
ఉత్తమ విలన్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ధృవ’ అనే సినిమా తెరకెక్కింది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్’కు రీమేక్ అది. అందులో విలన్ పాత్రను ఎవరితో నటింపజేయాలా అని టీమ్ చాన్నాళ్లు ఆలోచించింది.
‘తని ఒరువన్’లో చేసిన అరవింద్ స్వామి తప్ప ఇంకొకరు ఆ పాత్ర చేయలేరని రామ్ చరణ్ సహా అందరికీ అర్థమైపోయింది. మళ్లీ ఆయన్నే తీసుకొచ్చి తెలుగులోనూ విలన్‌గా చేయించారు. అదీ ఆ పాత్రలో అరవింద్ స్వామి చూపించిన మార్క్!
అరవింద్ స్వామి పేరు చెప్పగానే, ‘ఎంత అందంగా ఉంటాడూ?’ అన్న మాటే నోట్లో నుంచి వచ్చేస్తుంది. హీరోగా ఆయన చేసిన సినిమాలు కూడా ఆ అందాన్ని మరింత పెంచినవే! అలాంటి అందగాడు విలన్‌గా చేస్తున్నాడంటే? ‘అబ్బే! అంతగా కుదరరేమో?’ అనుకున్నారు. కానీ జరిగిందేంటీ? ‘తని ఒరువన్’ విడుదలవగానే ఆయన తప్ప ఎవ్వరూ ఆ పాత్ర చేయలేరని ఒక స్టేట్‌మెంట్ కూడా ఇచ్చేశారంతా. రీమేక్ ‘ధృవ’లోనూ అరవింద్ స్వామిని తప్ప మరొకరిని ఊహించలేమనుకునే ఆయన్నే పట్టుకొచ్చారు. ‘ధృవ’లో అరవింద్ స్వామి ఒక స్టైలిష్ విలన్. కార్పొరేట్ నేరగాడు. ప్రపంచానికి మంచి బిజినెస్‌మేన్‌లా కనిపిస్తూ ఉండే ఒక కరుడుగట్టిన నేరస్థుడు. తనకు కావాల్సిన పని కోసం ఎంతదూరమైనా వెళతాడు. ఎవ్వరినైనా పైకి పంపించేస్తూంటాడు.
ఇలాంటి విలన్‌లంతా మన సినిమాల్లో చూడడానికి భయపెట్టేలా ఉంటారు. ఇక్కడ మాత్రం ఈ విలన్ చాలా అందంగా ఉంటాడు. హీరోకు ఏమాత్రం తీసిపోడు. ప్లాన్ గీసాడంటే హీరోనే భయపడిపోతూంటాడు.
‘ఫస్ట్ టైమ్ సిద్ధార్థ్ అభిమన్యు అనే ఫార్ములాను వీడు కనిపెట్టాడు’ అని చెప్పినా, ‘ఎప్పుడూ మంచి మాత్రమే చెయ్యడం ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు’ అని చెప్పినా అంతా క్లాస్‌గా, స్టైల్‌గా ఉండేలా చూసుకుంటాడు సిద్ధార్థ్. అంటే మన అరవింద్ స్వామి. ఈ స్టైలే ఆయనకు హీరోగా ఎంత పాపులారిటీ తెచ్చిందో ఇప్పుడు విలన్‌గా అంతకు రెట్టింపు పాపులారిటీ తెచ్చింది. ‘తని ఒరువన్’, ‘ధృవ’ తర్వాత ఇప్పుడు అరవింద్ స్వామి బిజీ విలన్. ‘మా సినిమాలోనూ ఇంత అందమైన క్లాస్ విలన్ ఉండాల’ని కోరుకుంటున్నారు ఇప్పటి డైరెక్టర్లు. మొత్తమ్మీద విలన్‌కు ఒక స్టైల్ తేవడంలో అరవింద్ స్వామి ఒక హీరో అయిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment