
తేనెటీగలు అంతరించిన కొన్ని రోజులకు భూమి మీద మనిషనేవాడు మిగలడని ఐన్‌స్టీన్ అంతటి శాస్త్రవేత్త వందేళ్ల క్రితమే హెచ్చరించాడు. అయితే క్రిమికీటకనాశినుల వాడకం పెరుగుతున్నకొద్దీ ఈ అద్భుతమైన తేనెటీగల సంతతి తక్కువైపోవడం మొదలైంది. ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. తన పరిధిలోని అన్ని దేశాల్లోనూ కీటకనాశినులపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నియోనికొటినాయిడ్స్ అనే రసాయనాలు తేనెటీగలు వేగంగా అంతరించిపోతున్నట్లు ఇప్పటికే గుర్తించారు.
కీటకనాశినులపై నిషేధం ఈ ఏడాది చివరి నుంచి అందుబాటులోకి వస్తుందని అంచనా. అనాదిగా మనం తినే ఆహారంలో ఎక్కువభాగం తేనెటీగలు చేసే పని వల్ల సమకూరుతోందన్నది మనందరికీ తెలిసిందే. రెండేళ్లక్రితం అమెరికా ప్రభుత్వ సంస్థ ఒకటి తేనెటీగలను అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో చేర్చింది. కీటక నాశినులపై నిషేధం విధిస్తే పంటలు ఎలా కాపాడుకోవాలన్న అనుమానం కొందరికి రావచ్చు. కొన్ని రసాయనాల్లో నియోనికొటినాయిడ్ రసాయనం ఉన్నప్పటికీ అవి తేనెటీగలపై ఎలాంటి దుష్ప్రభావం చూపలేదని తెలిసింది. ఈ రకమైన రసాయనాల వాడకం ద్వారా అటు తేనెటీగలను సంరక్షించుకుంటూనే.. ఇటు పంటలనూ కాపాడుకోవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment