
త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో బోలెడన్ని చిన్న చిన్న వస్తువులను మాత్రమే కాదు. ఏకంగా కార్లనే ప్రింట్ చేసేయవచ్చు అంటోంది చైనీస్ కంపెనీ పాలీమేకర్. అనడం మాత్రమే కాదు.. ఇటలీ కంపెనీ ఎక్స్‌ఈవీ సాయంతో ఫొటోలో కనిపిస్తున్న కారును ప్రింట్ చేసేసింది కూడా. చూసేందుకు చిన్నగా అనిపిస్తున్నా దీని ప్రత్యేకతలు బోలెడు. పూర్తిగా విద్యుత్తుతో నడవడం వీటిల్లో ఒక్కటి మాత్రమే. ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 140 కిలోమీటర్ల దూరం వరకూ గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. కారు మొత్తాన్ని ప్రింట్ చేసేందుకు మూడు రోజుల వరకూ సమయం పడుతుందని, ప్రత్యేకమైన ప్లాస్టిక్‌తో పాటు కొన్ని ఇతర పదార్థాలను ఇందులో వాడామని అంటున్నారు పాలీమేకర్ సీఈవో డాక్టర్ లూ షిఫాన్.
త్రీడీ ప్రింటింగ్ కారణంగా కారులో ఉండాల్సిన విడి ప్లాస్టిక్ భాగాల సంఖ్య రెండు వేల నుంచి ఏభై ఏడుకు తగ్గిపోయిందని, ఫలితంగా మామూలు వాటితో పోలిస్తే చాలా తేలికగా ఉంటుందని లూ తెలిపారు. ఇంకో ఏడాదిలోపు అందుబాటులోకి వచ్చే ఈ కారు కోసం ఇప్పటికే తాము ఏడు వేల ఆర్డర్లు అందుకున్నామని చెప్పారు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ తయారీ రంగంలో మరింత విస్తృత స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు ఎక్స్‌ఈవీ దోహదపడుతుందని తాము అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇంతకీ ఈ బుల్లి కారు ఖరీదెంతో తెలుసా? దాదాపు 3.5 లక్షలు!
Comments
Please login to add a commentAdd a comment