కర్నూలు జిల్లా నందికొట్కూర్‌లో పదే పదే బ్యాంకుకు వచ్చి, నోట్ల మార్పిడి కాక బ్యాంకులోనే గుండెపోటుతో కుప్పకూలి చనిపోయిన బాలరాజ్ (65)
నోట్ల రద్దుతో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రాణాలు చిత్తు కాగితాలయ్యాయి. ఇంకెన్నో సామాన్యుల జీవితాలకు... ఊపిరి బంద్ అయింది.
నోటు రద్దయింది... పెద్ద నోటు రద్దయింది.పెద్దవాళ్లకు కష్టం వచ్చిందా? ఏమో! ఇప్పటి దాకా పెద్దవాళ్లెవరూ క్యూలో కనపడలేదు. లాఠీ దెబ్బలు తినలేదు. గుండెపోటుతో చనిపోలేదు. అయినవాళ్లను... ఆసుపత్రుల గడప దగ్గర పోగొట్టుకోలేదు. మరి పెద్ద నోటు రద్దయి... ఎవరి చావుకొచ్చింది? చిల్లరతో సాగించే జీవితాల చావుకొచ్చింది. కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు...
అసలు వాళ్లకేం కాలేదు కానీ... అత్తెసరు వాళ్ల ఉసురుకొచ్చింది! ఒక శుభ నిర్ణయం తీసుకున్నప్పుడు పరిణామాలు కూడా శుభప్రదంగా ఉండాలి కదా! టైస్టుల దగ్గరున్న దొంగనోటు ఖతం అవ్వాల్సిందే... అలాగని సగటు మనిషి టైకు గురి కావడం కరెక్టు కాదేమో!
లేబర్‌కి కూలీ దొరకడం లేదు. రైతుకు గంజి నిలవడం లేదు. మధ్యతరగతికి మర్యాద మిగలడం లేదు. రోగికి మందు... పెళ్లికి మేళం... చావుకు డప్పు... ఊ(హు(! ఇంత పెద్ద నిర్ణయానికి ప్రణాళిక, ముందుచూపు... మానవత్వం... ఏమయ్యాయి? నల్లధనం మకిలీయే. దాంతో ఆడుకోవడం వెకిలియే. ఓటుకు నోటు... థూ!! ఉండకూడదు దానికి చోటు! నీతులు చెప్పే నాయకులపై, వాళ్లకు బాకాలూదే నాయాళ్లపై... పడాలి వేటు. ఈ పచ్చకామెర్లగాళ్లని కడిగేయాలి. పచ్చనోటుకు పట్టిన మకిలిని కడిగేయాలి. దాని వల్ల జబ్బు పడ్డ ఆర్థిక వ్యవస్థను నయం చేయాల్సిందే. పారలల్ ఎకానమీకి పాడె కట్టాల్సిందే. పవర్‌ఫుల్ డెసిషన్‌లు తీసుకోవాల్సిందే. ఫైట్ చేయాల్సిందే! కానీ, పెద్దోడికో నీతి, పేదోడికో నీతి ఉండకూడదు. పెద్దోడికి స్పెషల్ ట్రీట్‌మెంట్, మనలాంటోళ్లకి స్ట్రీట్ ట్రీట్‌మెంట్ నహీ చలేగా! సైన్యంలా పోరాడటానికి జనం సిద్ధం... తయార్ హై! మంచి నిర్ణయానికి అందరం సమ్మతులమే, సైనికులమే. మరి పోరాడాలంటే సైనికుడికి కూడా... కూడు కావాలిగా! ప్రభుత్వాలు సైనికుడికి ఇచ్చినంత పోషణ మనకూ కలిగించాలి. పెరిషబుల్ ప్రాడక్ట్స్‌లా... అంటే... ఆకుకూరలు, టమాటాల్లా... జనం వాడిపోకూడదు, కుళ్లిపోకూడదు కదా! అన్నం లేక, మందుల్లేక, వైద్యం అందక, పాల డబ్బాలు లేక వెన్నూదన్నూ లేక, కాలసర్పాల్లాంటి క్యూలలో నిలబడ లేక మనబోటి సామాన్యులైన దేశభక్తులు కూలబడిపోతుంటే, కొందరు కాటికెళ్లిపోతుంటే కుఛ్ కరో... కుఛ్‌తో కరో. మా డబ్బుల్లోంచే మాకు... కొంత చిల్లర ఇవ్వండి మహాప్రభో!
ప్రాణం తీసిన పోపుల పెట్టె
ఆమె వేదన ఆమె ప్రాణం తీసింది. ఆమెను పోగొట్టుకున్న భర్త ఒంటరి వాడయ్యాడు. పెద్ద నోట్ల రద్దు ఒక దంపతుల జీవితంలో తుపాను రేపుతుందని ఊహించామా? అనంతపురం జిల్లా తనకల్లు మండలం బాలసముద్రంలో నివసించే 28 ఏళ్ల రెడ్డెమ్మ పొదుపు మనిషి. ఏ కష్టం ఎప్పుడొస్తుందో... ఇంట్లో నాలుగు డబ్బులు పొదుపు చేసి ఉంచడం మేలు కదా అని... తినీ తినక, ఆడంబరాలకు పోక దాదాపు రూ. 40 వేలు దాచింది. ఆ డబ్బును పెద్ద నోట్లలోకి మార్చి పోపులడబ్బాలో దాచుకుంది.
కానీ, నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడ్డాక ఆమె సతమతమయ్యింది. చివరకు భర్తకు ఈ విషయం తెలియచేసి డబ్బును ‘ఆంధ్రా ప్రగతి గ్రామీణ బ్యాంక్’ (ఏ.పి.జి.బి)లో తన ఖాతాలో వేయాల్సిందిగా కోరింది. కానీ, ఆమె భర్త కొండప్పలో ఎన్నో భయాలు రేగాయి. అప్పటికే భార్య పేరున ప్రభుత్వం నుంచి పక్కా ఇల్లు మంజూరైంది కనుక బ్యాంకులో ఈ డబ్బు కడితే మంజూరైన ఇంటిని రద్దు చేస్తారా? పన్నులు వేస్తారా? వంటి సందేహా లతో ఆ డబ్బును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ సంగతి తెలిసిన రెడ్డెమ్మ కష్టపడి దాచిన సొమ్ము తన చేతి కింద లేకపోవడంతో కలత చెందింది. భర్తతో గొడవ పడింది. నవంబర్ 20 ఆదివారం రాత్రి భర్త కొండప్ప వ్యాపారం పని మీద ధర్మవరం వెళ్లగా జీవితం మీద విరక్తి పుట్టి ఉరి వేసుకుంది. మధ్యలో లేచిన పిల్లలు అమ్మను అలా చూసి కేకలు పెట్టినా ఫలితం లేకపోయింది. పెద్ద నోట్ల రద్దు బాధలు, కుటుంబ కష్టాలు భరించలేక పండంటి కాపురాన్ని వదులుకోని ఆ తల్లి వెళ్ళిపోయింది. ఇంట్లో అత్య వసరాల నిమిత్తం ఆడవాళ్లు దాచుకునే ప్రతి పైసా ఎంతో విలువైనది. దాని మీద సర్వహక్కులు వారివే. పెద్దనోట్ల రద్దుతో ఇలాంటి గృహిణులు ఎందరో తమ డబ్బు మీద హక్కు కోల్పోయారు. ప్రాణం ఒదులుకున్నారు.
కూర వండమన్నాడు... అన్నం తినలేదు!
నవంబర్ 16. చిత్తూరుకి చెందిన రిటైర్డ్ టీచర్ రత్నపిళ్లై ప్రాణం విడిచిన రోజు. మరణానికి కారణం- బ్యాంకు ముందు క్యూ. ఆ రోజు అతనికి ఇంట్లో అద్దెకున్న వాళ్లు అద్దె డబ్బు పదివేలిచ్చారు. అదివరకే దాచుకున్న 40 వేల డబ్బు కూడా ఉండింది. అదంతా 500, 1000 నోట్లే. ఆ డబ్బుతో బ్యాంకులో కుదవ పెట్టిన బంగారాన్ని విడిపించాలని నిర్ణయించుకుని ఆ ఉదయం నడుచుకుంటూ వెళ్లి చికెన్ తెచ్చిచ్చాడు. కూర వండిపెట్టమని కొడుకుతో స్కూటర్‌లో బ్యాంకుకు వెళ్లాడు. ఆ తరువాత భార్యకు ఫోన్. క్యూలో నిలబడి... నిలబడి... ఉన్నట్టుండి కూలబడిపోయాడని వార్త. హాస్పిటల్‌కు తీసుకుని పోతే అప్పటికే ప్రాణం పోయిందన్నారు. ‘ఇదిగో వస్తానని చెప్పినాయన మాటామంతీ లేక కట్టెలా నా ముందు కనిపిస్తే ఏం చేసేది! మా కుటుంబంలో పెద్ద దిక్కు ఆరి పోయినాది. నోట్ల మార్పిడి దేశాన్ని మార్చిందో లేదో తెలీదు కానీ మా కుటుం బాన్ని దిక్కులేకుండా చేసి రోడ్డున పడేసినాద’ని దుఃఖిస్తోంది భార్య జ్ఞానేశ్వరి.
బతుకు ఖరీదు 4 వేలు
డెబ్భై మూడేళ్ల సాయిల్ల అయిలయ్యది సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పంచాయితీ లోని సంగుపల్లి. అతని దగ్గర నాలుగు వేల రూపాయల పాత నోట్లున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ నెల 16న తన దగ్గర ఉన్న ఆ నోట్లను మార్పిం చుకోడానికి గజ్వేల్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్రాంచ్‌కి వెళ్లాడు. గంటల తరబడి క్యూలో నిలుచోలేక సొమ్మసిల్లి పడిపోయాడు. కుడి కాలు తుంటి విరిగింది. రోజు రోజుకూ నొప్పి ఎక్కువైంది. బ్యాంకుకు వెళ్లలేని పరిస్థితి. నాలుగు వేలు ఏమైపోతాయో అని బెంగ. దీంతో ఆవేదనకులోనై వారం క్రితం ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని చనిపోయాడు.
పాతనోటు... గుండెపోటు
కరీంనగర్ జిల్లాకు చెందిన అంజాద్ ఆలీ వ్యవసాయ మార్కెట్‌లో సెక్యూరిటీ గార్డు. వచ్చే జీతంతో ఇంటి అవసరాలు తీరక, పదివేలు అప్పు చేశాడు. అప్పు వడ్డీతోపాటు పెరుగుతోంది. ఇంకా ఎప్పుడు తీరుస్తావంటూ అప్పు ఇచ్చిన వాళ్లు నిలదీస్తున్నారు. విధి లేక చెల్లెలింటికి వెళ్లాడు ఆలీ. అప్పులోళ్లు ప్రాణం నిలవనివ్వడం లేదని, ఆదుకోమన్నాడు. అన్న బాధ చూడలేక తన దగ్గరున్న పదివేలు ఇచ్చిందామె. ఆ డబ్బుతో అప్పు తీరుద్దామని వెళ్లాడు ఆలీ. అయితే ఆ సమయంలోనే ఐదు వందలు, వెయ్యి నోట్లు చెల్లవనే ప్రకటన వచ్చింది. ఈ నోట్లు నాకొద్దు, కొత్త నోట్లతో అప్పు తీర్చమన్నారు అప్పులవాళ్లు. చేతిలో డబ్బు ఉంది... అప్పు తీరడం లేదు. ఆ నోట్లు మార్చడానికి చేసిన ఏ ప్రయత్నమూ సఫలం కాలేదు. రోజు రోజుకీ ఆందోళన పెరిగిపోయింది. అది గుండెపోటు రూపంలో అతడి ప్రాణాలను బలి తీసుకుంది.
బ్యాంకుతో యమగండం
రమాబాయి, చంద్రమణి ఆలుమగలు. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని చిన్న పల్లె వాళ్లది. 20 రోజుల కిందట భర్త చంద్రమణికి సుస్తి చేసింది. భార్య చంద్రమణి చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎన్ని దవాఖానాల్లో చూపించినా గుణం కనిపించలేదు. చివరకు ఆదిలాబాద్ రిమ్స్‌కు తీసుకుపోతే చంద్రమణి రెండు కిడ్నీలు పనిజేస్తలేవని, లివర్ ప్రాబ్లమ్ కూడా ఉందని చెప్పారు. హైదరాబాద్‌కు తీసుకుపోండి అని సలహా ఇచ్చారు. అప్పటికే అయిదు వందలు, వెయ్యి నోట్లు రద్దయినాయి.
పైసల్లేకుండా హైదరాబాద్ ఎట్ల పోవాలే అని డబ్బు కోసం బ్యాంక్‌కి పోతే చెక్ ఆమె పెనిమిటి చంద్రమణి పేర్న ఉన్నది కాబట్టి అతడే రావాలని పైసలియ్యకుండా వెనక్కి పంపాడు బ్యాంక్ మేనేజర్. దాంతో ఆమె రిమ్స్‌కొచ్చి మొన్న 23 తారీఖున ప్రైవేట్ వెహికిల్‌లో భర్తను దీస్కోని, వాళ్ల ఖాతా ఉన్న నార్నూర్ ఎసీబీహెచ్ బ్యాంక్‌కి పోయింది. అతణ్ణి చూసి 24 వేల రూపాయలను రమాబాయి చేతిలో పెట్టారు బ్యాంక్ సిబ్బంది. అది చూసి ఆమె ‘మా ఎక్కౌంట్ల లక్షకు పైనే ఉంటే.. మీరు 24 వేలే చేతిల వెడ్తిరి?’ అని నిలదీసింది. రూల్స్ ప్రకారం అంతే ఇస్తాం అని చెప్పాడు బ్యాంక్ మేనేజర్. ఎంత ప్రాథేయపడినా వినలేదు. చేసేదేమీ లేక ఆ డబ్బుతోనే హైదరాబాద్ చేరుకున్నారు ఆ భార్యాభర్తలు. ఇప్పడు వాళ్ల పరిస్థితి దేవుడికే ఎరుక!
వ్యాపారం పోయింది! ఊపిరి ఆగింది!!
పోలేపల్లె వెంకట నారాయణ వై.ఎస్.ఆర్ కడపజిల్లా వేంపల్లెలో ఓ చిన్న వ్యాపారి. కూరగాయలు అమ్ముతూ భార్య, ముగ్గురు పిల్లల్ని పోషించు కుంటున్నాడు. సాధారణరోజుల్లోనే వ్యాపారం అంతంతమాత్రమే అనుకుంటే పెద్ద నోట్ల తర్వాత పరిస్థితి పూర్తిగా కుదేలయ్యింది. రూపాయి బేరం రావడం లేదు. పైగా కూరగాయలు కొనడానికి రోజువారీ చేసే అప్పు, దాని మీద వడ్డీ పెరిగిపోసాగాయి. చేతిలో డబ్బు ఆడట్లేదు... ఇంట్లో కుంపటి వెలగడం లేదు. దాంతో అతడు హఠాత్తుగా జబ్బు పడ్డాడు. ‘కూరగాయలు అమ్మగా వచ్చే సొమ్మే మా కుటుంబానికి ఆధారం. పెద్ద నోట్ల రద్దుతో ఒక్కసారిగా వ్యాపారాలు పడిపోయాయి. పెద్ద నోట్లు చెల్లని పరిస్థితి. చిన్న నోట్లు దొరకని దుఃస్థితి. మా ఆయన అప్పటికే వ్యాపారం కోసం లక్ష రూపాయల దాకా అప్పులు చేశారు. అవన్నీ మా ఆయనను బాగా కుంగ దీశాయి’ అని వెంకట నారాయణ భార్య జ్యోతి కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్పింది.
కడపలో చికిత్స చేయిస్తున్న సమయంలోనే వెంకట నారాయణ పరిస్థితి విషమించింది. మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే కన్నుమూశాడు. భార్య, పసివాళ్ళయిన ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి అగమ్యంగా మారింది. నోట్ల ఉపసంహరణతో వ్యాపారాలు లేక, ప్రాణాల మీదకొచ్చిన ఇలాంటి కుటుంబాల కథలు దేశవ్యాప్తంగా ఎన్నెన్నో!