జీర్ణశక్తిని పెంచే అరటిపండు!
గుడ్‌ఫుడ్
అరటి పండు అతి సాధారణమైన పండు. దాని పోషక విలువలు అసాధారణం. దీనిని 107 దేశాలలో పండిస్తారు. దాదాపు 125 గ్రాములు ఉండే అరటి పండులో 110 క్యాలరీల శక్తి; 30 గ్రాముల పిండి పదార్థాలు; 1 గ్రాము ప్రోటీన్లు; 3 గ్రాముల పీచుపదార్థాలు; 5 మి.గ్రా. విటమిన్ బి6; 9 మి.గ్రా విటమిన్ సి; 450 మి.గ్రా. పొటాషియమ్ ఉంటాయి. ఇందులో పొటాషియమ్ పాళ్లు చాలా ఎక్కువ కాబట్టి రక్తపోటు నియంత్రణలో ఈ పండు బాగా తోడ్పడుతుంది.
ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలిన అంశం ఏమిటంటే... చిన్నప్పుడు అరటిపండ్లు పుష్కలంగా తిని పెరిగిన పిల్లల్లో ఆస్తమా వచ్చేందుకు అవకాశాలు 34 శాతం తగ్గుతాయి. ఇందులో ఉండే పొటాషియమ్, విటమిన్ సి, విటమిన్ బి6... గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు తోడ్పడతాయి. జీర్ణశక్తి కోసం ఉపకరించే ఆహారాల్లో అరటి పండు చాలా కీలకం. ఇందులోని అమైనో యాసిడ్స్ అద్భుతమైన జ్ఞాపకశక్తికి, మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపయోగపడతాయి.