నిరాడంబర సంపన్నులు | Austere rich mans | Sakshi
Sakshi News home page

నిరాడంబర సంపన్నులు

Published Sun, Mar 13 2016 10:41 PM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM

నిరాడంబర  సంపన్నులు

నిరాడంబర సంపన్నులు

తామరాకు మీద నీటిబొట్టులా... కొందరు మహానుభావులుసంపదలలో మునిగి తేలుతున్నా, సామాన్య  జీవితాన్ని గడుపుతుంటారు.. వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ పక్కా జెంటిల్మెన్‌లా జీవితాన్ని సాగిస్తుంటారు. అటువంటి స్థితప్రజ్ఞులు కొందరి గురించి.
 
 తెల్లవారితే రాముడికి పట్టాభిషేకమనగా, దశరథుడు రామునితో, ‘‘రామా! రాజు కావడానికి ముందు కొన్ని నియమాలు ఆచరించాలి. అవ న్నీ మన కులగురువులు వశిష్ఠులు నీకు వివరిస్తారు. ఆయన మాటలను తుచ తప్పక అనుసరించు’ అన్నాడు. సరేనన్నాడు రాముడు. వశిష్ఠుని సమీపించి, ఆయనకు ప్రణమిల్లి, తన రాక వివరాలు విన్నవించాడు. అప్పుడు వశిష్ఠుడు, ‘రామా! రాజు కాబోయేవాడు పట్టాభిషేకానికి ముందు రోజు భోజనం చేయకూడదు. సాధారణ వస్త్రాలు ధరించాలి. నేల మీద శయనించాలి. రాజబంధువులతో సంభాషించకూడదు. మౌనంగా ఉండాలి. అందుకు కారణం కూడా వివరిస్తాను విను. పేదవారు తిండిలేక అల్లాడిపోతుంటారు. గతుకుల నేల మీద, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ నిద్రిస్తారు. వారి కష్టం తెలియాలంటే వాటిని రాజు కాబోయే వ్యక్తి స్వయంగా అనుభవించాలి. పేదల కష్టాలు తెలిస్తేనే ప్రజారంజకంగా పరిపాలన చేయగలుగుతారు. ఇక బంధువర్గంతో ఎందుకు మాట్లాడకూడదో తెలుసా. పదవిలోకి వచ్చేవారిని ఎన్నో రకాల ప్రలోభాలతో లొంగ దీయాలనుకుంటారు. అందుకే వారికి దూరంగా ఉండాలి’ అని బోధించాడు. నాటి బోధనల నుంచి ప్రేరణ పొంది, వాటిని ఆచరిస్తున్న సంపన్నులు వీళ్లు. విజయ్ మాల్యా ఖరీదైన ధోరణికి భిన్నంగా ఆదర్శప్రాయులుగా నిలిచినవారు వీళ్లు.

అపార్ట్‌మెంట్‌లో టాటా: ముంబైలో రతన్ టాటా ఇంటిని చూస్తే, అసలు ఆయన కోటీశ్వరుడేనా అనుకుంటారు! మన కంటె చిన్న ఇంట్లో ఉంటున్నారే అనుకుంటారు కొందరు లక్షాధికారులు. ప్రజల మధ్య ఒక సొంత ఫ్లాట్  ఆయన నివాసం. ఆయన కోటీశ్వరుడే. కాని ఆయన మనిషి. నేల మీద నడిచే మనిషి. గాలిలో తేలడం, ఆకాశంలో మేడలు కట్టడం ఆయనకు ఇష్టం లేదు. విలువల పునాదుల మీదే ఆయన ప్రయాణం. భారతదేశానికి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను తీసుకువ చ్చిన నిరాడంబర కోటీశ్వరుడు టాటా.

డేవిడ్ గ్రీన్: హాబీ లాబీ (చైన్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్‌కంపెనీ) సిఈవో. 4.5 బిలియన్ డాలర్లకు అధిపతి. ప్రత్యేక విమానంలో దేశవిదేశాలకు వెళ్లగల స్థితిమంతుడు. కాని అతి సామాన్యంగా ప్రయాణిస్తారు. వీలైనంతవరకు తన ధనాన్ని సమాజ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ పక్కా జెంటిల్మన్ అనిపించుకున్నాడు. హాబీలాబీ కంపెనీను మూసేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు తన ఆస్తిలో 90 శాతం ప్రభుత్వానికి, 10 శాతం తన వారి చదువులు, ఆరోగ్యం కోసం ఒక ట్రస్ట్‌గా ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యాడు.

అజీమ్ ప్రేమ్‌జీ:  భారతదేశంలో అత్యంత సంపన్నులలో మూడో వ్యక్తి విప్రో చైర్మన్. ఆయన ఆస్తి విలువ 11.2 బిలియన్ డాలర్లు. టాయిలెట్ పేపర్ల వాడకం నుంచి, అక్కర్లేని సమయంలో లైట్లు ఆర్పేయడం వరకు తన ఉద్యోగులకు దిశానిర్దేశం చేస్తుంటాడు. అదేదో పిసినారితనం అనుకుంటే పొరపాటే. ఆ అనవసర ఖర్చును ఆపేస్తే, ఉద్యోగస్తులకు మరింత ఎక్కువ జీతాలు ఇవ్వచ్చనేది ఆయన భావన.
 మార్క్ జుకెర్‌బర్గ్: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన యువకుడు. వయను 28. ఆస్తి విలువ 13.3 బిలియన్ డాలర్లు. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు, చైర్మన్, సిఈవో. సామాన్యమైన జీన్స్, షర్ట్స్ వేసుకుంటాడు. సూటు వేసుకున్నా కూడా లెదర్ షూస్ లేదా మామూలు శాండల్స్ మాత్రమే ధరిస్తాడు. అతడి వివాహం, తన ఇంట్లో అతి సామాన్యంగా చేసుకున్నాడు. హనీమూన్ ట్రిప్‌లో ఇటలీలో మెక్‌డొనాల్డ్స్‌లో చాలా సింపుల్‌గా ఆహారం తీసుకున్నాడు.
 
సెర్జీ బ్రిన్
: ఇంటర్‌నెట్ ఎంటర్‌ప్రెన్యూర్, కంప్యూటర్ శాస్త్రవేత్త. గూగుల్ స్పెషల్ ప్రాజెక్ల్ కోఫౌండర్. ఆయన ఆస్తి 22.8 బిలియన్ డాలర్లు. అతి సామాన్యంగా ఎలా జీవించాలో తన తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ‘‘విలాసాలు లేకుండా ఆనందంగా జీవించడం నా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాను. ఇప్పటికీ నేను భోజనం చేసేటప్పుడు కంచంలో ఒక్క మెతుకు కూడా వదలను. ఏ వస్తువు కొనాలన్నా వాటి ధర తప్పక చూస్తాను. వీలైనంతవరకు తక్కువ ఖర్చు చేయడానికి ప్రయత్నిస్తాను. ఎంత సామాన్యంగా జీవిస్తే అంత ఎక్కువ ఆనందంగా హాయిగా గడపగలమని నా అనుభవంలో తెలుసుకున్నాను’’ అంటాడు.
 
జిమ్ వాల్టన్: వాల్‌మార్ట్ వ్యవస్థాపకుడు సామ్ వాల్ట్ కుమారుడు. ఆ ఇంట్లో అందరికంటె చిన్నవాడు. ఆస్తి విలువ 26.7 బిలియన్ డాలర్లు. తన తండ్రి నుంచి సాధారణ జీవితాన్ని అలవర్చుకున్నాడు. మామూలు ఇటుకలతో నిర్మించిన బిల్డింగులో పర్సనల్ వెల్త్ మేనేజ్‌మెంట్ కంపెనీ నడుపుతున్నాడు. పొదుపుగా ఖర్చు చేయడం అలవాటు చేసుకున్నాడు.
 అమానికో ఒర్టెగా: జారా (బట్టల వ్యాపార సంస్థ) వ్యవస్థాపకుడు. స్పెయిన్‌లో అత్యంత సంపన్నుడు. 57 బిలియన్‌లకు అధిపతి. ఒర్టెగాతో ఆయన భార్య కూడా పొదుపరే. ఒక అపార్ట్‌మెంట్లో వీరి నివాసం. దీనికితోడు ఒర్టెగా వస్త్రధారణ చాలా సింపుల్‌గా ఉంటుంది. సాధారణంగా రెండు జతలతోనే తన జీవితం గడపడానికి ఇష్టపడతాడు.
 
వారెన్ బఫెట్: బెర్క్‌షైర్ హాథ్‌వే చైర్మన్, సిఈవో. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన సంపన్నుడిగా 53.5 బిలియన్ల డాలర్ల ఆస్తులు కలిగి ఉన్నాడు. బాల్యం నుంచే ఆయనది వ్యాపారాత్మక ధోరణి. పిల్లలతో ఆడుకోవడానికి బదులు మ్యాగజైన్లు, సోడాలు, గమ్ బాటిల్స్ అమ్ముతూ ఉండేవాడు. అతి పిన్న వయసులోనే వాల్ స్ట్రీట్ ను బాగా చదివేవాడు. అతి పిన్నవయసులోనే అనేక షేర్లు కొన్నాడు. అంత సంపదలు, అంత వ్యాపారాత్మక ధోరణి ఉన్నప్పటికీ ఎంతో పొదుపుగా జీవించేవాడు. గ్యాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్ల కోసం అస్సలు ఖర్చుచేయడానికి సుముఖత చూపడు. కనీసం బొమ్మలు కొనడానికి కూడా ఇష్టపడడు. బొమ్మలతో ఆడుకోవడం వల్ల మెడనొప్పి తప్ప ఏ ప్రయోజనం లేదు... అనేవాడు. బిలియన్లకొలదీ డాలర్లు దానాల రూపంలో ఖర్చు చేయడానికి ఆసక్తి చూపుతాడు.
 
కార్లోస్ స్లిమ్ హెలూ
: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. ‘అమెరికన్ మువిల్’కి గౌరవ అధ్యక్షుడు. 73 బిలియన్ డాలర్లకు అధినేత. ఈ గ్రహం మీదే అత్యంత సంపన్నుడిగా పేరు పొందిన కార్లోస్ అత్యంత సాధారణ జీవితం గడపడానికి ఇష్టపడతాడు. కేవలం ఆరు పడక గదుల ఇంట్లో నివసిస్తున్నాడు. ఇప్పటికీ తన కారు తనే డ్రైవ్ చేసుకుంటాడు. బిలియనీర్ అంటే విలాసంగా ఖర్చు చేసేవాడని అర్థం కాదు. సాధారణ జీవితం గడుపుతూ, తన దగ్గర అదనంగా ఉన్న డబ్బును పేదవారి కోసం ఖర్చుచేసేవాడే సంపన్నుడు... అంటాడు కార్లోస్.
 ఎంత సంపన్నులైనా కూడా అవసరానికి మించి ఖర్చు చేయకూడదని, సగటు మనిషి కూడా శక్తికి మించి జీవించడం మంచిది కాదని, నిరాడంబర జీవనంలోని సౌఖ్యాన్ని తెలుసుకోవాలని వీరి జీవితాలు చెబుతున్నాయి.
 
 ఔరంగజేబు స్వయంగా తన చేత్తో చేసిన టోపీలను అమ్మగా వచ్చిన డబ్బును తన ఖర్చులకు ఉపయోగించుకునేవాడు. ఖజానా సొమ్ము నుంచి ఒక్క పైసా కూడా ముట్టుకునేవాడు కాదు. అలాగే ట్రావన్‌కోర్ రాజులు వేల కోట్ల ఆదాయాన్ని భగవంతుడికే ఇచ్చారు కాని, సొంతానికి వాడుకోలేదు. సింహాసనం అధిష్టించబోతున్న శ్రీకృష్ణదేవరాయల చెంప మీద మహామంత్రి తిమ్మరుసు గట్టిగా కొడతాడు. ఎందుకు కొట్టారని ఆయన అడగలేదు. సామాన్య జీవితం అల వాటు చేసుకోవడం కోసమే అప్పాజీ ఇలా చేశారని అర్థం చేసుకున్నాడు. ప్రజారంజకంగా పరిపాలన చేశాడు. ఆంధ్రభోజుడయ్యాడు.
 
 - డా.పురాణపండ వైజయంతి
 సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement