కోమల సౌందర్యం
⇔ లిప్‌స్టిక్ వేసే ముందు పెదవులకు సన్‌స్క్రీన్ లోషన్ రాయాలి. పెదవుల మీద చర్మం మరీ సున్నితంగా ఉంటుంది. మిగతా శరీరంతో పోలిస్తే పెదవుల మీద సూర్యకిరణాల తాకిడి మరీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మాత్రపు రక్షణ తప్పనిసరి.
⇔ పెదవులు పొడిబారి చర్మం పొట్టులా రాలే సమస్యతో బాధపడే వాళ్లు లిప్‌కలర్ వేసుకోవాలంటే ముందుగా పెదవులకు లిప్‌బామ్ కాని, కోల్డ్‌క్రీమ్ కాని రాయాలి.
⇔ పెదవుల మీద పొడిబారిన చర్మాన్ని చాలా సున్నితంగా తొలగించాలి. వ్యాక్సింగ్, పళ్లతో కొరకడం వంటివి... ఏది చేసినా సమస్య జటిలమవుతుంది. లిప్‌స్టిక్ వేసుకునే అలవాటున్న వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. మెత్తటి టవల్‌తో పెదవుల మీద మెల్లగా రుద్దుతూ పొడిబారిన చర్మాన్ని వదిలించాలి. ఆ తర్వాత కొద్దిగా కోల్డ్‌క్రీమ్ తీసుకుని పలుచగా రాసి ఆ పైన లిప్‌స్టిక్ వేయాలి.
⇔ పెదవులు మెరవాలంటే లిప్‌స్టిక్ వేసిన తర్వాత లిప్‌గ్లాస్ వేయాలి. పెదవులు సహజంగా ఉన్న రంగులోనే మెరుస్తూ కనిపించాలంటే లిప్‌గ్లాస్ మాత్రమే వాడాలి.
⇔ నిద్రపోయే ముందు లిప్‌స్టిక్ తొలగించడాన్ని ఎట్టి పరిస్థితిలోనూ నిర్లక్ష్యం చేయరాదు. రాత్రంతా లిప్‌స్టిక్ ఉన్నట్లయితే పెదవులు నల్లబడడమే కాక ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.