Mothers womb
-
తల్లి ద్వారా కడుపులో బిడ్డకు కోవిడ్?
సాక్షి, హైదరాబాద్: కరోనా ఏడాదిగా మనిషికి ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉంది. వ్యాధి లక్షణాలు మొదలుకొని వైరస్ వ్యాప్తి వరకూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ మహమ్మారి తల్లి నుంచి గర్భస్థ శిశువుకూ సోకుతుందని నిరూపించారు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ఘంటా సతీశ్. లిటిల్‌స్టార్స్ పిల్లల ఆస్పత్రిలో పని చేస్తున్న ఆయన ఇటీవలే ఇలాంటి ఓ కేసును గుర్తించడమే కాకుండా.. కరోనాతో పుట్టిన పసిబిడ్డకు విజయవంతంగా చికిత్స అందించారు కూడా. ఇలా తల్లి మాయ ద్వారా బిడ్డకు వ్యాధి వ్యాపించడాన్ని కోవిడ్ 19 నియోనాటల్ మిస్–సి అని పిలుస్తారు. ఆసక్తికరమైన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. నెలలు నిండిన శిశువుల్లోనే యాంటీబాడీలు.. కోవిడ్–19 గురించి తెలిసినప్పటి నుంచి వైరస్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ఈ వ్యాధి తల్లి నుంచి గర్భంలో ఉన్న బిడ్డకు సోకే అవకాశం లేదు. కానీ గతేడాదిగా కోవిడ్‌తో బాధపడుతున్న గర్భిణులకు వైద్య సాయం అందిస్తున్న డాక్టర్ ఘంటా సతీశ్ మాత్రం ఈ అంశంతో ఏకీభవించలేదు. పుట్టిన బిడ్డల్లో కోవిడ్ లక్షణాలు ఉన్నా.. శరీరంలో యాంటీబాడీలు లేకపోవడాన్ని కొందరిలో గుర్తించారు. కొంతకాలం కింద కొంచెం అటు ఇటుగా జరిగిన నాలుగు కాన్పులతో ఈ అంశంపై ఆయన కొంత స్పష్టత సాధించగలిగారు. పుట్టిన నలుగురు పిల్లల్లో ఒకరు పూర్తిగా నెలలు నిండిన తర్వాత బయటికి రాగా.. మిగిలిన వారిని 32 వారాల్లోపే బయటకు తీశారు. నెలలు నిండిన తర్వాత పుట్టిన బిడ్డలో మాత్రమే యాంటీబాడీలు ఉండటాన్ని గుర్తించిన సతీశ్.. ఇది కచ్చితంగా తల్లి నుంచి గర్భంలోని బిడ్డకు వైరస్ సోకడం వల్ల మాత్రమే సాధ్యమైందన్న నిర్ధారణకు వచ్చారు. మిగిలిన ముగ్గురు బిడ్డల్లో వ్యాధి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ‘గర్భస్థ శిశువులకు తల్లి నుంచి ఉమ్మ నీరు దాటుకుని మరీ యాంటీబాడీలు చేరాలంటే కనీసం 32 వారాలు పూర్తయి ఉండాలి. నలుగురు పిల్లల్లో ఒక్కరు మాత్రమే ఈ స్థాయికి చేరుకున్నారు. మిగిలిన ముగ్గురిలో ఒకరు 32 వారాలు పూర్తి కాకముందే పుట్టగా.. మిగిలిన ఇద్దరు 28, 31 వారాల తర్వాత పుట్టిన వారు’అని డాక్టర్ సతీశ్ వివరించారు. చికిత్స పద్ధతులు మారాలి గర్భంలో ఉన్న పిల్లలకు తల్లి ద్వారా కోవిడ్ సోకిన కేసులు ఇటీవల చాలా అరుదుగా కనిపిస్తున్నాయని డాక్టర్ ఘంటా సతీశ్ తెలిపారు. అంతర్జాతీయ జర్నల్స్‌తో ఈ విషయమై ఇప్పటికే చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఈ పరిశోధన ద్వారా కోవిడ్ సోకిన గర్భిణుల విషయంలో తీసుకునే జాగ్రతలు, అనుసరించాల్సిన వైద్య పద్ధతుల్లో మార్పులు జరగొచ్చని, తద్వారా తల్లి, పిల్లలు ఇద్దరికీ మేలు జరుగుతుందని వివరించారు. -
గుండెపోటు అవకాశాలను తగ్గించే రొమ్ముపాలు
కొంతమంది పిల్లలు తల్లిగర్భంలో ఉండాల్సిన వ్యవధి పూర్తికాకముందే పుడుతుంటారు. ఇలాంటి పిల్లలను ప్రిమెచ్యుర్ బేబీస్ అని వ్యవహరిస్తుంటారు. ఇలాంటి పిల్లలకు ఫార్ములా పాలు ఇవ్వడం కంటే రొమ్ముపాలపైనే పెరిగేలా చేయడం వల్ల భవిష్యత్తులో వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయని ఐర్లాండ్‌లో నిర్వహించిన ఓ దీర్ఘకాలిక పరిశోధనలో తేలింది. తల్లిగర్భంలో పూర్తి వ్యవధి పాటు లేకుండా త్వరగా పుట్టేసే పిల్లల్లోని గుండె గదులు (ఛేంబర్లు) ఒకింత చిన్నవిగా ఉండటం వల్ల ఆ పిల్లలు పెద్దయ్యాక గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఒకింత ఎక్కువ. అయితే ఇలాంటి పిల్లలకు వీలైనంతవరకు రొమ్ముపాలే పట్టించడం వల్ల వారికి అవసరమైన హార్మోన్లు, గ్రోత్ఫ్యాక్టర్లు వంటివి సమకూరుతాయి. అంతేకాదు... వారి రోగనిరోధక వ్యవస్థ కూడా మరింత బలంగా మారుతుంది. ఆ అధ్యయన గణాంకాల ప్రకారం... ప్రతి పదమూడు మంది పిల్లల్లో ఒకరు ఇలా వ్యవధికి ముందే పుడుతుంటారట. వారి గుండెగదులు (ఛేంబర్స్) ఒకింత చిన్నవిగా ఉండటంతో తోటిపిల్లలతో పోల్చినప్పుడు వారి రక్తపోటు కూడా ఎక్కువే. ఈ అంశాలన్నీ వారిని గుండెజబ్బులకు గురయ్యేలా చేస్తుంటాయి. అయితే ఇలాంటి పిల్లలను పూర్తిగా రొమ్ముపాలపైనే పెరిగేలా చేయడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తక్కువని ఈ అధ్యయనం నిర్వహించిన పరిశోధకుల్లోని ఒకరైన ప్రొఫెసర్ ఆఫిఫ్ ఎల్ ఖుఫాష్ అనే ఐర్లాండ్‌లోని ‘రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్’ చెందిన పీడియాట్రిషియన్ పేర్కొంటున్నారు. ఈ అంతర్జాతీయ పరిశోధనల్లో యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన పరిశోధకులు కూడా ఉన్నారు. ఈ అధ్యయన ఫలితాలను ‘జర్నల్ పీడియాట్రిక్ రీసెర్చ్’లో వారంతా సమీక్షించారు. -
ఆ శిశువు మృత్యుంజయురాలు.. తల్లి గర్భంలో నుంచి..
బ్రెసిలియా : ఓ ప్రమాదంలో గర్భవతి కడుపులోనుంచి బయటకు ఎగిరిపడ్డ ఓ పసికందు ప్రాణాలతో మిగిలింది. తల్లి ప్రమాదంలో చనిపోయినా ఆమెకు కొద్దిమీటర్ల దూరంలో గడ్డిలో ఎగిరిపడ్డ ఆ పసికందుకు ఏ చిన్నగాయం కాకపోవటం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌కు చెందిన ఓ ట్రక్కు చెక్క ముక్కలతో ప్రయాణిస్తూ.. కొద్ది దూరం తర్వాత ప్రమాదానికి గురై బోల్తా పడింది. ఆ సమయంలో ట్రక్కులో ప్రయాణిస్తున్న ఓ గర్భవతి కూడా ఈ ప్రమాదంలో చిక్కుకుంది. దీంతో ట్రక్కులో ఉన్న చెక్కముక్కలు ఆమెపై పడ్డాయి. మహిళ కడుపుపై ఒత్తిడి పడటంతో గర్భంలో ఉన్న శిశువు కడుపులో నుంచి ఎగిరి కొద్ది మీటర్ల దూరంగా గడ్డిలో పడింది. ఈ ప్రమాదంలో తల్లి మరణించినప్పటికి శిశువు మృత్యుంజయురాలిగా మిగిలింది. ప్రమాదం జరిగిన చోటుకు చేరుకున్న కొద్దిమందికి శిశువు ఏడుపు వినపడింది. మహిళ మృతదేహానికి కొద్ది దూరంలో ఓ ఆడ శిశువును గుర్తించిన వారు పసికందును ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ మహిళకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. -
మానసిక వికాసం డౌన్
డౌన్ సిండ్రోమ్ నేడు వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే తల్లి వయసు డౌన్ సిండ్రోమ్ కలిగే అవకాశం 30 ఏళ్ల లోపు ప్రతి 2500 ప్రెగ్నెన్సీలలో ఒకరికి 40 ఏళ్లు దాటితే ప్రతి 80 ప్రెగ్నెన్సీలలో ఒకరికి 45 ఏళ్లు దాటితే ప్రతి 32 ప్రెగ్నెన్సీలలో ఒకరికి పిల్లల్లో మానసిక వికాస లోపాలను కలగజేసే అంశాల్లో అతి ముఖ్యమైంది ‘డౌన్ సిండ్రోమ్’. ఇది జన్యుపరమైన కారణాలతో కలుగుతుంది. సుమారు ప్రతి ఎనిమిది వంతుల శిశుజననాల్లో ఒకరికి ఈ సమస్య కలిగే అవకాశం ఉంది. తల్లిగర్భం దాల్చే వయసు పెరుగుతున్న కొద్దీ పుట్టబోయే శిశువుకు డౌన్ సిండ్రోమ్ కలిగే అవకాశం పెరుగుతుంది. డౌన్ సిండ్రోమ్ కలిగే అవకాశాలను తగ్గించడానికి సరైన వయసులో వివాహం చేసుకోవడం, పిల్లల కోసం తగిన సమయంలో ప్లాన్ చేసుకోవడం ఎంతో కీలకం. మహిళల్లో పద్దెనిమిది ఏళ్లలోపు, 35 ఏళ్లు దాటిన తర్వాత వివాహాలైన సందర్భాల్లో పుట్టబోయే పిల్లలకు జన్యుపరమైన, ఇతర లోపాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ముందుగానే గుర్తించవచ్చు: కీలకమైన విషయం ఏమిటంటే గర్భస్థ శిశువుకు జన్యులోపాలను ముందుగానే కొన్ని పరీక్షల ద్వారా గుర్తించేందుకు అవకాశం ఉంది. దీన్ని వినియోగించుకోవడం ద్వారా (ముఖ్యంగా 30 ఏళ్లు పైబడ్డ తర్వాత గర్భం ధరిస్తున్న మహిళలందరూ) ప్రయోజనం పొందవచ్చు. ఇక జెనెటిక్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవడం కూడా ప్రధానమే. సాధారణంగా చేసే పరీక్షలు: జన్యుపరమైన లోపాలను తెలుసుకోవడం కోసం సాధారణంగా చేసే స్క్రీనింగ్ పరీక్షలివి... ఆమ్నియోసెంటైసిస్, కోరియోనిక్ విల్లస్ శాంప్లింగ్ (సీవీఎస్) ఎక్స్పాండెడ్ ఆల్ఫాప్రోటీన్ (ఏఎఫ్‌పీ) అల్ట్రాసౌండ్ న్యూకల్ ట్రాన్స్‌లుయెన్సీ స్క్రీనింగ్ (ఎన్టీ స్క్రీనింగ్)... వంటి పరీక్షల ద్వారా కడుపులోని పిల్లలకు డౌన్స్ సిండ్రోమ్ ఉందేమోనని కాస్త ముందుగానే గుర్తించడం చాలావరకు సాధ్యమే. (అయితే కొద్దిమందిలో పరీక్షలు సాధారణంగానే ఉన్నా పుట్టిన తర్వాతే విషయం పడే అవకాశాలూ ఉంటాయి). డౌన్ సిండ్రోమ్‌కు కారణాలు క్రోమోజోమ్స్ 21లో జన్యుపదార్థం అధికం కావడం వల్ల డౌన్ సిండ్రోమ్ సంభవిస్తుంది. అండం ఏర్పడే సమయంలో జన్యు సంయోగం జరుగుతుంది. ఈ ప్రక్రియలో క్రోమోజోమ్‌లు విడివడుతుంటాయి. అలా విడిపోనప్పుడు దాన్ని నాన్ డిస్ఫంక్షన్గా వ్యవహరిస్తారు. దీని వల్ల 21వ క్రోమోజోమ్‌లో ఒక అదనపు భాగం (ఆర్మ్) ఏర్పడుతుంది. దీన్ని ట్రైజోమీ 21 అంటారు. అంటే కేవలం రెండు మాత్రమే గాక అదనంగా మరొకటి ఉన్న క్రోమ్జోమ్గా పేర్కొంటారు. అవసరమైన దాని కంటే అదనంగా ఉండే ఈ క్రోమ్జోమ్ వల్ల మెదడులో, శరీరంలో అనేక లోపాలు తలెత్తుతాయి. ఇవే వ్యాధి లక్షణాలుగా బయటపడతాయి. అయితే దురదృష్టవశాత్తూ డౌన్స్ సిండ్రోమ్‌కు కారణమైన అంశాన్ని గుర్తించినప్పటికీ... దీని వల్ల ఆ తర్వాత కలిగే మానసిక వికాస లోపాన్ని సరిచేసే విధానం ఇప్పటివరకూ కనుగొనలేదు. డౌన్ సిండ్రోమ్ లక్షణాలు కండరాలు వదులుగా ఉండటం (హైపోటోనియా) కళ్లు పైవైపునకు ఉండటం - మధ్య నుంచి జారుతున్నట్లుగా ఉండటం (అప్‌వర్డ్ స్లాంటింగ్ పాల్పెబ్రల్ ఫిషర్) చప్పిడి ముక్కు (నేసల్ బ్రిడ్జ్ ఫ్లాట్‌గా ఉండటం) పొట్టిగా, లావుగా ఉండటం చెవులు కిందికి ఉండటం (లో-సెట్ ఇయర్స్) అరచేతిపై కాలిపై ఉండే గీతలు తక్కువగా ఉండటం చప్పిడి ముఖం (ఫ్లాట్ ఫేస్) జాయింట్స్ వద్ద ఎముకలను ఎక్కువగా వంచగలగడం (హైపర్ ఎక్స్‌టెండింగ్ జాయింట్స్) పెద్ద నాలుక, చిన్న నోరు కాలి బొటన వేలికీ, రెండోవేలికీ మధ్య ఉన్న ఖాళీ ఎక్కువగా ఉండటం... వంటి శారీరక లక్షణాలు ఈ సమస్యను క్లినికల్‌గా గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఇతర సమస్యలు థైరాయిడ్ లోపం పుట్టుకతోనే గుండె సమస్యలు (కంజెనిటల్ హార్ట్ డిసీజెస్), వినికిడి లోపం, ఏడీహెచ్‌డీ (దుడుకు స్వభావం, ఏకాగ్రత లోపం), ప్రవర్తన రుగ్మతలు (కాండక్ట్ డిజార్డర్స్), ఆటిజమ్ వంటి లక్షణాలూ కూడా కనిపిస్తాయి. ఈ పిల్లల్లో ఐక్యూ తక్కువగా ఉండటం, నడక, మాట కాస్త ఆలస్యంగా రావడం వంటివి గుర్తించవచ్చు. కొందరిలో జీర్ణకోశ వ్యవస్థ లోపాలు, కంటి లోపాలు కూడా కనిపిస్తాయి. రోగ నిరోధక వ్యవస్థ లోపాలు, లుకేమియా, మతిమరపుతో పాటు సైకోసిస్ వంటి మానసిక సమస్యలూ వీరిలో కనిపించడం ఎక్కువ. ఇక చర్మవ్యాధులు కూడా వస్తుంటాయి. గతంలో అంటే... 1900వ ప్రాంతంలో ఈ వ్యాధికి గురైన పిల్లల గుండెజబ్బులు, ఇతర ఇన్ఫెక్షన్ల కారణంగా పదోఏడు నిండకముందే మరణించేవారు. కానీ ఇప్పుడు 80 శాతం మంది డౌన్ సిండ్రోమ్ ఉన్నవారు 50 ఏళ్లు వచ్చేవరకూ జీవిస్తున్నారు. అవసరమైన పరీక్షలు (ముఖ్యంగా థైరాయిడ్, గుండె సంబంధమైనవి) చేయిస్తూ ఉండటం, సమస్యలకు తగిన విధంగా చికిత్స చేయించడం అవసరం. దీనితోపాటు మానసిక వికాసానికి ప్రత్యేకమైన శిక్షణ ఇప్పించడం కూడా ముఖ్యం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ (ఎన్ఐఎమ్హెచ్) వంటి అనేక సంస్థలతో పాటు అనేక ఇతర మానవీయ సంస్థలు ఈ పిల్లలకు అవసరమైన శిక్షణను చిత్తశుద్ధితో అందిస్తున్నాయి. అయితే వ్యాధితోనే పుట్టిన పిల్లల విషయంలో తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉన్నా... తగిన వయసులోనే గర్భం దాల్చడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలే ఈ జబ్బును నివారించడానికి ఉపయోగపడతాయి. ఇక గర్భవతులు డాక్టర్లు సూచించిన మేరకు తగిన పరీక్షలు చేయించుకోవడం కూడా అవసరమే. ఈ రోజుల్లో 50 ఏళ్ల వరకు జీవిస్తున్నారు గతంలో అంటే... 1900 వ ప్రాంతంలో ఈ వ్యాధికి గురైన పిల్లల గుండెజబ్బులు, ఇతర ఇన్ఫెక్షన్ల కారణంగా పదో ఏడు నిండకముందే మరణించేవారు. కానీ ఇప్పుడు 80 శాతం మంది డౌన్ సిండ్రోమ్ ఉన్నవారు 50 ఏళ్లకు పైబడి జీవిస్తున్నారు. -
పాపాయి నవ్వులేవీ...!
* 1991 నుంచి తగ్గుతున్న ఆడపిల్లల జననం * పిల్లల శాతంలో అట్టడుగున వైఎస్సార్ జిల్లా సాక్షి, హైదరాబాద్: నట్టింట పాపాయి నవ్వులు వినిపించడం లేదు. ఆడపిల్లలను తల్లి గర్భంలోనే చిదిమేస్తున్నారు. ఒకవేళ పుట్టినప్పటికీ లింగ వివక్ష కారణంగా వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లల శాతం ఏటికేటికీ తగ్గిపోతోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా 1991 నుంచి ఇప్పటివరకు ఆరేళ్ల లోపు ఆడ పిల్లల శాతం భారీగా తగ్గుతూ వస్తోంది. తాజా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో వెయ్యి మంది మగ పిల్లలకు 935 మంది మాత్రమే ఆడ పిల్లలు ఉన్నారు. 1991లో ఆరు సంవత్సరాలలోపు ఆడ పిల్లల శాతం 975 ఉండగా.. 2001లో 961కి పడిపోయింది. 2011లో మరింతగా 935కి దిగజారి పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మంది మగ పిల్లలకు 941 మంది ఆడ పిల్లలే ఉన్నారు. మొత్తంగా ఆరేళ్లలోపు ఆడ పిల్లల సంఖ్య 2001 నుంచి 2011 మధ్య కాలంలో ఏకంగా 33 శాతం తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంలో వైఎస్సార్ జిల్లా మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ జిల్లాలో ఆరేళ్లలోపు వెయ్యి మంది మగ పిల్లలకు 918 మంది ఆడ పిల్లలు మాత్రమే ఉన్నారు. -
తల్లి గర్భంలో నుంచే వివక్షత
ఒంగోలు టౌన్ : అసంఘటిత రంగం నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో మహిళలు ముందుంటున్నప్పటికీ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే వారిపై వివక్షత మొదలవుతోందని ఎస్ఎఫ్ఐ అఖిల భారత మాజీ అధ్యక్షుడు వై.వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న వివక్షతను ధైర్యంగా, నిర్భయంగా ఎదిరించాలని పిలుపునిచ్చారు. స్థానిక రైజ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన విద్యార్థినుల రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక తరగతుల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇంట్లోపని పూర్తిగా అమ్మాయిలే చేయాలని, అబ్బాయిలు చేయడం తప్పు అంటూ కుటుంబం నుంచే మహిళలను చిన్నచూపు చూస్తున్నారని ఆందోళన చెందారు. మార్కెట్లో ఏ వస్తువు అమ్ముడుపోవాలన్నా పెట్టుబడిదారులకు తెలిసిన సూత్రం అమ్మాయిలను అశ్లీలంగా చూపించడమేనని మండిపడ్డారు. దీంతో అశ్లీలత పెరిగిపోయి అభ్యుదయ భావాలు తగ్గిపోతున్నాయని వైవీ పేర్కొన్నారు. తొలుత స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం ఆశయాలతో కూడిన ఎస్ఎఫ్ఐ పతాకాన్ని రాష్ట్ర సహాయ కార్యదర్శి రాణి ఆవిష్కరించారు. ఇటీవల మృతిచెందిన అమరవీరులకు సంతాప తీర్మానాన్ని విశాఖ జిల్లా ఎస్ఎఫ్ఐ కన్వీనర్ చిన్నారి ప్రవేశపెట్టారు. శిక్షణ తరగతుల్లో డాక్టర్ ఉదయని, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహమ్మద్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కిరణ్, రఘురామ్, రాష్ట్ర నాయకులు సోఫియా, తులసి పాల్గొన్నారు.