడ్డు ఉందన్న విషయాన్ని ఎంత త్వరగా తెలుసుకుంటే అంత వేగంగా ఈ ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ ద్వారా గుండెకు జరిగే నష్టాన్ని అంతగా నివారించవచ్చు. ఇందులో ప్రతి క్షణం విలువైనదే.
ఈ ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ ప్రక్రియలో రోగికి సంభవించే దుష్ర్పభావాలనూ, రిస్కులను నివారించడానికి సాధారణంగా లోకల్ అనస్థీషియాను మాత్రమే ఇస్తుంటారు.
ప్రైమరీ యాంజియో ప్రక్రియ జరిగేదిలా...
గుండెపోటు లక్షణాలు కనిపించగానే ఆసుపత్రిలోని ‘ఎమర్జెన్సీ’కి రోగిని తరలించి ‘ఈసీజీ/ఈకేజీ’ పరీక్షలు నిర్వహించి గుండెపోటును నిర్ధారణ చేస్తారు.
అక్కడి నుంచి రోగిని కాథ్‌లాబ్‌కు తరలించి ‘క్యాథెటర్’ అని పిలిచే ఒక సన్నటి గొట్టాన్ని అయోర్టా అనే ప్రధాన నాళం ద్వారా మూసుకుపోయి ఉన్న రక్తనాళం వరకు తీసుకెళ్తారు.
ఈ క్యాథెటర్ చివరన ఒక బెలూన్‌ను అమర్చి ఉంచుతారు. రక్తనాళంలో మూసుకుపోయి ఉన్న భాగాన్ని చేరగానే బెలూన్ ఉబ్బేలా చేస్తారు. అలా చేశాక మళ్లీ ఆ రక్తనాళం మూసుకుపోకుండా ఒక చిన్న పైప్‌ను అమర్చుతారు. ఆ పైప్‌నే ‘స్టెంట్’ అని వ్యవహరిస్తారు.
స్టెంట్‌ను వేశాక... 10 నుంచి 20 సెకన్లలోపే మళ్లీ బెలూన్‌ను మూసుకుపోయేలా చేసి బయటకు తీస్తారు. ఇలా మూసుకుపోయిన భాగంలో ఒక లోహపు గొట్టం ఉండటం వల్ల మళ్లీ ఆ భాగం మూసుకుపోదు. ఫలితంగా గుండెకండరానికి యథావిధిగా రక్తం అందుతుంటుంది.
కరొనరీ యాంజియోకూ, ప్రైమరీ యాంజీయోకూ ఉన్న తేడా ఇది...
ముందుగానే వేసుకున్న ప్రణాళిక ప్రకారం... ఒక క్రమబద్ధమైన రీతిలో యాంజియోప్లాస్టీ చికిత్స చేస్తే దాన్ని కరొనరీ యాంజియో అని అంటారు. అదే... గుండెపోటు వచ్చినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా రోగి ప్రాణరక్షణే ధ్యేయంగా అప్పటికప్పుడు చేసే యాంజియోప్లాస్టీని ప్రైమరీ యాంజియో అంటారు.
డోర్ టు బెలూన్ టైమ్ తగ్గిన కొద్దీ మేలు!
Published Tue, Sep 23 2014 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM
Advertisement
Advertisement