తీగ లాగుతున్నారు! ఏలియన్స్ కదులుతాయా?
మిస్టరీ
దాదాపు డెబ్బై ఏళ్లుగా మిస్టరీగా మిగిలిపోయిన 1947 నాటి ‘రాస్వెల్’ ఏలియన్ మిస్టరీ త్వరలోనే తేలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి! గ్రహాంతరవాసుల ఉనికిపై ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాలను కెనడా పరిశోధనా సంస్థ ఒకటి ఈ ఏడాది జూన్ 25న బహిరంగ చర్చకు పెట్టబోతోంది. ఈ చర్చలో రాస్వెల్ మిస్టరీ కూడా అంతుచిక్కవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
ఏమిటా రాస్వెల్ మిస్టరీ?!
మాక్ బ్రాజెల్.. పశుపోషకుడైన ఓ వ్యవసాయదారుడు. న్యూ మెక్సికోలోని రాస్వెల్ ప్రాంతంలో ఆయనకో వ్యవసాయ క్షేత్రం ఉంది. 1947 జూలైలో ఒక రోజు బ్రాజెల్ తన నివాసానికి సమీపంలో అంతరిక్ష శకలాల వంటివేవో పడి ఉండడాన్ని గమనించాడు. వాటి తాకిడికి అక్కడ అగాధం లాంటి గొయ్యి ఏర్పడింది. విషయాన్ని వెంటనే సైనికాధికారులకు చేరవేశాడు బ్రాజెల్. తక్షణం ఇద్దరు ఇంటెలిజెన్స్ అధికారులు అక్కడికి వచ్చి చూశారు. వెనకే పోలీసు పటాలం. పరిశోధన మొదలైంది. 1947 జూలై 8వ తేదీ ఉదయం విడుదల చేసిన ఓ ప్రకటనలో .. ఎగిరేపళ్లెం (ఫ్లయింగ్ సాసర్) ధ్వంసమై ఆ శకలాలు బ్రాజెల్ ఇంటి పక్కన పడ్డాయని రాస్వెల్ ఆర్మీ ఎయిర్ ఫీల్డ్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ విలియం బ్లాకార్డ్ వెల్లడించారు! అమెరికా అంతటా ఆ వార్త గుప్పుమంది.
ముప్పైకి పైగా మధ్యాహ్నపు పత్రికలు దీనిని ప్రముఖంగా ప్రచురించాయి. శకలాలు కూలిన సమయంలో అక్కడికి దగ్గర్లోని బల్లార్డ్ ఫ్యునెరల్ హోమ్‌లో గ్లెస్ డెన్నిస్ అనే యువ కాటికాపరి పనిచేస్తున్నాడు. అమెరికన్ మిలటరీ అధికారులు శకలాలను పూర్తిగా స్వాధీనం చేసుకున్నాక మార్చురీ అధికారి నుంచి అతడికి అనేక ఫోన్‌కాల్స్ వచ్చాయి. ‘‘పాడైపోయే స్థితిలో ఉన్న మృతదేహాలను భద్రపరచేందుకు ఉన్న అత్యుత్తమ పద్ధతి గురించి ఆయన డెన్నిస్‌ను అడిగాడు.
ఆ అధికారి దగ్గరే డెన్నిస్ స్నేహితురాలు నర్సుగా పనిచేస్తోంది. మర్నాడు ఆమె విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు గమనించిన డెన్నిస్.. విషయం ఏమిటని అడిగాడు. శకలాల్లో దొరికిన కొన్ని మృతదేహాలకు (అవి మానవులవి కావు) లోపల పోస్ట్‌మార్టమ్ జరుగుతున్నట్లు ఆమె చెప్పింది. ఈ క్రమంలోనే ఎక్కడా నోరెత్తవద్దని ఆనాడు శకలాల తొలగింపులో పాల్గొన్న వారందరికీ అమెరికా ప్రభుత్వం నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి.
రాస్వెల్‌లో యు.ఎఫ్.ఓ. (అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్) కుప్పకూలిన విషయం నిజమే గనుక అయితే అమెరికా ప్రభుత్వం దగ్గర 1947 నుంచి ఏలియన్ టెక్నాలజీ ఉందని అనుకోవాలి. గ్రహాంతరవాసులపై రహస్యంగా పరిశోధనలు సాగిస్తున్న అమెరికా.. ‘రివర్స్ ఇంజినీరింగ్’తో సొంతంగా యు.ఎఫ్.ఓ.లను నిర్మిస్తున్నదని కూడా అనుకోవాలి. ‘ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్’ ద్వారా రాస్వెల్‌లో అసలేం జరిగిందన్న సమాచారాన్ని వెల్లడించేందుకు ఇప్పటివరకు అమెరికా నిరాకరిస్తుండడాన్ని బట్టి ఇది నిజమే అనిపిస్తోంది. అయితే నిజామా కాదా అన్నది నిర్థారణగా తేలాలంటే ఈ జూలై 25 వరకు ప్రపంచం ఆగాల్సిందే.