
చట్టం ముందు పశువులూ సమానమే!
చట్టం ముందు అందరూ సమానమే అని చెబుతారు గానీ, అన్నీ సమానమే అనరు. ఒకానొకప్పుడు మాత్రం చట్టం ముందు అన్నీ సమానమే అనే సూత్రాన్ని తు.చ. తప్పకుండా పాటించేవారు. మధ్యయుగాల నాటి ఆ సర్వసమాన చట్టాలు మనుషులకు మాత్రమే పరిమితం కాదు. నల్లులు, బల్లులు, కొంగలు, కోళ్లు, పిల్లులు, ఎలుకలు, పందులు, ఏనుగులు వంటి సమస్త క్రిమికీటకాలకు, పశుపక్ష్యాదులకు కూడా ఇవి వర్తించేవి. చట్టరీత్యా వాటికి నేర విచారణ కూడా జరిగేది. నాటి సర్వసమాన చట్టాలకు ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఫ్రాన్స్‌లో 1494 సంవత్సరంలో జరిగిన సంఘటన ఇది. ఉయ్యాలలో నిద్రిస్తున్న చిన్నారిపై దాడిచేసిన ఒక పందిని అక్కడి రక్షక భటులు అరెస్టుచేసి, న్యాయస్థానం ముందుకు తీసుకొచ్చారు.
ఘనతవహించిన న్యాయస్థానం చట్టబద్ధంగా విచారణ చేపట్టింది. సాక్షుల నుంచి వాంగ్మూలాలూ తీసుకుంది. సాక్ష్యాలన్నీ పందికి వ్యతిరేకంగా ఉండటంతో, దానికి మరణశిక్ష విధించింది. ఆ రోజుల్లో ఫ్రాన్స్‌లోనే మరో కోర్టు బార్లీ పంటను నాశనం చేసిన ఎలుకలపై న్యాయవిచారణ చేపట్టింది. అంతకంటే విచిత్రం ఏమిటంటే ఎలుకల తరఫున వాదించడానికి బార్తలోమ్యూ చేసెనీ అనే న్యాయవాది కూడా సిద్ధపడ్డాడు. నిందితులైన ఎలుకలు విచారణకు హాజరు కాలేదు. అవి ఎందుకు హాజరు కాలేదని న్యాయమూర్తి ప్రశ్నిస్తే, వాటికి సమన్లు అందలేదని ఒకసారి, వేరే ఊరికి వెళ్లాయని మరోసారి, వీధుల్లో తిరిగే పిల్లులకు భయపడి అవి కోర్టుకు రాలేకపోయాయని ఇంకోసారి... సాకులు చెబుతూ వచ్చాడు. ఇక న్యాయమూర్తి కూడా చేసేదేమీ లేక వాటిపై కేసును ఎత్తివేశాడు.