
పిడికిలి బిగిస్తే... రంగు పడుద్ది
ఈ ఫొటోలో కిక్‌బ్యాగును బాదేస్తూ కనిపిస్తున్నాడే... ఇతగాడు మామూలోడు కాదు. ఇతగాడు గనుక పిడికిలి బిగించి పిడిగుద్దులు కురిపించాడంటే రంగు పడాల్సిందే! రింగులోకి దిగినప్పుడు పిడిగుద్దులు కురిపిస్తే, ప్రత్యర్థి ముఖంపై రంగు పడుద్ది. కిక్‌బ్యాగుపై కురిపించాడంటే, దానికి ముందే చుట్టిన కేన్వాస్‌పై రంగు పడుద్దంతే! ఆ తర్వాత అది ఎవరికీ అర్థంకాకున్నా, చూడచక్కని ఆబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్‌గా తయారవుతుంది. ఇతగాడి పేరు బార్ట్ వాన్ పోలానెన్ పీటెల్.
ఈ డచ్ వీరుడు ఉండేది నెదర్లాండ్స్‌లో. స్వతహాగా ఇతగాడు బాక్సర్. కాకపోతే ‘కుంచె’ం కలాపోసన ఎక్కువ. బాక్సింగ్ గ్లోవ్స్‌నే కుంచెలా వాడుకుంటూ, కిక్‌బ్యాగ్‌నే కేన్వాస్‌గా చేసుకుని ఇతగాడు సృష్టిస్తున్న కళాఖండాలు అంతర్జాతీయ ఆర్ట్ మార్కెట్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇవి ఒక్కొక్కటి వెయ్యి పౌండ్ల మేరకు పలుకుతున్నాయి.