పాపాయి నవ్వులేవీ...!
* 1991 నుంచి తగ్గుతున్న ఆడపిల్లల జననం
* పిల్లల శాతంలో అట్టడుగున వైఎస్సార్ జిల్లా
సాక్షి, హైదరాబాద్: నట్టింట పాపాయి నవ్వులు వినిపించడం లేదు. ఆడపిల్లలను తల్లి గర్భంలోనే చిదిమేస్తున్నారు. ఒకవేళ పుట్టినప్పటికీ లింగ వివక్ష కారణంగా వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లల శాతం ఏటికేటికీ తగ్గిపోతోంది.
పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా 1991 నుంచి ఇప్పటివరకు ఆరేళ్ల లోపు ఆడ పిల్లల శాతం భారీగా తగ్గుతూ వస్తోంది. తాజా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో వెయ్యి మంది మగ పిల్లలకు 935 మంది మాత్రమే ఆడ పిల్లలు ఉన్నారు. 1991లో ఆరు సంవత్సరాలలోపు ఆడ పిల్లల శాతం 975 ఉండగా.. 2001లో 961కి పడిపోయింది. 2011లో మరింతగా 935కి దిగజారి పోయింది.
గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మంది మగ పిల్లలకు 941 మంది ఆడ పిల్లలే ఉన్నారు. మొత్తంగా ఆరేళ్లలోపు ఆడ పిల్లల సంఖ్య 2001 నుంచి 2011 మధ్య కాలంలో ఏకంగా 33 శాతం తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంలో వైఎస్సార్ జిల్లా మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ జిల్లాలో ఆరేళ్లలోపు వెయ్యి మంది మగ పిల్లలకు 918 మంది ఆడ పిల్లలు మాత్రమే ఉన్నారు.