
కొంతమంది పిల్లలు తల్లిగర్భంలో ఉండాల్సిన వ్యవధి పూర్తికాకముందే పుడుతుంటారు. ఇలాంటి పిల్లలను ప్రిమెచ్యుర్ బేబీస్ అని వ్యవహరిస్తుంటారు. ఇలాంటి పిల్లలకు ఫార్ములా పాలు ఇవ్వడం కంటే రొమ్ముపాలపైనే పెరిగేలా చేయడం వల్ల భవిష్యత్తులో వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయని ఐర్లాండ్‌లో నిర్వహించిన ఓ దీర్ఘకాలిక పరిశోధనలో తేలింది. తల్లిగర్భంలో పూర్తి వ్యవధి పాటు లేకుండా త్వరగా పుట్టేసే పిల్లల్లోని గుండె గదులు (ఛేంబర్లు) ఒకింత చిన్నవిగా ఉండటం వల్ల ఆ పిల్లలు పెద్దయ్యాక గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఒకింత ఎక్కువ. అయితే ఇలాంటి పిల్లలకు వీలైనంతవరకు రొమ్ముపాలే పట్టించడం వల్ల వారికి అవసరమైన హార్మోన్లు, గ్రోత్‌ఫ్యాక్టర్లు వంటివి సమకూరుతాయి.
అంతేకాదు... వారి రోగనిరోధక వ్యవస్థ కూడా మరింత బలంగా మారుతుంది. ఆ అధ్యయన గణాంకాల ప్రకారం... ప్రతి పదమూడు మంది పిల్లల్లో ఒకరు ఇలా వ్యవధికి ముందే పుడుతుంటారట. వారి గుండెగదులు (ఛేంబర్స్) ఒకింత చిన్నవిగా ఉండటంతో తోటిపిల్లలతో పోల్చినప్పుడు వారి రక్తపోటు కూడా ఎక్కువే. ఈ అంశాలన్నీ వారిని గుండెజబ్బులకు గురయ్యేలా చేస్తుంటాయి. అయితే ఇలాంటి పిల్లలను పూర్తిగా రొమ్ముపాలపైనే పెరిగేలా చేయడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తక్కువని ఈ అధ్యయనం నిర్వహించిన పరిశోధకుల్లోని ఒకరైన ప్రొఫెసర్ ఆఫిఫ్ ఎల్ ఖుఫాష్ అనే ఐర్లాండ్‌లోని ‘రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్’ చెందిన పీడియాట్రిషియన్ పేర్కొంటున్నారు. ఈ అంతర్జాతీయ పరిశోధనల్లో యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన పరిశోధకులు కూడా ఉన్నారు. ఈ అధ్యయన ఫలితాలను ‘జర్నల్ పీడియాట్రిక్ రీసెర్చ్’లో వారంతా సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment